Gujarat Polls : ముస్లింలు మాత్రమే కాంగ్రెస్‌ను కాపాడగలరు : చందన్ ఠాకూర్
ABN, First Publish Date - 2022-11-20T10:46:11+05:30
గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చందన్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఆగ్రహం తెప్పించాయి.
గాంధీ నగర్ : గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చందన్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఆగ్రహం తెప్పించాయి. ముస్లింలు మాత్రమే కాంగ్రెస్‌ను కాపాడగలరని చందన్ చెప్పడంపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించింది. హిందూ సంప్రదాయాలను చాలా మంది కాంగ్రెస్ నేతలు అవమానించారని, ఇప్పుడు ముస్లింలను సంతృప్తిపరచడానికి పోటీ పడుతున్నారని వ్యాఖ్యానించింది.
చందన్ ఠాకూర్ (Chandan Thakor) గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో (Gujarat Assembly Polls) సిద్ధ్‌పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన శనివారం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, బీజేపీని పరోక్షంగా ప్రస్తావిస్తూ, ‘‘వాళ్లు యావత్తు దేశాన్ని గుంటలో పడేశారు. ఇప్పడు దేశాన్ని కాపాడగలిగేవారు ఎవరైనా ఉన్నారా? అంటే ముస్లింలు మాత్రమే కాపాడగలరు. కాంగ్రెస్‌ను కాపాడగలిగేవారు ఎవరైనా ఉన్నారా? అంటే ముస్లింలు మాత్రమే కాపాడగలరు’’అన్నారు. తాను కేవలం ఓ ఉదాహరణ మాత్రమే చెబుతానన్నారు. జాతీయ పౌరుల జాబితా (NRC)పై పోరాటానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వీథుల్లోకి వచ్చారన్నారు. ఇతర పార్టీలేవీ ముస్లింలకు అండగా నిలబడలేదన్నారు. దేశవ్యాప్తంగా ముస్లింలను రక్షించే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని చెప్పారు.
ముస్లింలను అనేక రకాలుగా వేధించేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు. ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టుకెళ్ళారని, ఆ తర్వాత ఓ చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పారు. హజ్‌కు వెళ్లేందుకు ముస్లింలకు కాంగ్రెస్ రాయితీలు ఇచ్చిందన్నారు. బీజేపీ దానిని కూడా ఆపేసిందని ఆరోపించారు. చిన్న వ్యాపారాలకు ఇచ్చే రాయితీలను కూడా రద్దు చేసిందన్నారు. భవిష్యత్తులో కండబలంతో కూడిన రాజకీయాలకు బీజేపీ పాల్పడకుండా ముస్లింలను రక్షిస్తామని చెప్పారు.
చందన్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ట్విటర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ముస్లింలను బుజ్జగించేందుకు తెగబడిందన్నారు. కాంగ్రెస్‌ను కాపాడగలిగేవారు ముస్లింలేనని సిద్ధ్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి చందన్ ఠాకూర్ చెప్తున్నారన్నారు. ట్రిపుల్ తలాక్‌ను, హజ్ రాయితీని బీజేపీ ఆపేసిందని చెప్తున్నారని తెలిపారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ (Manmohan Singh) గతంలో మాట్లాడుతూ దేశంలోని వనరులపై మొదటి హక్కుదారులు ముస్లింలేనని అన్నారని గుర్తు చేశారు. కర్ణాటకలోని జర్కిహోళి వంటి కాంగ్రెస్ నేతలు హిందూ మతంపై దాడులు చేస్తున్నారని అన్నారు. బహిరంగంగా, దాపరికం లేకుండా ముస్లింల (Muslims)ను బుజ్జగించేందుకు దిగజారిందన్నారు. ఇది సమైక్యత, ఐకమత్యం కాదన్నారు. చాలా మంది కాంగ్రెస్ నేతలు మొదట హిందూ సంప్రదాయాలను అగౌరవపరిచారని, ఇప్పుడు సంతృప్తిపరిచే సోదరులుగా పేరు తెచ్చుకోవడం కోసం పోటీ పడుతున్నారని ఆరోపించారు. దీనికి కారణం వారికి ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నేతలు గోపాల్ ఇటాలియా, రాజేంద్ర పాల్ నుంచి పోటీ ఎదురవుతుందనే భయమేనని చెప్పారు. INC అంటే నాకు మతతత్వం కావాలి (I Need Communalism) అని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోసం మాత్రమే హిందువులుగా చెప్పుకుంటారనే అర్థం స్ఫురించే విధంగా #ChunaviHindu అనే హ్యాష్‌ట్యాగ్‌ను పెట్టారు.
Updated Date - 2022-11-20T10:51:49+05:30 IST