మునుగోడు ఆత్మగౌరవం గుజరాత్ గద్దల వద్ద తాకట్టు
ABN, First Publish Date - 2022-10-22T19:10:55+05:30
యాదాద్రి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): మునుగోడు ఆత్మగౌరవాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గుజరాత్ గద్దల వద్ద రూ.18 వేల కోట్లకు తాకట్టు పెట్టారని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గత ఎన్నికల్లో పొరపాటున గెలిచిన రాజగోపాల్‌రెడ్డి అప్పటినుంచి బీజేపీ జపమే చేస్తున్నారని అన్నారు.
యాదాద్రి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): మునుగోడు ఆత్మగౌరవాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గుజరాత్ గద్దల వద్ద రూ.18 వేల కోట్లకు తాకట్టు పెట్టారని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గత ఎన్నికల్లో పొరపాటున గెలిచిన రాజగోపాల్‌రెడ్డి అప్పటినుంచి బీజేపీ జపమే చేస్తున్నారని అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో శుక్రవారం నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడుతూ మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలని నీతీ ఆయోగ్ సిఫారసు చేస్తే ప్రధాని మోదీ 19 పైసలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కోవర్టురెడ్డికి మాత్రం రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డి చిన్న కంపెనీకి అంత పెద్ద కాంట్రాక్టు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ‘ఇచ్చిన పెద్దలు ఎవరు? గుజరాత్ గద్దలెవరు?’ అని నిలదీశారు. జన్‌ధన్ ఖాతా తెరవండి.. ధనాధన్ రూ.15 లక్షలు వేస్తానని మోదీ హామీ ఇచ్చారని, కానీ ఆ నిధులన్నీ కోమటిరెడ్డి ఖాతాలో పడ్డాయని అన్నారు. నల్లధనం తెస్తానని మోదీ తెల్లముఖం వేశారని, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించిన మొదటి ప్రధాని ఆయనే అని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేయకుండా, కార్పొరేట్లకు మాత్రం రూ.11.50 లక్షల కోట్లు మాఫీ చేశారని మండిపడ్డారు. మోదీ మాటలు కోట్లలో.. పని మాత్రం పకోడీ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఆ పైసలతో మునుగోడు ప్రజలకు ఎరఓటుకు తులం బంగారం పెట్టి గెలుస్తానని రాజగోపాల్‌రెడ్డి నీలుగుతున్నారని, అవి గుజరాత్ పైసలు, దొంగ పైసలు, గుజరాత్ గద్దల పైసలని.. వాటిని దబాయించి తీసుకుని కారు గుర్తుకు ఓటేయాలని కేటీఆర్ ప్రజలను కోరారు. ఈ డబ్బులన్నీ మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి ఎరగా వేస్తున్నవేనని అన్నారు. టీఆర్‌ఎస్ సర్కారు ఎనిమిదేళ్లలో 100 పనులు చేసిందని, బీజేపీ, కోమటిరెడ్డి దమ్ముంటే ఒక్క పని చేసినట్లుగా చూపించి ఓట్లడగాలని సవాల్ విసిరారు. గ్యాస్ సిలిండర్ రూ.1,200 చేశారని.. మహిళలు ఓటు వేసే ముందు సిలిండర్‌కు దండం పెట్టుకుని వెళ్లాలని సూచించారు. ఇన్నేళ్లలో ఒక్క పనీ చేయని వ్యక్తి రేపు గెలిచి ఏం సాధిస్తారని ప్రజలే ఆలోచించాలని కోరారు. మునుగోడును దత్తత తీసుకుని ఫలానా కావాలని అడగకుండానే అద్భుతంగా అభివృద్ధి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
సంక్షేమ పథకాలు పొందుతున్న వారంతా టీఆర్‌ఎ్‌సకు ఓట్లు వేస్తే, బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకు డిపాజిట్లు గల్లంతవుతాయని తెలిపారు. కారు ఇటువైపు. బేకార్ అటువైపు ఉన్నారని, సీపీఎం, సీఐపీ మద్దతుతో మునుగోడులో విజయం సాధిస్తామని, బీజేపీకి డిపాజిట్ కూడా రావొద్దన్నారు. రోడ్‌షోలో మంత్రులు జగదీష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా, కేటీఆర్ రోడ్‌షో 5 కిలోమీటర్ల మేర సాగింది. వందలాది బైక్‌లతో కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆంక్షలు విధించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలను విజయవాడ వైపు రోడ్డు మీదకు మళ్లించారు.
Updated Date - 2022-10-23T20:27:51+05:30 IST