దీపావళి ఉత్సవంపై అధికారుల్లో అయోమయం
ABN, First Publish Date - 2022-10-26T15:23:50+05:30
ఏలూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయ (Dwarka Tirumala Chinna Venkanna Temple) అధికారుల తీరు రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది. అధికారులు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలపై భక్తులు విమర్శిస్తున్నారు. తాజాగా దీపావళి (Diwali) సందర్భంగా ద్వారకాతిరుమల పురవీధుల్లో
ఏలూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయ (Dwarka Tirumala Chinna Venkanna Temple) అధికారుల తీరు రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది. అధికారులు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలపై భక్తులు విమర్శిస్తున్నారు. తాజాగా దీపావళి (Diwali) సందర్భంగా ద్వారకాతిరుమల పురవీధుల్లో జరగాల్సిన స్వామి గ్రామోత్సవాన్ని నిలిపేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీపావళి రోజున అమ్మవార్లతో కలిసి చిన వెంకన్న స్వామి ద్వారకాతిరుమల పురవీధుల్లో విహరిస్తారు. ఈ సందర్భంగా స్థానికులు స్వామివారి ఎదుట పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి పండుగను జరుపుకొంటారు. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా దీపావళి ఉత్సవాన్ని నిర్వహించలేదు.
ఈసారి సూర్యగ్రహణం కారణంగా పండుగను దేశమంతా ఈనెల 24న జరుపుకొన్నారు. ఈసారైనా స్వామి వారి గ్రామోత్సవం నిర్వహిస్తారని భక్తులు భావించారు. అయితే ఉత్సవాన్ని కేవలం కోవెలకు మాత్రమే పరిమితం చేశారు. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు దసరా (Dussehra) రోజున జరగాల్సిన కుంకుళ్లమ్మ అమ్మవారి రథోత్సవాన్ని వర్షం కారణంగా రద్దు చేశారు, అలాగే ఈ ఏడాది అశ్విజ మాస బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే వాహన సేవలు, రథోత్సవాన్ని సైతం వాతావరణం అనుకూలించట్లేదు అంటూ రద్దు చేశారు. అయితే దీపావళి రోజున వాతావరణం అనుకూలంగా ఉన్నా కూడా గ్రామోత్సవాన్ని నిర్వహించకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఏ కారణం వల్ల గ్రామోత్సవాన్ని రద్దు చేశారనే విషయాన్ని అధికారులు ఇప్పటివరకూ తెలియజేయలేదు. అలాగే కోవెల ఉత్సవం జరుగుతున్నట్లు ఎవరికీ అధికారిక సమాచారం కూడా ఇవ్వలేదు. ఆలయ ఈవో త్రినాధరావు తన ఏకపక్ష నిర్ణయాలతో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే కొంతమంది అధికారులు మాత్రం దీపావళి రోజున జరిగింది గరుడ ఉత్సవమని.. కోవెల ఉత్సవం కాదని చెబుతున్నారు. దీంతో ఏ ఉత్సవం నిర్వహించారో తెలియని అయోమయ పరిస్థితి అధికారుల్లోనే ఏర్పడింది. అసలు ఆలయంలో ఏ కార్యక్రమం జరుగుతుందనే విషయం సంబంధిత అధికారులకు తెలియకపోవడంపై పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
Updated Date - 2022-10-26T15:23:54+05:30 IST