Maharashtra: సరిహద్దుల వివాదంపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
ABN, First Publish Date - 2022-12-27T16:33:04+05:30
కర్ణాటకతో సరిహద్దుల విషయంలో మహారాష్ట్ర అసెంబ్లీ మంగళవారంనాడు ఏకగ్రీవ తీర్మానం చేసింది. కర్ణాటకతో సరిహద్దుల ప్రాంతంలో నివసిస్తున్న మరాఠీ ప్రజలకు..
నాగపూర్: కర్ణాటకతో సరిహద్దుల విషయంలో (Border issue) మహారాష్ట్ర అసెంబ్లీ మంగళవారంనాడు ఏకగ్రీవ తీర్మానం చేసింది. కర్ణాటకతో సరిహద్దుల ప్రాంతంలో నివసిస్తున్న మరాఠీ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ ఒక తీర్మానాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) ప్రవేశపెట్టారు. అనంతరం తీర్మానాన్ని ఆయన చదవి వినిపించారు. ''సరిహద్దు ప్రాంతంలోని మరాఠీ ప్రజల భద్రతకు హామీ ఇస్తూ కేంద్ర హోం మంత్రి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తూచ తప్పకుండా అమలు చేసేలా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్రాన్ని కోరుతున్నాం'' అని షిండే ఆ తీర్మానంలోని సారాంశాన్ని సభకు తెలిపారు.
దీనికి ముందు, మహారాష్ట్ర వికాస్ అఘాడి నేత ఉద్ధవ్ థాకరేపై షిండే విమర్శలు గుప్పించారు. ఇతరుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న వారికి బాసటగా తాము ఉన్నామని అన్నారు. ఇందుకు సంబంధించి ఒక తీర్మానాన్ని కూడా సభలో ప్రవేశపెడుతున్నామని మీడియాకు తెలిపారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సైతం సభకు హామీ ఇస్తూ, ఒక్క అంగుళం భూమిని కూడా తాము వదులుకునేదన్నారు. కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రజలకు న్యాయం జరిగేందుకు ఏమి చేయాల్సి వచ్చినా చేస్తామని చెప్పారు.
కర్ణాటక అసెంబ్లీలోనూ ఏకగ్రీవ తీర్మానం
ఆసక్తికరంగా, అటు కర్ణాటక అసెంబ్లీలోనూ సరిహద్దు వివాదం విషయంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారంనాడు ఒక తీర్మానం ప్రవేశపెట్టడం, దానిని సభ ఆమోదించడం జరిగింది. బీజేపీ అటు కర్ణాటకలోనూ, ఇటు మహారాష్ట్రలో షిండే సారథ్యంలోని శివసేనతో భాగస్వామిగానూ అధికారంలో ఉంది.
Updated Date - 2022-12-27T16:34:47+05:30 IST