Kodali Nani: మంత్రి జోగి నా జేబులో మనిషి.. కొడాలి నాని షాకింగ్ కామెంట్స్
ABN, First Publish Date - 2022-12-09T21:14:34+05:30
రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తన జేబులో మనిషి అంటూ నిండు సభలో మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) షాకింగ్ కామెంట్ చేశారు.
గుడివాడ: రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తన జేబులో మనిషి అంటూ నిండు సభలో మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) షాకింగ్ కామెంట్ చేశారు. శుక్రవారం గుడివాడలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో స్వయంగా ఒక బీసీ మంత్రి పట్ల అవమానకరంగా మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చేయడం ఆ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. మంత్రిగా జోగి రమేష్ (Jogi Ramesh) ఉంటే తనతో పాటుగా మాజీ మంత్రి పేర్ని నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ల ఏ పనులు ఆగవని అన్నారు. ఒక బీసీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే మంత్రి అయితే తమ చెప్పు చేతల్లో ఉంటాడనే ఆలోచనతో జిల్లాకు చెందిన ఇరువురు మాజీ మంత్రులు రాజీపడి లాబీయింగ్ నడిపి జోగికి మంత్రి పదవి యిప్పించారనే నిజం నేటితో తేటతెల్లమయిందని భావిస్తున్నారు. అయితే కొడాలి నాని వ్యాఖ్యలపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ఒక వెనుకబడిన తరగతికి చెందిన మంత్రి పట్ల అనుచిత వ్యాఖ్యలకు చేస్తూ ఉంటే.. హాజరైన ఆ సంఘం నేతలు చప్పట్లు కొట్టడం విచారకరమన్న భావన వ్యక్తమవుతోంది.
నిండు సభలో బీసీ మంత్రికి అవమానం సిగ్గుచేటు
బీసీల కార్యక్రమానికి వచ్చి ఒక బీసీ మంత్రి పట్ల అవమానకరంగా కొడాలి నాని వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. ఇంత జరుగుతున్నా సభకు హాజరైన బీసీ నాయకులు నోరు మెదపకుండా కూర్చోవడం విచారకమన్నారు. బీసీలను అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేసిన నాని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, కొడాలి నానికి బీసీలు గట్టి గుణపాఠం చెప్పాలని వెంకటేశ్వరరావు హెచ్చరించారు.
Updated Date - 2022-12-09T21:38:59+05:30 IST