Parliament Winter Session: రైతు పుత్రుడుగా ఉపరాష్ట్రపతిని సంబోధించిన మోదీ
ABN, First Publish Date - 2022-12-07T14:19:48+05:30
న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు...
న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankar)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశంసలు కురిపించారు. జీవితంలో ఎంతో కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని కొనియాడారు. 'రైతు పుత్రుడు' (Kisan Putra) అని అభివర్ణించారు. బుధవారం పార్లమెంటు శీతాకాల సమావేశాల మొదటిరోజు సభాకార్యక్రమాలను చేపట్టిన ధన్‌ఖడ్‌కు మోదీ స్వాగతం పలికారు. ''సభ తరఫున, దేశం తరఫున చైర్మన్‌ను నేను అభినందిస్తు్న్నాను. ఎన్నో ఆటుపోట్ల నడుమ మీరు ఈ స్థాయికి ఎదిగారు. దేశ ప్రజలకు ఇదెంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. చైర్మన్ పదవికి మరింత వన్నె పెరిగింది'' అని మోదీ సభలో మాట్లాడుతూ అన్నారు.
కిసాన్ పుత్ర..
కిసాన్ పుత్రుడైన ఉపరాష్ట్రపతి సైనిక్ స్కూలులో చదివారని, ఆవిధంగా ఆయన జవాన్లతోనూ, కిసాన్లతోనూ సన్నిహిత సంబంధాలున్నాయని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజన తరగతుల నుంచి వచ్చారని, ఆమెకు ముందు పదవిని చేపట్టిన రామ్‌నాథ్ కోవింద్ కూడా అట్టడుగు వర్గాల నుంచి వచ్చారని గుర్తుచేశారు. జి-20 అధ్యక్ష పగ్గాలను భారత చేపట్టిన తరుణంలో శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయని అన్నారు. భారతదేశ పార్లమెంటు ప్రపంచానికి 'టార్చ్ బారర్' అని అన్నారు. రాజ్యసభ దేశానికి అతి పెద్ద బలం అని, మన ప్రధానమంత్రులలో అనేక మంది రాజ్యసభ సభ్యులుగా పనిచేశారని అన్నారు. కాగా, బుధవారం ప్రారంభమైన రాజ్యసభ సమావేశాలు డిసెంబర్ 19వ తేదీ వరకూ జరుగనున్నాయి. గుజరాత్ ఎన్నికల కారణంగా రాజ్యసభ సమావేశాలు షెడ్యూల్ సమయం కంటే నెలరోజులు ఆలస్యంగా మొదలయ్యాయి.
Updated Date - 2022-12-07T14:19:50+05:30 IST