టీడీపీ మైనార్టీలకు తోఫాలిస్తే... జగన్ ధోకా చేశారు: ఎమ్మెల్యే అనగాని
ABN, First Publish Date - 2022-10-23T11:12:51+05:30
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనార్టీ ద్రోహి అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనార్టీ ద్రోహి అని, వారి సంక్షేమానికి మంగళం పాడారని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ముస్లీంలను ఓటు బ్యాంకుగా వాడుకుందని, మైనార్టీలకే ఖర్చు చేయాల్సిన రూ.1,683.62 కోట్ల నిధులు దారి మళ్లించిందని ఆరోపించారు. మైనార్టీ సంక్షేమాన్ని కాగితాలకే పరిమితం చేస్తూ.. పథకాల్లో భారీగా కోత విధించారని విమర్శించారు. టీడీపీ మైనార్టీలకు తోఫాలిస్తే... జగన్ మైనార్టీలకు ధోకా చేశారన్నారు.
ఏటా 15 వేల ముస్లింలకు చంద్రబాబు ఫైనాన్స్ కార్పొరేషన్లతో లబ్ది చేకూర్చారని అనగాని సత్యప్రసాద్ అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో మైనార్టీలకు వినూత్న పథకాలు పెడితే వైసీపీ తుంగలో తొక్కిందని, మైనార్టీ కార్పొరేషన్‌ను, స్కిల్ డెవలప్ సెంటర్‌లను నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లల్లో 63 మంది ముస్లీంలపై దాడులు జరిగాయన్నారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దర్గాలు, మసీదులు, ఖబరస్థాన్లు కట్టిస్తే.. నేడు వాటికి రక్షణలేదన్నారు. మైనార్టీలందరూ ప్రభుత్వంపై సమైక్యంగా పోరాడాలని అనగాని సత్యప్రసాద్ పిలుపిచ్చారు.
Updated Date - 2022-10-23T11:12:56+05:30 IST