చైనాలో కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి వింత సమస్య.. అదే పనిగా ఫోన్లు చేసి ఆ విషయం అడుగుతున్నారట..!
ABN, First Publish Date - 2022-10-28T15:22:52+05:30
చైనాలో కొత్తగా పెళ్లైన వారిపై పిల్లల గురించి ఒత్తిడి పెరుగుతోందట. చైనా అధికారులు కొత్త దంపతులకు ఫోన్లు చేసి ప్రెగ్నెన్సీ గురించి ఆరా తీస్తున్నారట.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. అయితే కొన్ని రోజులుగా ఆ దేశంలో జనాభా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ముఖ్యంగా వృద్ధుల సంఖ్య పెరగడం, జననాల రేటు తక్కువగా ఉండడం ఆ దేశానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం జననాల రేటు పెంచడానికి సిద్ధమైంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గత వారం జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ సమావేశంలో జననాల రేటును పెంచడానికి, దేశ జనాభా పెరుగుదలను నమోదు చేయడానికి పాటించాల్సిన వ్యూహాల గురించి మాట్లాడారు.
ఈ నేపథ్యంలో కొత్తగా పెళ్లైన వారిపై పిల్లల గురించి ఒత్తిడి పెరుగుతోందట. చైనా అధికారులు కొత్త దంపతులకు ఫోన్లు చేసి ప్రెగ్నెన్సీ గురించి ఆరా తీస్తున్నారట. ఒక మహిళ ఆ అంశం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. కొత్తగా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన ఆమెకు స్థానిక పరిపాలన అధికారి నుంచి ఫోన్ వచ్చిందట. ఆమెను ఆ అధికారి.. మీరు ఎప్పుడు గర్భవతి కాబోతున్నారు?
అని అడిగారట. ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. సుమారు 10 వేల మంది మహిళలు స్పందిస్తూ.. తమకూ అలాంటి కాల్స్ వచ్చాయని కామెంట్లు చేశారు. కాగా, ఆ మహిళ చేసిన పోస్ట్‌ను చైనా అధికారులు తొలగించారు.
నూతన వధూవరులు ఏడాదిలోపు తల్లిదండ్రులుగా మారాలని ప్రభుత్వం కోరుకుంటోందని సమాచారం. ఒక మహిళ తన సహోద్యోగిణికి ఎదురైన అనుభవం గురించి ఓ పోస్ట్ చేసింది. గత ఏడాది ఆగస్టులో తన సహోద్యోగిణికి వివాహమైందని, అప్పటి నుంచి ఆమెకు రెండు కాల్స్ వచ్చాయని తెలిపింది. ఫోన్ చేసిన అధికారులు.. మీకు పెళ్లైంది.. మీరు ఇంకా పిల్లల కోసం ఎందుకు ప్లాన్ చేయలేదు? బిడ్డకు జన్మనివ్వడానికి సమయాన్ని వెచ్చించండి
అని చెప్పారట. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2019 ప్రకారం.. చైనా ప్రస్తుతం 1.44 బిలియన్ల జనాభాతో మొదటి స్థానంలో ఉండగా, 1.39 బిలియన్ల జనాభాతో భారత్ రెండో స్థానంలో ఉంది. ఒక నివేదిక ప్రకారం వచ్చే ఏడాది చివరి నాటికి జనాభా విషయంలో చైనాను భారత్ దాటేస్తుందని అంచనా.
Updated Date - 2022-10-28T15:24:56+05:30 IST