ధరల సెగతో జపాన్ ఉక్కిరిబిక్కిరి
ABN, First Publish Date - 2022-10-29T00:56:43+05:30
ధరల సెగ (ద్రవ్యోల్బణం)తో జపాన్ కూడా ఉక్కిరిబిక్కిరవుతోంది. అయినా వడ్డీ రేట్లు పెంచకుండా పరిస్థితిని చక్కబెట్టేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రూ.16.49 లక్షల కోట్లతో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన
టోక్యో: ధరల సెగ (ద్రవ్యోల్బణం)తో జపాన్ కూడా ఉక్కిరిబిక్కిరవుతోంది. అయినా వడ్డీ రేట్లు పెంచకుండా పరిస్థితిని చక్కబెట్టేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధరల సెగ నుంచి ప్రజలను ఆదుకునేందుకు 20,000 కోట్ల డాలర్లతో (సుమారు రూ.16,49,600 కోట్లు) ప్రత్యేక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. దీంతో జీడీపీ 4.6 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ప్రధాని కిషిదా చెప్పారు. ఈ ప్యాకేజీ ద్వారా ప్రతి ఇంటికి విద్యుత్, గ్యాస్ బిల్లులపై 300 డాలర్లు సబ్సిడీగా లభిస్తుంది. గర్భిణీలు, బాలింతలకు కూడా 680 డాలర్ల చొప్పున ప్రత్యేక సాయం లభిస్తుంది. ప్రైవేట్ రంగానికి వివిధ రూపాల్లో ప్రకటించిన ప్యాకేజీలను కూడా కలుపుకుంటే ఈ ఉద్దీపన భారం 49,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.40.41 లక్షల కోట్లు) వరకు ఉంటుందని అంచనా. అమెరికా, ఈయూ, భారత్ దేశాలు వడ్డీ రేట్ల పెంపు ద్వారా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. జపాన్ మాత్రం వడ్డీ రేట్లను యథాతథంగా మైనస్ 0.1 శాతం వద్దే ఉంచి ధరా భారాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నించడం విశేషం.
కోలుకున్న జర్మనీ ఆర్థిక వ్యవస్థ: ఈ సంవత్సరం తొలి ఆరు నెలలు నీరసించిన జర్మనీ ఆర్థిక వ్యవస్థ కొద్దిగా కోలుకుంది. సెప్టెంబరు త్రైమాసికంలో 0.3 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. ప్రైవేట్ పెట్టుబడులు, వినియోగం పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
Updated Date - 2022-10-29T00:56:47+05:30 IST