Paleti Rama Rao: మరణదిన వేడుకలపై ఆసక్తి చూపని చీరాల ప్రజలు.. అసలు ఈ కథేంటంటే..
ABN, First Publish Date - 2022-12-18T18:26:31+05:30
జీవించి ఉండగానే జన్మదినం స్థానే తన మరణ దిన వేడుకలంటూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం పలికిన వైసీపీ నాయకులు, మాజీ మంత్రి పాలేటి రామారావు నిర్వహించిన కార్యక్రమం పట్ల..
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
జీవించి ఉండగానే జన్మదినం స్థానే తన మరణ దిన వేడుకలంటూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం పలికిన వైసీపీ నాయకులు, మాజీ మంత్రి పాలేటి రామారావు నిర్వహించిన కార్యక్రమం పట్ల చీరాల ప్రజలు ఏమాత్రం ఆసక్తి చూపలేదు. అయితే ఆయన ఆహ్వానం మేరకు చీరాల, సమీప ప్రాంతాల నుంచి వచ్చిన పాస్టర్లతోనే కార్యక్రమం జరిగిపోయింది. మాజీమంత్రి పాలేటి రామారావు చీరాలలో మరణ దిన వేడుకల నిర్వహణకు ఆహ్వాన పత్రికలు పంచిన విషయం తెలిసిందే. ఆ మేరకు శనివారం ఉదయం 10.45 సమయంలో స్థానిక ఐఎంఏ హాలులో కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఆహ్వానించిన నలుగురు పాస్టర్లు వేదికను అలంకరించగా సభలో కూడా పాస్టర్లే కనిపించారు. ఆయన కుమారుడితో పాటు మరో ఒకరిద్దరు ఆయన అనుచరులు మాత్రమే కార్యక్రమంలో కనిపించారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి, మంత్రిగా పనిచేయటంతోపాటు, అటు వైద్యునిగా ఇటు రాజకీయ నాయకునిగా నిత్యం ప్రజాసంబంధాలు కొనసాగిస్తున్న పాలేటి వినూత్నంగా కార్యక్రమాన్ని చేపట్టినా ఇతరత్రా ఆత్మీయులు కానీ, అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ హాజరు కాలేదు. ఆ విషయం అటుంచితే ఈ కార్యక్రమ నిర్వహణపై రాజకీయ వర్గాల్లో ఆయా రంగాలకు చెందిన ప్రముఖుల్లో పెద్ద చర్చ సాగింది. గతంలో పాలేటి క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్లు గానీ, ఏ సుప్రభువు పట్ల భక్తితో ప్రత్యేకంగా ప్రార్థనలకు హాజరైన దాఖలాలు కానీ లేవు. అలాంటిది ఆయన పాస్టర్లను ఆహ్వానించి ఈ వినూత్న కార్యక్రమం నిర్వహించటంలో ఆంతర్యం ఏమిటనే చర్చ విస్తృతంగా సాగింది.
చీరాల ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాం ప్రస్తుతం వైసీపీలో ఉండి తన వారసునిగా కొడుకును రంగంలోకి దింపారు. గతంలో పోటీచేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను ఆ నియోజకవర్గంలో జోక్యం చేసుకోకుండా సీఎం జగన్ పక్కన పెట్టారు. ఒక పక్క సీటు విషయంలో వెంకటేష్‌ను ఆదరిస్తామని చెబుతున్నప్పటికీ అక్కడి నుంచి బీసీలను రంగంలోకి దింపుతారన్న ప్రచారం ముమ్మరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీలోనే ఉంటూ నిన్నమొన్నటి వరకు బలరాంతో చెట్టా పట్టాలేసుకుని తిరిగి ప్రస్తుతం సైలెంట్‌గా ఉంటున్న పాలేటి అకస్మాత్తుగా ఈ కార్యక్రమం ద్వారా బయటికి రావటం చర్చనీయాంశమైంది. అయితే తాను బీసీ నాయకుడు కావటంతో సీఎం దృష్టిని ఆకర్షించే లక్ష్యంతోనే కేవలం క్రైస్తవ పాస్టర్లను ఆహ్వానించి వినూత్న కార్యక్రమం చేసుకున్నాడన్న ప్రచారం అధికంగా ఉంది. మరోవైపు ఇటు మీడియా, అటు ప్రజల దృష్టిని ఆకర్షించి తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకే ఇలాంటి కార్యక్రమం నిర్వహించి ఉండవచ్చన్న అంచనాకు కూడా కొందరు వచ్చారు.
Updated Date - 2022-12-18T18:37:06+05:30 IST