Azam Khan: ఆజంఖాన్ బీజేపీకి కంటగింపుగా మారారు.. అందుకే ఇలా: అఖిలేశ్ యాదవ్
ABN, First Publish Date - 2022-10-29T20:52:58+05:30
ద్వేషపూరిత ప్రసంగం కేసులో దోషిగా తేలిన సమాజ్‌వాదీ పార్టీ(SP) నేత ఆజంఖాన్(Azam Khan)కు కోర్టు ఇటీవల మూడేళ్ల జైలు
లక్నో: ద్వేషపూరిత ప్రసంగం కేసులో దోషిగా తేలిన సమాజ్‌వాదీ పార్టీ(SP) నేత ఆజంఖాన్(Azam Khan)కు కోర్టు ఇటీవల మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆపై బెయిలు కూడా మంజూరు చేసింది. ఆజంఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడడంతో ఆయన తన శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీకి ఆజంఖాన్ కంటగింపుగా మారారాని, అందుకే తప్పుడు కేసులతో ఆయనను వేధిస్తోందని ఆరోపించారు. బీజేపీ ఆయనను లక్ష్యంగా చేసుకుందని, రోజుకో తప్పుడు కేసు పెట్టి వేధించిందని అన్నారు.
మతతత్వ శక్తులకు ఆయన వ్యతిరేకమని, ప్రజాస్వామ్యవాది అని, అందుకే ఆయనను బీజేపీ టార్గెట్ చేసుకుందని అన్నారు. రాజ్యాంగం, లౌకికవాదం కోసం పోరాడారని అన్నారు. అసెంబ్లీలో ఆయన తిరుగులేని తర్కం, బలమైన వాదనకు తట్టుకోలేకే బీజేపీ ఆయనపై కుట్రలు చేస్తోందని అన్నారు. రాంపూర్‌లో ఆజంఖాన్.. మౌలానా మహమమ్మద్ అలీ జవహర్ యూనివర్సిటీని స్థాపించారని, యువతను ఇది అగ్రపథంలోకి తీసుకెళ్తుందని పేర్కొన్నారు. దీనిని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. ఆ యూనివర్సిటీని ధ్వంసం చేయాలని బీజేపీ చూస్తోందని అఖిలేశ్ యాదవ్ విమర్శించారు.
Updated Date - 2022-10-29T20:53:00+05:30 IST