ST welfare funds : దారిమళ్లిన ఎస్టీ సంక్షేమ నిధులు
ABN, First Publish Date - 2022-11-21T02:47:11+05:30
అన్ని పథకాలనూ ఆపేసినట్టే.. గిరిజన సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది. గిరిజన సంక్షేమానికి వివిధ పథకాల రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కోట్లాది రూపాయలనూ రాష్ట్ర ప్రభుత్వం దారి
ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాలంటున్న కేంద్రం
యూసీలు ఇవ్వకుంటే నిధులివ్వబోమని హెచ్చరికలు
నాలుగేళ్లుగా రూ.244 కోట్లకు యూసీలు పెండింగ్
గిరిజనులకు ఖర్చు చేయకుండా యూసీలు ఎలా?
21న కేంద్ర మంత్రిత్వశాఖ సమావేశంలో ఏం చెప్పాలి?
తలలు పట్టుకుంటున్న రాష్ట్ర అధికారులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
అన్ని పథకాలనూ ఆపేసినట్టే.. గిరిజన సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది. గిరిజన సంక్షేమానికి వివిధ పథకాల రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కోట్లాది రూపాయలనూ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించేసింది. ఇచ్చిన నిధులకు కేంద్ర ప్రభుత్వం లెక్కలు అడుగుతుంటే మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో నిధుల వినియోగానికి సంబంధించి యుటిలిటీ సర్టిఫికెట్లు(యూసీ)లు సమర్పించకపోతే నిధులు ఇవ్వబోమని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ రాష్ట్రానికి హెచ్చరికలు పంపింది. ఆర్టికల్ 275(1) నిధులకు సంబంధించిన సమావేశం ఈ నెల 21న జరగనుండటంతో నిధుల వినియోగానికి సంబంధించి ఆ సమావేశంలో కేంద్ర అధికారులకు ఏం చెప్పాలో అని రాష్ట్ర అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సుమారు రూ.244 కోట్లు ఎలా ఖర్చు చేశారో రాష్ట్ర ఆర్థిక శాఖ చెప్పకపోవడమే ఇందుకు కారణం. గిరిజన సంక్షేమం కోసం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి పలు పథకాల ద్వారా నిధులు ఇస్తోంది. ఇందులో ప్రధానంగా ఆర్టికల్ 275(1), పోస్టుమెట్రిక్, ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్పులు, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ సంక్షేమానికి, గిరిజన సబ్ ప్లాన్‌కు కేంద్ర ప్రత్యేక సహాయం తదితర స్కీముల ద్వారా నిధులు ఇస్తోంది. ఈ పథకాలకు కేంద్రమే నూరు శాతం నిధులు సమకూరుస్తోంది. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలో ఈ పథకాలకు సంబంధించి సుమారు రూ.766 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసింది. అయితే అందులో రూ.244 కోట్లకు లెక్కలు చూపించలేదు. దీంతో ఆ నిధులకు సంబంధించిన యూసీలు పంపాలని కేంద్ర అధికారులు పదే పదే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలిస్తున్నారు.
ఖర్చే చేయకుండా యూసీలు ఎలా?
రాష్ట్ర ప్రభుత్వం ఏ శాఖలోనూ ఆయా పథకాలకు సంబంధించి నిధులు ఖర్చు చేయడం లేదు. వివిధ పథకాల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో వేసుకుని ఇతర అవసరాలకు వాడుకుంటోంది. ఈ క్రమంలో కేంద్రం గిరిజనులకు ఇచ్చిన నిధులు కూడా దారిమళ్లాయి. దీంతో గిరిజన సంక్షేమ శాఖలోని పీవోలు ఈ ఖర్చులకు సంబంధించి యూసీలు సమర్పించలేకపోతున్నారు. ఆర్థిక శాఖ అధికారులు మాత్రం నవరత్నాల కింద ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు ఇవ్వాలని గిరిజన సంక్షేమాధికారులకు సూచిస్తున్నారు. గిరిజనులకు ఆయా అవసరాల కోసం ఇచ్చిన నిధులను వాటికే ఖర్చు చేయాలని, ఆవిధంగా ఖర్చు చేయకుండా.. చేసినట్లు ఎలా ఇవ్వగలమని అంటున్నారు. దీంతో ఈ నెల 21 కేంద్ర అధికారులకు ఏం సమాధానాలు చెప్పాలో అర్థంకాక రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు.
దారిమళ్లిన గిరిజన అభివృద్ధి నిధులు
కేంద్రం ఈ మూడేళ్లలో ఇచ్చిన సుమారు రూ.50 వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. దీనిపై కాగ్ అధికారులు ఆడిట్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి ఇచ్చిన నిధులు కూడా దారిమళ్లడంతో రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంఘాలు భగ్గుమంటున్నాయి. సమాజానికి దూరంగా కొండల్లో, కోనల్లో బతుకుతున్న గిరిజనులకు కేంద్రమిచ్చే నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా నిధులిచ్చి ఆదుకోవాల్సి ఉన్నప్పటికీ... వారి నిధులను కూడా వాడుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గిరిజన సబ్‌ప్లాన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహాయాన్ని అందిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానం మేరకు కేంద్రం నిధులు అందిస్తోంది. ఆయా రాష్ట్రాలకు గిరిజన జనాభాను బట్టి నిధులు అందుతాయి. గిరిజనుల విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, ఆదాయ వనరులను పెంచే కార్యక్రమాల కోసం కేంద్రం ఈ నిధులను ఇస్తోంది. ఆ మేరకు ఈ పథకం కింద రాష్ట్రానికి ఈ మూడేళ్లలో ఇచ్చిన నిధుల్లో సుమారు రూ.205 కోట్లకు యూసీలు ఇవ్వలేదు. అంటే ఈ పథకం నిధులు దారిమళ్లాయి. దీంతో గిరిజన సంక్షేమాధికారులు వాటికి సంబంధించిన ఖర్చుల వివరాలు ఇవ్వలేకున్నారు. ఈ మూడేళ్లలో పీవీటీజీలకు కేంద్రం రూ.67.85 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులకు సంబంధించి రూ.35.18 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తెలపలేదు. దీంతోపాటు రాష్ట్రంలోని ఎస్టీ విద్యార్థులకు కేంద్రం ఇచ్చే స్కాలర్‌షిప్పులను ఇవ్వకుండా దారి మళ్లించింది.
అన్ని గిరిజన పథకాలకూ స్వస్తి
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక గిరిజన సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయాయి. అన్నింటికీ నవరత్నాలే దిక్కు అన్న భావనతోనే ప్రభుత్వం ముందుకెళ్తోంది. విదేశీ విద్య పథకాన్ని మూడేళ్ల తర్వాత వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెస్తే నిబంధనాలతో ఒక్క ఎస్టీ కూడా అర్హులుగా నిలవలేకపోయారు. రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీ నిధులు నిలిచిపోయాయి. కల్యాణ పథకాలు, కులాంతర వివాహాలకు ప్రోత్సాహక పథకాలను తిరిగి ప్రారంభించినా ఎవరూ అర్హులు కాని పరిస్థితి ఉంది. చిన్న చిన్న పనులు చేసే గిరిజన కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. సామాజిక భవనాల నిర్మాణాలకు స్వస్తి పలికారు. గిరిజన సహకార కార్పొరేషన్‌కు అత్తెసరు నిధులు విదిలించారు. గత ప్రభుత్వం అమలు చేసిన భూ కొనుగోలు పథకాన్ని ఈ ప్రభుత్వం అటకెక్కించింది. భూమి లేని గిరిజనులకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకుంటే భూమిని కొనుగోలు చేసి ఇచ్చే పథకం అమల్లో ఉండేది. ఒక్కో ఎకరాకు రూ.15 లక్షలు ఖర్చు చేసి గిరిజనులకు భూములను కొనుగోలు చేసి ఇచ్చారు. నివేశన స్థలం లేకపోతే గిరిజనులకు స్థలం కొనుగోలు చేసి కేటాయించారు. జిల్లాల్లో కలెక్టర్లకు నిధులు కేటాయించి వాటిని కొనుగోలు చేసి పంపిణీ చేసే అధికారం అప్పగించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకానికి ఒక్క పైసా కేటాయించలేదు. పైగా ఎస్టీల భూములను లాక్కొని కొత్తగా ఇంటి స్థలాలు ఇస్త్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గిరిజనులకు భూమి హక్కు కల్పించి వారిని స్వావలంబన వైపు అడుగుపెట్టేలా ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం తిరోగమన దిశలోకి తీసుకెళ్తుందని వాపోతున్నారు.
Updated Date - 2022-11-21T02:47:12+05:30 IST