Giriraj Singh: చైనాతో పోటీ పడాలంటే జనాభా నియంత్రణ బిల్లు తేవాల్సిందే
ABN, First Publish Date - 2022-11-27T16:31:10+05:30
జనాభా నియంత్రణ బిల్లుపై మరోసారి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తన గళం విప్పారు. పరిమిత వనరుల దృష్ట్యా దేశంలో..
న్యూఢిల్లీ: జనాభా నియంత్రణ బిల్లు (Population Contral Bill)పై మరోసారి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ (Giriraj Singh) తన గళం విప్పారు. పరిమిత వనరుల దృష్ట్యా దేశంలో జనాభా నియంత్రణ బిల్లు అనివార్యమని, మత నమ్మకాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీనిని పాటించాలని అన్నారు. ఇందుకు భిన్నంగా ఎవరు వ్యవహరించినా ప్రభుత్వ ప్రయోజనాలు వర్తింప చేయరాదని, వారి ఓటింగ్ హక్కులు రద్దు చేయాలని అన్నారు.
''జనాభా నియంత్రణ బిల్లు అనేది చాలా కీలకం. మనకు పరిమిత వనరులు మాత్రమే ఉన్నాయి. చైనా ఒకే పిల్లవాడు విధానం (one child policy) అమలు చేసింది. జనాభాను నియంత్రించి, అభివృద్ధి సాధించింది. చైనాలో ప్రతి నిమిషానికి 10 మంది పిల్లలు పుడతారు. ఇండియాలో నిమిషానికి 30 మంది పుడుతుంటారు. అలాంటప్పుడు మనం చైనాతో ఎలా పోటీపడగలం?'' అని గిరిరాజ్ ప్రశ్నించారు.
మహిళలపై హింస మతం కోణంలో చూడరాదు..
మహిళలపై ఎలాంటి హింస జరిగినా దానిని మతం కోణంలో చూడరాదని, ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా అలాంటి ఘటనలను నిర్ద్వంద్వంగా ఖండించాలని గిరిరాజ్ సింగ్ అన్నారు. 'జెండర్ బేస్ట్ డిస్క్రిమినేషన్ అండ్ వయలెన్స్'పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తమ గురించి ఏమనుకుంటారో అనే భయంతోనే బాధిత మహిళలు హింసకు వ్యతిరేకంగా ఎప్పుడోకానీ తమ గొంతు వినిపించరని అన్నారు. జెండర్ రిలేటెడ్ వయలెన్స్‌ను చరమగీతం పాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళలు స్వయం సమృద్ధి సాధించి, జెండర్ బేస్ట్ వయలెన్స్‌పై మాట్లాడేలా వారిలో ఆత్మవిశ్వాసం పెంచాలని, ఇందుకోసం అందర్నీ కలుపుకొని వెళ్లాలని తమ మంత్రిత్వ శాఖను ఆదేశించినట్టు చెప్పారు.
Updated Date - 2022-11-27T16:31:12+05:30 IST