Gujarat : గుజరాత్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు... హాజరుకానున్న మోదీ, షా...
ABN, First Publish Date - 2022-12-08T14:07:15+05:30
గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతున్న బీజేపీ ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి
న్యూఢిల్లీ : గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతున్న బీజేపీ ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముహూర్తం ఖరారు చేసుకుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) హాజరవుతారు.
182 స్థానాలకు డిసెంబరు 1,5 తేదీల్లో జరిగిన ఎన్నికల్లో 153 స్థానాల్లో ఆధిక్యంతో బీజేపీ దూసుకుపోతోంది. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ 20 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను కనబరుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 6 స్థానాల్లో, ఇతరులు మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
తమ పార్టీకి లభించిన ప్రజాదరణతో తమ విమర్శకులు నివ్వెరపోతున్నారని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తమ పార్టీకి లభించిన ప్రజాదరణ, ప్రజాతీర్పును వినయపూర్వకంగా స్వీకరిస్తామని చెప్పారు. ప్రజలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఎంతో ప్రేమిస్తున్నారని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయని చెప్పారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగిస్తామని అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయ్ రూపానీ తర్వాత 2021 సెప్టెంబరులో పటేల్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అంతకుముందు మంత్రి పదవిని నిర్వహించిన అనుభవం ఆయనకు లేదు. అయితే వివాద రహితుడు కావడంతో బీజేపీ అధిష్ఠానం ఆయనవైపు మొగ్గు చూపింది.
ఇదిలావుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గధ్వి (Isudan Gadhvi) పరాజయం పాలయ్యారు. ఆ పార్టీ అభ్యర్థి అల్పేష్ కథిరియా విజయం సాధించారు.
Updated Date - 2022-12-08T14:07:19+05:30 IST