TRS MLAs poaching case: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు
ABN, First Publish Date - 2022-11-18T21:47:52+05:30
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న ఉదయం పదిన్నరకు కమాండ్ కంట్రోల్‌లోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసులో సిట్ అధికారులు స్పష్టం చేశారు.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) అధ్యక్షతన ఇటీవలే సిట్‌ను ఏర్పాటు చేశారు. ఆరుగురు పోలీస్ ఉన్నతాధికారులతో ఆరుగురు సభ్యులుగా ఉంటారు. నల్గొండ ఎస్పీ రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, శంషాబాద్ డీసీపీ జగదేశ్వర్‌రెడ్డి, మొయినాబాద్ సీఐ లక్ష్మిరెడ్డిలను సిట్ సభ్యులుగా ఎంపిక చేశారు.
హైదరాబాద్ నగర శివార్లలోని మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్), రేగా కాంతారావు (పినపాక)ను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ కేసులో రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Updated Date - 2022-11-18T22:11:15+05:30 IST