వావ్ అనేలా..
ABN, Publish Date - Jan 27 , 2024 | 03:58 PM
దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్)లో అత్యంత కీలకమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు మహర్దశ వచ్చింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న స్టేషన్ పునరాభివృద్ధి పనులు ఊపందుకున్నాయి.
- శరవేగంగా సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి
- అంతర్జాతీయ స్థాయిలో వసతి సౌకర్యాలు
- పరిసరాలు ఆహ్లాదంగా ఉండేలా దిద్దుబాటు
- మల్టీలెవల్ పార్కింగ్.. ఫుడ్ కోర్టుల ఏర్పాటు
- ప్రస్తుతం రెండు వైపులా జోరుగా పనులు
- వ్యయం రూ.720 కోట్లు.. 36 నెలల్లో పూర్తి
- గత ఏప్రిల్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన
సికింద్రాబాద్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్)లో అత్యంత కీలకమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు మహర్దశ వచ్చింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న స్టేషన్ పునరాభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవతో గతేడాది ఏప్రిల్ 23న ప్రధాని మోదీ పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.720 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ పనులను 36 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా విధించుకున్నారు. నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగించే ఈ స్టేషన్‌లో కనీస సదుపాయాలు కరువై ప్రయాణికులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు.
అతిపెద్ద సమస్య పార్కింగ్
స్టేషన్ వద్ద పార్కింగ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. రైలెక్కే వారిని దింపేందుకు వస్తున్న వాహనాలు, ఆటోలు, ఇతర వ్యక్తిగత వాహనాలకు పార్కింగ్ సౌకర్యం సరిగ్గా లేదు. స్టేషన్ ముందుభాగం చాలావరకు ఆర్టీసీ బస్సులు ఉంటుండడం, అడ్డందిడ్డంగా ఆటోలు నిలుపుతుండడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వ్యక్తిగత వాహనాల పార్కింగ్ రుసుము కూడా అధికంగా ఉండడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మారనున్న రూపురేఖలు
స్టేషన్ పునరాభివృద్ధిలో భాగంగా అత్యాధునిక సదుపాయాలు కల్పించనున్నారు. ఇంటర్నెట్ సదుపాయం, సైబర్ కేఫెలు, మల్టీలెవల్ పార్కింగ్, ఫుడ్‌కోర్టులు తదితర ప్రపంచస్థాయి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుత స్టేషన్ భవనానికి రెండు వైపులా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఉత్తరం వైపు ప్రస్తుతం ఉన్న బుకింగ్ కార్యాలయ స్థానంలో ప్రయాణికుల సేవలకు అంతరాయం కలగకుండా నిర్మాణ పనులు సులభతరం చేయడానికి తాత్కాలిక బుకింగ్ ఆఫీసు ఏర్పాటు చేశారు. ఆర్పీఎఫ్ నూతన భవనం పనులు దాదాపు పూర్తయ్యాయి.
దక్షిణం వైపు జోరుగా..
స్టేషన్ దక్షిణం వైపు పునాదులకు సంబంధించిన పనులు 80 శాతం పూర్తయ్యాయి. బేస్‌మెంట్-1 స్లాబ్ పనులు 80 శాతం, బేస్‌మెంట్-2 స్లాబ్ పనులు 60 శాతం పూర్తి చేశారు. దక్షిణం వైపు ఉన్న గ్రౌండ్ ఫ్లోర్.. స్టేషన్ నుంచి బయల్దేరే ప్రయాణికుల కోసం డ్రాప్ ఆఫ్ జోన్‌గా, బేస్‌మెంట్ 1 దక్షిణం వైపు తిరుగు ప్రయాణంలో వచ్చే ప్రయాణికుల కోసం పికప్ జోన్‌గా నిర్ణయించారు. బేస్‌మెంట్-2లో 200 కార్లు పార్కింగ్ చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రస్తుత స్టేషన్ భవనం దక్షిణం వైపున మిగిలిన నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు, వాహనాల రాకపోకలు సజావుగా సాగించేందుకు తాత్కాలిక రహదారి ఏర్పాటు చేశారు. దక్షిణం వైపు ప్రస్తుతం ఉన్న భవన విస్తరణతోపాటు నూతనంగా నిర్మించే కొత్త భవన సముదాయ పునాది పనులు 45 శాతం, కాలమ్‌ల పనులు 45 శాతం, గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ పనులు 30 శాతం పూర్తయ్యాయి. స్టేషన్ అవసరాలు తీర్చేందుకు ప్రస్తుతం ఉన్న 11 కేవీ స్థానంలో 33 కేవీ కెపాసిటీ విద్యుత్ సబ్ స్టేషన్లు రెండింటిని నిర్మించనున్నారు. ఇందులో దక్షిణం వైపున ఒక 33 కేవీ ఐఎస్‌ఎస్‌కు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. సివిల్ ఫ్రేమ్, గోడలకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఉత్తరం వైపు మల్టీలెవల్ కార్ పార్కింగ్ (ఎంఎల్‌సీపీ) నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కాజీపేట వైపు నూతనంగా పాదచారుల వంతెన నిర్మాణం జరుగుతోంది.
Updated Date - Jan 27 , 2024 | 04:02 PM