China: చైనాలో ప్రస్తుతం రోజుకు 9 వేల కరోనా మరణాలు..
ABN, First Publish Date - 2022-12-30T19:57:11+05:30
కరోనా ధాటికి అతలాకుతలమవుతున్న చైనాలో ప్రస్తుతం రోజుకు 9 వేల కరోనా మరణాలు సంభవిస్తున్నాయని బ్రిటన్‌కు చెందిన డాటా రీసెర్చ్ సంస్థ ఎయిర్‌ఫినిటీ తాజాగా అంచనా వేసింది.
లండన్: కరోనా ధాటికి అతలాకుతలమవుతున్న చైనాలో(China) ప్రస్తుతం రోజుకు 9 వేల కరోనా మరణాలు(Daily Corona Deaths) సంభవిస్తున్నాయని బ్రిటన్‌కు చెందిన డాటా రీసెర్చ్ సంస్థ ఎయిర్‌ఫినిటీ తాజాగా అంచనా వేసింది. గత వారంతో పోలిస్తే ప్రస్తుతం కరోనా మరణాలు రెట్టింపై ఉండొచ్చని పేర్కొంది. చైనాలో కరోనా కేసుల గుర్తింపునకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రాకమునుపు ఉన్న సమాచారాన్ని గణాంక శాస్త్ర మోడళ్లతో విశ్లేషించి ఈ అంచనా రూపొందించింది. సంస్థ అంచనా ప్రకారం.. చైనాలో డిసెంబర్ 1 నుంచి ఇప్పటివరకూ లక్షకుపైగా కరోనా మరణాలు సంభవించాయి. కేసుల సంఖ్య 18.6 మిలియన్లు దాటింది. జనవరి 23 కల్లా చైనాలో గరిష్ఠంగా రోజుకు 3.7 మిలియన్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రోజువారి మరణాల సంఖ్య 25 వేలకు ఎగబాకొచ్చని ఎయిర్‌ఫినిటీ అంచనా వేసింది.
చైనా అధికారిక లెక్కల ప్రకారం.. 2020 నుంచి ఇప్పటివరకూ కేవలం 5247 కరోనా మరణాలే సంభవించాయి. అయితే..చైనాలో కరోనా తీవ్రత దృష్ట్యా అనేక దేశాలు అప్రమత్తమయ్యాయి. కరోనా వైరస్‌ను గుర్తించేందుకు చైనా నుంచి వచ్చే విమానాల్లోని వ్యర్థజలాలపై పరీక్షలు జరిపే యోచనలో ఉన్నాయి. కరోనా కేసులు, మరణాల గుర్తింపునకు సంబంధించి ఈ నెల మొదట్లో చైనా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం.. గతంలో ఇతర అనారోగ్యాలున్న వారు కరోనా బారిన పడి ప్రాణాలొదిలితే దాన్ని కరోనా మరణంగా గుర్తించరు. అయితే.. కరోనా మరణాలను చైనా ప్రభుత్వం తక్కువ చేసి చూపుతోందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.
Updated Date - 2022-12-30T20:13:28+05:30 IST