They ran away like goats: మేకల్లా పారిపోయారు.. రష్యా దళాలపై ఉక్రెయిన్ ఖేర్సన్ పౌరులు
ABN, First Publish Date - 2022-11-13T17:25:22+05:30
ఉక్రెయిన్‌పై దురాక్రమణ ప్రారంభించిన తొలి రోజుల్లో రష్యా దళాలు ఖేర్సన్ (Kherson) నగరాన్ని ఆక్రమించుకున్నాయి. అయితే,
కీవ్: ఉక్రెయిన్‌పై దురాక్రమణ ప్రారంభించిన తొలి రోజుల్లో రష్యా దళాలు ఖేర్సన్ (Kherson) నగరాన్ని ఆక్రమించుకున్నాయి. అయితే, ఆ తర్వాతి నుంచి అక్కడ తమ సైనికులకు అవసరమైన పరికరాలు, ఆహార అవసరాలు తీర్చడం రష్యాకు కష్టంగా మారడంతో తాజాగా ఆ నగరం నుంచి తమ దళాలను ఉపసంహరించుకుంటున్నట్టు రష్యా (Russia) ప్రకటించింది. దీంతో ఖేర్సన్ వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. రష్యా కుట్రలపై ఉక్రెయిన్ (Ukraine) దళాలు అప్రమత్తంగా ఉంటూనే ఖేర్సన్ నగరంలోకి ప్రవేశించాయి. తమ దళాలకు ఖేర్సన్ పౌరులు నీలం, పసుపు జెండాలు చూపిస్తూ సంతోషాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా నగరానికి చెందిన ఓ పౌరుడు మాట్లాడుతూ.. ఎప్పటికీ ఖేర్సన్‌లోనే ఉంటామని పుతిన్ బీరాలు పలికారని, చివరికి ఐదు నిమిషాల్లోనే వారు మేకల్లా పారిపోయారని చెప్పుకొచ్చాడు. పుతిన్ తమను చంపేయాలని అనుకున్నారని, చివరికి ఆయన తన దేశాన్నే ధ్వంసం చేసుకుంటున్నారని అన్నాడు. ఖేర్సన్ నుంచి రష్యా తిరోగమనం దారుణ వైఫల్యమని దెప్పి పొడిచాడు. ఈ పోర్టు సిటీలో శనివారం పోలీసులు, టీవీ, రేడియో సర్వీసులు తిరిగి అందుబాటులోకి వచ్చాయి.
రష్యా దళాలు నగరాన్ని విడిచిపెట్టడంతో ఖేర్సన్ పౌరులకు తిరిగి స్వాతంత్ర్యం లభించింది. దీంతో వారు ప్రాంతీయ అడ్మినిస్ట్రేషన్ భవనం వద్దకు చేరకుని భోగిమంటలు వెలిగించి పాటలు పాడుతూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఉక్రెయిన్ రక్షణ దళాలను ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. ఖేర్సన్ ప్రజలకు అత్యంత ఇష్టమైన పుచ్చకాయలను అలంకరించిన బ్యానర్లు ఊపారు. అయితే, ఇప్పుడీ నగరం తిరిగి ఉక్రెయిన్ చేతికి తిరిగి వచ్చినప్పటికీ పునర్నిర్మాణం చాలా కష్టంతో కూడుకున్న పనే. నగరం ఇప్పటికే చాలా వరకు ధ్వంసమైంది. ప్రస్తుతం ఖేర్సన్ వాసులు నీళ్లు, విద్యుత్, ఔషధాలు, ఆహారం లేక అల్లాడిపోతున్నారు. ఇప్పుడు రష్యా దళాలు వెనక్కి మళ్లడంతో నీటి సరఫరా పాక్షికంగా పునరుద్ధరించారు.
ఖేర్సన్‌ను విడిచిపెట్టడానికి ముందు రష్యా దళాలు నగరంలోని ముఖ్యమైన మౌలిక సదుపాయాలైన నీటి సరఫరా, విద్యుత్, హీట్ వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ(Volodymyr Zelenskyy) జాతినుద్దేశించి మాట్లాడుతూ పేర్కొన్నారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా మాట్లాడుతూ.. యుద్ధ రంగంలో తాము గెలిచామని, అయినా యుద్ధం కొనసాగుతుదందని స్పష్టం చేశారు.
Updated Date - 2022-11-13T17:25:24+05:30 IST