Iran anti hijab protests : 100 మందికి మరణ శిక్ష?
ABN, First Publish Date - 2022-12-30T17:09:47+05:30
హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నవారిలో దాదాపు 100 మందికి మరణ శిక్ష విధించారని, వీరిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారని
న్యూఢిల్లీ : హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నవారిలో దాదాపు 100 మందికి మరణ శిక్ష విధించారని, వీరిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారని ఇరాన్ మానవ హక్కుల సంస్థ (IHR) ఓ నివేదికలో వెల్లడించింది. మరణ శిక్ష భయాన్ని ఎదుర్కొంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ హెచ్చరికలు వచ్చినవారి కుటుంబ సభ్యులు నోరెత్తడానికి వీలు లేకుండా అధికారులు ఆంక్షలు అమలు చేస్తున్నారని పేర్కొంది.
నార్వే కేంద్రంగా పని చేస్తున్న ఐహెచ్ఆర్ విడుదల చేసిన నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం, మరణశిక్ష బాధితులు తమ సొంత న్యాయవాదిని నియమించుకునేందుకు, సముచిత న్యాయ ప్రక్రియ, నిష్పాక్షిక విచారణలకు అవకాశం లేకుండాపోయింది. తాము నేరం చేశామని అంగీకరించే విధంగా నిరసనకారులను పోలీసులు అనేక రకాలుగా చిత్రహింసలు పెడుతున్నారు. ఇటీవల మొహ్‌సెన్ షేకరి, మజిడ్రెజా రహ్నవార్డ్ అనే ఇద్దరు పురుషులను ఉరి తీశారు. వీరు దైవానికి వ్యతిరేకంగా శత్రుత్వంతో వ్యవహరించారని, జాతీయ భద్రతకు విఘాతం కలిగించారని నిర్థరణ అయిందని చెప్తూ, మరణ శిక్ష విధించారు. వీరిపై జరిగిన విచారణలను ఉద్యమకారులు తీవ్రంగా ఖండించారు. శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. ఈ బాధితులను, వీరితోపాటు జైళ్లలో ఉంటున్న ఇతరులను ఏదో విధంగా కలవగలిగినపుడు ఈ వివరాలు బయటకొచ్చాయి.
హిజాబ్ (Hijab)ను సక్రమంగా ధరించలేదనే కారణంతో మహసా అమిని (Mahsa Amini) అనే 22 ఏళ్ళ యువతిని సెప్టెంబరులో ఇరాన్ మోరలిటీ పోలీసులు (Iran Morality Police) నిర్బంధించారు. పోలీసుల కస్టడీలో ఉండగా ఆమె మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. 100 రోజులు పైబడినప్పటికీ మరింత తీవ్రతతో నిరసనలు కొనసాగుతున్నాయి.
ఐహెచ్ఆర్ వెల్లడించిన వివరాల ప్రకారం, 476 మంది నిరసనకారులు హత్యకు గురయ్యారు. వీరిలో 64 మంది బాలలు, 34 మంది మహిళలు ఉన్నారు. ఈ సంస్థ డైరెక్టర్ మహమూద్ అమిరీ మొఘద్దమ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, మరణ శిక్షలు విధించడం, వారిలో కొందరిని ఉరి తీయడం ద్వారా నిరసనకారులు తమ ఇళ్లకు వెళ్లిపోయేవిధంగా చేయాలని ఇరాన్ అధికారులు (Iran Authorities) అనుకుంటున్నారన్నారు. దీని ప్రభావం కొంత వరకు ఉందన్నారు. అయితే అధికారులపై మరింత ఆగ్రహం వ్యక్తమవుతోందని తెలిపారు.
Updated Date - 2022-12-30T18:38:03+05:30 IST