Chandrababu the leader of TDP : జగన్‌రెడ్డి కేరెక్టర్‌కు కుప్పం అరాచకమే ఉదాహరణ
ABN, First Publish Date - 2022-10-28T06:35:41+05:30
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కేరెక్టర్‌కు కుప్పం నియోజకవర్గంలో చేసిన అరాచకమే ఒక ఉదాహరణగా టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.
పులివెందులలా భయోత్పాతంతో ఓట్లు వేయించుకోలేరు
అభిమానంతో నన్ను గెలిపిస్తున్నారు
నేరుగా అక్కడ గెలవలేక కేసులు, దాడులు
కుప్పం సమీక్షలో చంద్రబాబు వ్యాఖ్యలు
అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కేరెక్టర్‌కు కుప్పం నియోజకవర్గంలో చేసిన అరాచకమే ఒక ఉదాహరణగా టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన గురువారమిక్కడ తన నివాసంలో కుప్పం నియోజకవర్గంపై సమీక్ష జరిపారు. మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ విభాగాల అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్‌చార్జి మునిరత్నం, నేతలు మనోహర్, త్రిలోక్ తదితరులు హాజరయ్యారు. ‘పులివెందులలో మాదిరిగా భయోత్పాతం సృష్టించి ఓట్లు వేయించుకునే అలవాటు కుప్పంలో లేదు. అక్కడి ప్రజలు అభిమానంతో నన్ను గెలిపిస్తూ వస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఒకే గుర్తుపై అన్నిసార్లు గెలిచిన నియోజకవర్గాలు కుప్పం, హిందూపురం మాత్రమే. కుప్పంలో నేరుగా ఎన్నికల్లో గెలిచే మార్గం కనిపించక కేసులు, దాడులు, కుల విద్వేషాలతో ప్రజలను చీల్చడం, టీడీపీ కార్యకర్తలను భయపెట్టడం చేస్తున్నారు. తమకు ఊడిగం చేసే అధికారులను ఉపయోగించుకుంటున్నారు. ఎవరేం చేస్తున్నారో మొత్తం రికార్డు చేయండి.
సమయం వచ్చినప్పుడు అన్నీ వడ్డీతో చెల్లిద్దాం’ అని చంద్రబాబు అన్నారు. వైసీపీ పెడుతున్న కేసులు, చేస్తున్న దాడులు టీడీపీ కార్యకర్తల్లో ఐక్యత పెంచాయని, ప్రజల్లో కూడా వైసీపీ నేతల పట్ల అసహ్యాన్ని పెంచాయని స్థానిక నేతలు చెప్పారు. కుప్పం అభివృద్ధికి పైసా ఇవ్వని జగన్‌రెడ్డి.. అక్కడ తన సభలకు రూ.కోట్లు వెదజల్లారని, హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిపివేశారని ఆరోపించారు.
రెండు దశాబ్దాలు పోటీ చేయక..
మంగళగిరి ఇన్‌చార్జిగా ఉన్న తన కుమారుడు లోకేశ్‌తో ఆ నియోజకవర్గ పరిస్థితిపైనా చంద్రబాబు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీ ఆవిర్భావం తర్వాత 1983, 1985 ఎన్నికల్లో మంగళగిరిలో రెండు సార్లూ గెలిచాం. 1989 నుంచి 2009 వరకూ పొత్తులో మిత్రపక్షాలకు వదిలేశాం. రెండు దశాబ్దాల సుదీర్ఘ కాలం పోటీ చేయకపోవడంతో నియోజకవర్గంలో పార్టీ కొంత బలహీనపడింది. కొన్ని సమస్యలు వచ్చాయి’ అని అన్నారు. ఇప్పుడక్కడ మంచి మార్పు కనిపిస్తోందని.. ఈసారి తిరుగులేని విజయం సాధించి చరిత్రను తిరగరాయాలని లోకేశ్‌కు సూచించారు. కర్నూలు ఇన్‌చార్జి టీజీ భరత్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్‌తోనూ సమీక్షలు జరిపారు. మొత్తం 175 అసెంబ్లీల ఇన్‌చార్జులతో సమీక్ష జరపాలని నిర్ణయించిన చంద్రబాబు ఇప్పటివరకు 111 నియోజకవర్గాల సమీక్షలు జరిపారు. టెక్కలిపై శుక్రవారం సమీక్ష జరగనుంది.
బెయిల్‌పై వచ్చిన కుప్పం నేతలతో భేటీ
కుప్పంలో అక్రమ కేసుల్లో జైలు పాలై, బెయిల్‌పై వచ్చిన పార్టీ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన పర్యటన సందర్భంగా కార్యకర్తలపై జరిగిన దాడులు, పోలీసుల ఏకపక్ష వైఖరి, అరెస్టులపై వివరాలను తెలుసుకున్నారు. జైలులో పరిస్థితులు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల గురించి ఆరా తీశారు.
Updated Date - 2022-10-28T06:35:45+05:30 IST