Gujarat Polls: ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలపై బీజేపీ సస్పెన్షన్ వేటు
ABN, First Publish Date - 2022-11-20T19:41:20+05:30
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఏడుగురు ఎమ్మెల్యేలపై భారతీయ జనతా పార్టీ ఆదివారంనాడు క్రమశిక్షణా చర్యలు..
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల (Gujarat Polls) వేళ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన (Rebels) ఏడుగురు ఎమ్మెల్యేలపై భారతీయ జనతా పార్టీ (BJP) ఆదివారంనాడు క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. వారిని పార్టీ నుంచి సస్పెండ్ (Suspend) చేసింది. టిక్కెట్లు నిరాకరించడంతో వీరంతా స్వతంత్ర అభ్యర్థులుగా (Independent Candidates) నామినేషన్లు వేయడంతో పార్టీ ఈ చర్యలు తీసుకుంది. వీరంతా మొదటి విడత ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించినవారే కావడం విశేషం.
''పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు ఏడుగురు ఎమ్మెల్యేలను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేశాం'' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ తెలిపారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన వారిలో నర్మదా జిల్లా నాండోడ్‌కు చెందిన హర్షద్ వాసవ, జునాగఢ్‌లో కెషోద్ జునాగఢ్ టిక్కెట్ ఆశించిన అర్వింద్ లడాని, సురేందర్ నగర్‌లోని ధన్‌గాడ్రకు చెందిన ఛత్రసింగ్ గుంజారియా, వల్సాద్‌లోని పరడికి చెందిన కేతన్ భాయ్ పటేల్, రాజ్‌కోట్ రూరల్‌కు చెంది భరత్ భాయ్ చావ్డా, అమ్రేలి రాజుల నియోజక వర్గం టిక్కెట్ ఆశించిన కరణ్ భాయ్ బరైయ ఉన్నారు.
కాగా, రాష్ట్రంలో ఏడోసారి అధికారంలోకి వచ్చేందుకు పట్టుదలగా ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించింది. వీరిలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ కూడా ఉన్నారు. అయితే, ఈ ఇద్దరూ పోటీకి దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు. కాగా, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 99 సీట్లు గెలుచుకుంది. ఈసారి 140 సీట్లు టార్గెట్‌గా పెట్టుకుంది.
Updated Date - 2022-11-20T19:41:22+05:30 IST