Digital rupee: ‘డిజిటల్ రూపీ’కి సంబంధించిన ఈ వాస్తవాలు మీకు తెలుసా..
ABN, First Publish Date - 2022-11-09T20:20:35+05:30
భారత డిజిటల్ ప్రయాణంలో డిజిటల్ రూపీ (Digital rupee) ఆవిష్కరణ చాలా పెద్ద మైలురాయిగా పరిగణించాల్సి ఉంటుంది.
ముంబై: భారత డిజిటల్ ప్రయాణంలో డిజిటల్ రూపీ (Digital rupee) ఆవిష్కరణ చాలా పెద్ద మైలురాయిగా పరిగణించాల్సి ఉంటుంది. సులభతర వ్యాపారం, జనాల్లో విశ్వాసం, పేమెంట్ సిస్టమ్‌పై నమ్మకం వంటి సానుకూల అంశాల కారణంగా డిజిటల్ రూపీ భారత్‌కు ప్రయోజనకరమవనుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో డిజిటల్ రూపీని పైలెట్ ప్రాజెక్ట్‌గా మొదలుపెట్టనున్నట్టు ఆర్బీఐ (RBI) ఇప్పటికే ప్రకటించింది. రిటైల్ సెగ్మెంట్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టనున్న ఈ పైలెట్ ప్రాజెక్టులో ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహింద్రా బ్యాంక్, యస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీలను భాగస్వాములుగా ఆర్బీఐ ఎంచుకుంది. మరి భవిష్యత్ డబ్బుగా అభివర్ణిస్తున్న ఈ ‘డిజిటల్ రూపీ’కి సంబంధించిన ముఖ్యమైన విషయాలను మీరూ తెలుసుకోండి..
- కేంద్రబ్యాంక్ ఆర్బీఐ (RBI) డిజిటల్ రూపంలో తీసుకొచ్చిన కొత్త కరెన్సీయే ‘సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ’ (CBDC). క్రిప్టో కరెన్సీల మాదిరిగా ఇవి వర్చువల్ రూపంలో వాడుకలో ఉంటాయి. అయితే క్రిప్టోల మాదిరిగా డిజిటల్ రూపీ డిసెంట్రలైజ్డ్ కాదు. డిజిటల్ రూపీపై ఆర్బీఐ నియంత్రణ, పర్యవేక్షణ ఉంటాయని ‘ప్రోఅసెట్స్ ఎక్స్చేంజ్’ వ్యవస్థాపడు, డైరెక్టర్ మనోజ్ దాల్మియా చెప్పారు.
- సీబీడీసీ ప్రతి యూనిట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రతి యూనిట్‌ను ట్రేస్ చేయవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. డిజిటల్ రూపీ ప్రోగ్రామబుల్. అంటే అవసరమైన రీతిలో బహుళ పరిమాణాలను జోడించే అవకాశం ఉంటుంది. కాలపరిమితి, ట్రాన్స్‌ఫర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
- అన్నీ లావాదేవీలు, బ్యాలెన్సులకు సంబంధించిన సమాచారం బ్లాక్-చైన్ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది.
- డిజిటల్ రూపీకి భౌగోళిక పరిధులు ఏమీ ఉండవు. అంతర్జాతీయంగా ఆమోదం ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుంది.
- డిజిటల్ రూపీతో పారదర్శకత మరింత పెరగనుందని ఆర్థికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చెల్లింపు, నిర్వహణలో మరింత సమర్థత, విశ్వాసం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
- యూపీఐ (UPI) చెల్లింపుల మాదిరిగా బ్యాంక్ అవసరం ఉండదు. డిజిటల్ రూపీ లావాదేవీలు నిర్వహించేందుకు బ్యాంక్ అకౌంట్ అవసరం ఉండదు.
- డిజిటల్ కరెన్సీ లేదా రూపీ ద్వారా చేసే పేమెంట్లు రియల్-టైమ్. అంటే ప్రభుత్వానికి అన్ని లావాదేవీల యాక్సెస్ ఉంటుంది. అవసరమైతే అన్నింటినీ పరిశీలించవచ్చు.
- డిజిటల్ రూపీ విషయంలో ప్రింటింగ్, పంపిణీ, వేర్వేరు నోట్ల నిర్వహణ వ్యయాల భారం ఉండదు. నగదు రవాణా ఖర్చులు కూడా ఏమాత్రం ఉండవని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
- అన్ని అథరైజ్డ్ నెట్‌వర్కుల పరిధిలో జరిగే లావాదేవీలను ప్రభుత్వం పొందొచ్చు.
- భౌతికంగా పోగొట్టుకోవడం లేదా డ్యామేజ్ చేసేందుకు అవకాశం ఉండదు.
- మోసాలను అరికట్టడంలో డిజిటల్ రూపీ దోహదపడనుంది. తనిఖీ చేసుకున్న తర్వాతే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మోసాలు జరిగినా సులభంగా ట్రేస్ చేయవచ్చు. ఎలా జరిగిందో గుర్తించవచ్చు.
Updated Date - 2022-11-09T20:23:58+05:30 IST