Racist Sign : ఆస్ట్రేలియా పోస్ట్ జాత్యహంకార ధోరణి... భారతీయుల ఆగ్రహం...
ABN, First Publish Date - 2022-11-19T17:15:05+05:30
ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో ఓ తపాలా కార్యాలయం (Post Office) వద్ద కనిపించిన బోర్డు భారతీయులను
అడిలైడ్ (ఆస్ట్రేలియా) : ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో ఓ తపాలా కార్యాలయం (Post Office) వద్ద కనిపించిన బోర్డు భారతీయులను ఆగ్రహానికి గురి చేసింది. దీనిపై స్థానిక రాజకీయ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆస్ట్రేలియా పోస్ట్ (Australia Post) క్షమాపణ చెప్పి, ఈ బోర్డును తొలగిస్తామని తెలిపింది.
అడిలైడ్‌లోని రుండ్లే మాల్ (Rundle Mall)లో ఉన్న పోస్టాఫీస్ బయట ఓ బోర్డును ఆస్ట్రేలియా పోస్ట్ అధికారులు ఏర్పాటు చేశారు. దీనిపైన ‘‘వెలుతురు, ఫొటో బ్యాక్‌గ్రౌండ్ క్వాలిటీ కారణంగా మేము దురదృష్టవశాత్తూ ఇండియన్ ఫొటోస్ తీయలేము’’ అని పేర్కొన్నారు. ఈ నోటీసును గమనించిన చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇండియన్ కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది జాత్యహంకార ధోరణితో ఏర్పాటు చేసినదిగా కనిపిస్తోందని ఓ ప్రవాస భారతీయుడు ఆరోపించారు. తమ శరీర ఛాయను ఈ విధంగా ఎగతాళి చేస్తున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. ఇది తనను వ్యక్తిగతంగా బాధించిందన్నారు.
అడిలైడ్‌లోని ఇండియన్ కమ్యూనిటీ నేతలు, రాజకీయ నాయకులు ఈ నోటీసును ఖండించారు. ఈ బోర్డును వెంటనే తొలగించాలని ఆస్ట్రేలియా పోస్ట్‌ను డిమాండ్ చేశారు. అదేవిధంగా ఫెడరల్ లేబర్ మెంబర్ ఫర్ గ్రీన్‌వే, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి, ఎన్ఎస్‌డబ్ల్యూ లేబర్ పార్టీ ప్రెసిడెంట్ మిషెల్లీ రౌలండ్ ఆస్ట్రేలియా పోస్ట్‌కు ఓ లేఖ రాశారు. ఈ నోటీసుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
విమర్శలు పెల్లుబుకుతుండటంతో ఆస్ట్రేలియన్ పోస్ట్ క్షమాపణ చెప్పింది. త్వరలోనే ఈ నోటీసును తొలగిస్తామని చెప్పింది. ఈ పోస్టాఫీస్ గతంలో ఇచ్చిన కస్టమర్ల ఫొటోలను ఇండియన్ కాన్సులేట్ తిరస్కరించిందని వివరణ ఇచ్చింది.
Updated Date - 2022-11-19T17:15:10+05:30 IST