Indian Railways: మళ్లీ పాతపాటే పాడుతున్నారు ఈ రైల్వే మంత్రి
ABN, First Publish Date - 2022-12-14T19:16:35+05:30
రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణపై కేంద్రం పెదవి విరిచింది. ఖర్చులు తడిసిమోపెడవుతున్నందున
న్యూఢిల్లీ: రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీల (Senior Citizens Concessions) పునరుద్ధరణపై కేంద్రం పెదవి విరిచింది. ఖర్చులు తడిసిమోపెడవుతున్నందున ఇప్పటికిప్పుడు రాయితీలు పునరుద్ధరించ లేమని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) తెలియజేశారు. రైళ్లలో సీనియర్ సిటిజన్లకు టిక్కెట్ల రాయితీని ఎప్పుడు పునరుద్ధరిస్తారని మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ రాణా లోక్‌సభలో బుధవారంనాడు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు సమాధానం ఇచ్చారు. గతంలో సీనియర్ సిటిజన్లకు రైళ్లలో 40 నుంచి 50 శాతం టిక్కెట్ రాయితీ ఉండేది. కరోనా సమయం నుంచి ఈ రాయితీలను కేంద్ర నిలిపివేసింది.
''గత ఏడాది ప్రయాణికుల సేవల కోసం రూ.59 వేల కోట్లు రాయితీ ఇచ్చాం. ఇది పలు రాష్ట్రాల బట్జెట్ కంటే కూడా ఎక్కువ. పెన్షన్లు, వేతన బిల్లులు చాలా ఎక్కువగా ఉన్నాయి'' అని మంత్రి తన సమాధానంలో తెలిపారు. రైల్వేల వార్షిక పెన్షన్ బిల్లు రూ.60,000 కోట్లు ఉందని, వేతన బిల్లులు రూ.97,000 కోట్లు, ఇంధనం కోసం రూ.40,000 కోట్లు ఖర్చవుతున్నాయని ఆయన చెప్పారు. ఒకవేళ ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు రాయితీ అంశాన్ని పరిశీలిస్తామని, ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి లేదని అన్నారు. ప్రతి ఒక్కరూ రైల్వేల స్థితిగతులను చూడాలని కోరారు.
ప్రస్తుతం వందే భారత్ రైళ్లను సిట్టింగ్ కెపాసిటీతో 500 నుంచి 55 కిలోమీటర్ల గరిష్ట దూరం నడుపుతున్నామని, పడుకునే సదుపాయం అందుబాటుులోకి వస్తే దూర ప్రయాణాలకు ఈ రైళ్లను వినియోగిస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. రామాలయ నిర్మాణం పూర్తయ్యేనాటికి దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి అయోధ్యకు అనుసంధానిస్తూ రైళ్లు నడిపేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. 41 ప్రధాన రైల్వేస్టేషన్ల రీడవలప్‌మెంట్ పనులు జరుగుతున్నామని, మిగిలిన స్టేషన్లకు కూడా దశలవారిగా అభివృద్ధి చేస్తామని అన్నారు. 2030 నాటికి రైల్వేలను కాలుష్య రహితంగా రూపొందించేందుకు కృషి చేస్తు్న్నామని చెప్పారు.
Updated Date - 2022-12-14T20:08:04+05:30 IST