Himchal pradesh: సీఎంను నిర్ణయించేందుకు సమావేశమవుతున్న ఎమ్మెల్యేలు
ABN, First Publish Date - 2022-12-09T09:58:08+05:30
హిమచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు..
సిమ్లా: హిమచల్ ప్రదేశ్ (Himachal pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహలు చేస్తోంది. ఇందులో భాగంగా గెలిచిన ఎమ్మెల్యేలంతా సిమ్లాలోని పార్టీ ప్రధాన కార్యాలయమైన రాజ్‌భవన్‌లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశమవుతున్నారు. హిమాచల్ కాంగ్రెస్ ఇన్‌చార్జి రాజీవ్ శుక్లా, సూపర్‌వైజర్లు భూపేష్ బఘెల్, భూపేంద్ర హుడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను పార్టీ అధిష్ఠానానికి అప్పగిస్తూ ఈ సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ఎన్నికలకు వెళ్లింది. ముందస్తు ఆలోచన ప్రకారం ఛండీగఢ్‌లో ఎమ్మెల్యేలతో శుక్రవారం సమావేశం జరపాలని కాంగ్రెస్ అనుకున్నప్పటికీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ రావడంతో ఆ ఆలోచన మార్చుకుంది. సిమ్లాలోనే సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. కాగా, సీఎం ఎంపిక కాంగ్రెస్‌కు గట్టి పరీక్షగానే చెప్పాలి. సీఎం పదవిని ఆశిస్తున్న వారిలో ప్రతిభా సింగ్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ సుఖు, సీఎల్‌పీ నేత ముఖేష్ అగ్నిహోత్రి ఉన్నారు.
ముఖ్యమంత్రి ఎవరనేది కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయిస్తుందని రాజీవ్ శుక్లా ఇప్పటికే ప్రకటించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడే తగిన నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల తర్వాత తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వస్తోంది. 68 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 25 సీట్లు, స్వతంత్ర అభ్యర్థులు 4 సీట్లు గెలుచుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవలేదు.
Updated Date - 2022-12-09T09:58:10+05:30 IST