Imran Khan Ex Wife: ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్యకు మళ్లీ పెళ్లి... వరుడు ఓ నటుడు...
ABN, First Publish Date - 2022-12-23T16:59:43+05:30
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రేహమ్ ఖాన్ (49) శుక్రవారం ఓ సంచలన
న్యూఢిల్లీ : పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రేహమ్ ఖాన్ (49) శుక్రవారం ఓ సంచలన ప్రకటన చేశారు. నటుడు, మోడల్ మీర్జా బిలాల్ బేగ్ (36)ను తాను పెళ్లి చేసుకున్నానని తెలిపారు. తన కుమారుడు, మీర్జా తల్లిదండ్రుల ఆశీస్సులతో అమెరికాలోని సీటెల్‌లో తమ వివాహం జరిగిందని తెలిపారు. నమ్మదగిన వ్యక్తి తనకు ఎట్టకేలకు లభించినట్లు పేర్కొన్నారు. పెళ్లి ఉంగరాలు కనిపించే విధంగా ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
రేహమ్ (Reham Khan), మీర్జా (Mirza Bilal Baig) ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. వీరిద్దరికీ ఇది మూడో వివాహమే. పాకిస్థానీ-బ్రిటిష్ జర్నలిస్ట్ అయిన రేహమ్ 2015లో ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)ను పెళ్లి చేసుకున్నారు. దాదాపు 10 నెలల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. తనకు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో దుష్ప్రచారం జరిగిందని, అందుకే ఇమ్రాన్‌తో తన బాంధవ్యం నిలవలేదని ఆమె ఆరోపించారు. మీర్జా గతంలో మోడల్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో కార్పొరేట్ ప్రొఫెషనల్.
రేహమ్ ఖాన్ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, మీర్జా బిలాల్ తల్లిదండ్రులు, తన కుమారుడు తన వకీలుగా అందజేసిన ఆశీస్సులతో అమెరికాలోని సీటెల్‌లో తమ వివాహం జరిగిందని తెలిపారు. “Just Married” అనే క్యాప్షన్‌తో రెండు చేతులు కనిపించే ఫొటోను అంతకుముందు ఆమె షేర్ చేశారు.
రేహమ్ ఖాన్ 1973లో లిబియాలోని అజ్దబియాలో జన్మించారు. పాకిస్థాన్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత ఆమె బ్రిటన్‌లో బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్‌గా పని చేశారు. బీబీసీ సౌత్ టుడే వెదర్ ప్రజంటర్‌గా కూడా పని చేశారు. 2012లో పాకిస్థాన్‌కు వచ్చారు. ఆమె లోకల్ టీవీ షో కోసం ఇమ్రాన్ ఖాన్‌ను ఇంటర్వ్యూ చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పరిచయం పెరిగింది.
ఈ ఏడాది జూలైలో ఆమె తన కొత్త ప్రేమలోకం గురించి వెల్లడించారు. ఓ పాకిస్థానీ యూట్యూబ్ చానల్ షో కోసం గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన సందర్భంగా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, తనకు మళ్లీ ప్రేమ లభించిందని చెప్పారు. తనకు మరో పెళ్లి జరుగుతుందని తన ఫ్యామిలీ మెంబర్ ఒకరు చెప్పారని తెలిపారు. ఆ వ్యక్తి హస్తసాముద్రిక జ్యోతిష్కుడని తెలిపారు.
Updated Date - 2022-12-23T16:59:58+05:30 IST