Digvijay Singh: మోదీ ముస్లిం టోపీ ధరించే రోజు దగ్గర్లోనే ఉంది..
ABN, First Publish Date - 2022-11-15T19:39:44+05:30
దేశాన్ని ఏకం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర'పై ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ జోడో యాత్ర..
న్యూఢిల్లీ: దేశాన్ని ఏకం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' (Digvijay Singh)పై ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ జోడో యాత్ర కారణంగానే ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మసీదులు, మదరసాల్లో పర్యటిస్తున్నారని అన్నారు. ఇండోర్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీని విమర్శించడంలో బీజేపీ బిజీగా ఉందని, కానీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైన నెలరోజుల్లోపే మోహన్ భగవత్ మసీదులు, మదరసాల్లో పర్యటిస్తున్నారని, మరికొద్దిరోజుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ముస్లిం టోపీ ధరించడం మొదలుపెడతారని అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా సందర్శించినప్పుడు సంప్రదాయ ముస్లి టోపీ ధరించారని దిగ్విజయ్ సింగ్ అన్నారు. అయితే, దిగ్విజయ్ ప్రస్తావించిన ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనప్పుడు, అది కేవలం ఫోటోషాప్ చేసినట్టుగా పలు వార్తా సంస్థలు నిర్ధారించాయి.
సెప్టెంబర్‌లో మసీదులు సందర్శించిన భగవత్
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గత సెప్టెంబర్‌లో మసీదులు, మదరసాలు సందర్శించారు. పలువురు ముస్లిం మేథావులను కలుసుకున్నారు. ఆలిండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ అహ్మద్ ఇల్యాసిని కులుసుకున్నారు. ఇల్యాసి సైతం మోహన్ భగవత్‌ను 'రాష్ట్ర పిత'గా అభివర్ణించారు. మసీదు పర్యటన అనంతరం మదరసాకు కూడా భగవత్ వెళ్లారు. అక్కడి పిల్లలతో సంభాషించారు. పిల్లలు "వందేమాతరం'', ''జై హింద్'' నినాదాలు చేసినట్టు కార్యకర్త ఒకరు తెలిపారు.
మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర...
మరోవైపు, రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోకి మంగళవారంనాడు అడుగుపెట్టింది. గిరిజన స్వాతంత్ర్య సమర యోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా వషిం జిల్లాలో ఆయనకు రాహుల్ ఘన నివాళులర్పించారు. బిర్సా ముండా ఆదర్శాలపై నలువైపుల నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బీజేపీ దాడి చేస్తున్నాయని ఈ సందర్భంగా రాహుల్ విమర్శించారు.
Updated Date - 2022-11-15T19:41:30+05:30 IST