Transfers: టీచర్ల బదిలీల్లో ఇదేం ‘ప్రాధాన్యం’?
ABN, First Publish Date - 2022-12-26T11:09:08+05:30
ఉపాధ్యాయ బదిలీ (Teachers transfer)ల్లో ‘ప్రాధాన్యత’ అంశం.. టీచర్లలో అసంతృప్తులు రాజేస్తోంది. మారిన ప్రాధాన్యత మార్గదర్శకాలతో ఆ కేటగిరీ జాబితా పెరిగిపోతోంది. దీంతో తమకు అన్యాయం
టీచర్ కుటుంబ సభ్యులూ పరిగణనలోకా?
గతంలో టీచర్ వరకే వ్యాధుల్లో ప్రాధాన్యం
ఇప్పుడు భారీగా పెరిగిపోయిన జాబితా
అన్యాయం అంటున్న మిగిలిన టీచర్లు
పలుచోట్ల నకిలీ సర్టిఫికెట్ల సమర్పణ
బదిలీల వ్యవహారంపై తీవ్ర విమర్శలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ బదిలీ (Teachers transfer)ల్లో ‘ప్రాధాన్యత’ అంశం.. టీచర్లలో అసంతృప్తులు రాజేస్తోంది. మారిన ప్రాధాన్యత మార్గదర్శకాలతో ఆ కేటగిరీ జాబితా పెరిగిపోతోంది. దీంతో తమకు అన్యాయం జరుగుతోందని మిగిలిన టీచర్లు గగ్గోలు పెడుతున్నారు. వేల సంఖ్యలో ‘ప్రాధాన్యత’ జాబితా పెరిగిపోయిన నేపథ్యంలో ఆందోళన మరింత పెరుగుతోంది. ప్రాధాన్యత కేటగిరీలో వింతతువులు, ఒంటరి మహిళా టీచర్లు, మాజీ సైనికోద్యోగుల జీవిత భాగస్వాములు, మాజీ సైనికోద్యోగులైన టీచర్లు, దృష్టిలోపం ఉన్న వారు, ఆర్థోపెడిక్(Orthopedic) సమస్యలున్న టీచర్లు ఉన్నారు. వీరితో పాటు క్యాన్సర్(Cancer), గుండె సంబంధిత ఆపరేషన్లు(Cardiac operations), కిడ్నీ మార్పిడి, డయాలసిస్ రోగులు(Dialysis patients), న్యూరో వ్యాధిగ్రస్తులైన వారు ఈ జాబితాలో ఉండేవారు. అయితే టీచర్లు వ్యక్తిగతంగా ఈ జబ్బులతో బాధపడుతుంటే వారే ప్రాధాన్యత కేటగిరీని ఎంచుకునేవారు. కానీ, తాజా బదిలీల్లో పాఠశాల విద్యాశాఖ(School Education Department) వ్యక్తిగతంగా బాధపడే టీచర్లతో పాటుగా వారి జీవిత భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులను కూడా ప్రాధాన్యతా కేటగిరీలో చేర్చింది. ఆ వ్యాధుల్లో ఏదైనా కుటుంబంలో ఎవరికి ఉన్నా ఆ టీచర్ ప్రాధాన్యత కేటగిరీ కిందకు వచ్చేస్తారు. దీంతో ఈ జాబితా పెరిగిపోతోంది. చాలా వరకు కుటుంబాల్లో అలాంటి వ్యాధులతో బాధపడేవారు ఎవరో ఒకరు ఉంటున్నారు. దీంతో ఇలాంటివారు ‘ప్రాధాన్యత కేటగిరీ’ కింద దరఖాస్తు చేస్తున్నారు. బదిలీల్లో ప్రాధాన్యత కేటగిరీ టీచర్లు టాప్‌లో ఉంటారు. వారికి కావాల్సిన స్థానాలు కేటాయించిన తర్వాత పాయింట్ల ప్రకారం సాధారణ కౌన్సెలింగ్(Counselling) చేపడతారు. దీంతో మంచి స్థానాలన్నీ ప్రాధాన్యత కేటగిరీ పేరుతో వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని మిగిలిన టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నకిలీల బెడద కూడా!
గతంలో వ్యక్తిగతంగా ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటేనే ఉపాధ్యాయులను ఈ కేటగిరీలో చేర్చేవారు. దీంతో ఈ జాబితా ఎక్కువ ఉండేది కాదు. అయితే, ఇప్పుడు కుటుంబ సభ్యుల ఆరోగ్య అంశాలను కూడా చేర్చడంతో జాబితా పెరుగింది. కొందరు టీచర్లు తమ వివాహిత పిల్లల్లో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా వారిని చూపించి ఈ జాబితా కింద దరఖాస్తు చేస్తున్నారు. మరికొందరు, కొందరు నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఈ జాబితాలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని టీచర్లు ఆరోపిస్తున్నారు. ఇలా కుటుంబ సభ్యులందరికీ ప్రాధాన్యత కోటా ఇస్తే అర్హులైన టీచర్లకు అన్యాయం జరుగుతోందని టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో మానసిక వికలాంగులు, కండరాల క్షీణతతో బాధపడే పిల్లలున్న టీచర్లకు కూడా ప్రాధాన్యతా కేటగిరీలో అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కండర క్షీణత వ్యాధిని తొలగించేశారు. ఇలా అసలైన వ్యాధులను తొలగించి, తక్కువ అవసరం ఉండే వ్యాధులను కుటుంబ సభ్యులందరికీ అమలుచేయడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి.
కావాల్సిన వారి కోసమేనా?
కావాల్సిన టీచర్లకు మేలు చేయడం కోసమే ఇలా ప్రాధాన్యత కేటగిరీని ఇష్టానుసారం మార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజా బదిలీలకు ముందు రెండుసార్లు సిఫారసులతో బదిలీలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నించింది. అది బహిర్గతం కావడంతో చివరికి 141 మందిని సిఫారసులపై బదిలీలు చేస్తోంది. అయినా అధికార పార్టీకి కావాల్సిన వారి కోసం ఇలా ప్రాధాన్యత కేటగిరీ పెంచిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏవో ఒక సర్టిఫికెట్లు చూపించి ప్రాధాన్యత జాబితాలోకి వచ్చేస్తే వారికి తొలుత కావాల్సిన స్థానం దొరుకుతుంది. ఒకవేళ అవి నకిలీ సర్టిఫికెట్లు(Fake certificates) అయినా వాటిపై విచారణ వెంటనే జరిగే అవకాశం ఉండదు. ఈలోగా బదిలీలన్నీ అయిపోతే వాటిగురించి అందరూ మర్చిపోతారు. ఈ ప్రణాళికతోనే ప్రాధాన్యత కేటగిరీని విస్తరించేశారని టీచర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నేడు తుది సీనియారిటీ జాబితా
బదిలీలకు సంబంధించిన తుది సీనియారిటీ జాబితాను సోమవారం విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల చేయగా, వాటిపై కొందరు టీచర్లు(Teachers) అభ్యంతరాలు లేవనెత్తారు. వాటిని పరిష్కరించి తుది జాబితా ప్రకటించాలని అధికారులు తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు.
Updated Date - 2022-12-26T11:18:03+05:30 IST