Note Demonetisation: నోట్ల రద్దుకు ఆరేళ్లు.. వైరల్ అవుతున్న ఫొటో!
ABN, First Publish Date - 2022-11-08T16:15:29+05:30
నేటికి సరిగ్గా 6 సంవత్సరాల క్రితం.. ఇదే రోజున భారత ప్రధాని నరేంద్రమోదీ (narendra modi) చేసిన ప్రకటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది
న్యూఢిల్లీ: నేటికి సరిగ్గా 6 సంవత్సరాల క్రితం.. ఇదే రోజున భారత ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) చేసిన ప్రకటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పటి వరకు చేతిలో కాస్తోకూస్తో డబ్బులు ఉన్నవాళ్లందరూ ఒక్కసారిగా పేదలు అయిపోయారు. ఉన్న డబ్బుకు విలువ లేకుండా పోయింది. పాత డబ్బును మార్చుకునేందుకు జనం నిద్రాహారాలు మాని బ్యాంకుల ముందు పడిగాపులు కాశారు. ఈ క్రమంలో ముసలీముతక క్యూలో గంటల కొద్దీ నిల్చోలేక స్పృహతప్పి పడిపోయారు. మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.
రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు (Note Demonetisation) చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించిన వెంటనే దేశ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. అధికార పార్టీ నేతలు ఈ చర్యను సమర్థిస్తే, ఉన్నపళంగా దేశ ప్రజలను బికారిలను చేశారంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. 8 నవంబరు 2016న మోదీ చేసిన ఆ ప్రకటనకు నేటితో ఆరేళ్ల నిండాయి. నాటి దెబ్బ నుంచి కోలుకునేందుకు ప్రజలకు చాలా కాలమే పట్టింది. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. నోట్ల రద్దు పుణ్యమా అని ప్రజలు డిజిటల్ లావాదేవీల వైపు మళ్లారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి.
నోట్ల రద్దు జరిగి ఆరేళ్లు అయినా ప్రజలు మాత్రం ఇంకా నాటి బాధలను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న పోస్టులు, ఫొటోలు, వీడియోలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా రూ. 500, రూ. 1000 నోట్లను ఫొటో ఫ్రేమ్‌లో ఉంచి దానికి దండ వేసిన ఫొటోలో తెగ వైరల్ అవుతోంది. నోట్ల రద్దుతో అవినీతికి కళ్లెం పడుతుందని ప్రధాని మోదీ అప్పట్లో చెప్పుకొచ్చారు. అయితే, నోట్ల రద్దు కారణంగా దేశ ప్రజలకు ఒనగూరిన ప్రయోజనాలేంటో ఇప్పటికీ చెప్పడం లేదంటూ ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. నల్లధనం నియంత్రణ కోసమే నోట్లు రద్దు చేశామని ప్రధాని చెప్పినప్పటికీ అదేమీ జరగకపోగా, నల్లధనం ఇంకా పోగుపడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిపుణులు కూడా నగదుపై ఆధారపడేవారి సంఖ్య మళ్లీ పెరిగిందని చెబుతున్నారు.
భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) చెబుతున్న గణాంకాల ప్రకారం.. అక్టోబరు 21 నాటికి ప్రజల వద్ద ఉన్న నగదు రికార్డు స్థాయిలో రూ. 30.88 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే, నోట్ల రద్దు జరిగిన ఆరేళ్ల తర్వాత కూడా నగదు వినియోగం గణనీయంగానే ఉందని ఈ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ప్రజల వద్ద ఉన్న నగదు.. 4 నవంబరు 2016న ప్రజల వద్ద ఉన్న నగదుతో పోలిస్తే 71.84 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
2015-16 ఆర్థిక సంవత్సరంలో చెల్లింపు విధానంలో నగదు చలామణి (CIC) వాటా 88 శాతం ఉండగా, 2021-22 నాటికి అది 20 శాతానికి తగ్గిందని, 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి మరింత తగ్గి 11.15 శాతానికి పడిపోతుందని భారతీయ స్టేట్ బ్యాంక్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. అదే సమయంలో డిజిటల్ లావాదేవాలు మాత్రం గణనీయంగా పెరిగాయి. 2015-16లో 11.26 శాతంగా ఉన్న డిజిటల్ లావాదేవీలు 2021-22 నాటికి 80.4 శాతానికి పెరిగినట్టు తెలిపింది. 2026-27 నాటికి ఇది మరింత పెరిగి 88 శాతానికి చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది.
నోట్ల రద్దుపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ట్వీట్ చేస్తూ.. నోట్ల రద్దుతో దేశాన్ని నల్లధనం నుంచి విముక్తి చేస్తామని అన్నారని, కానీ అది వ్యాపారాలను, ఉద్యోగాలను తీవ్రంగా దెబ్బతీసిందని విమర్శించారు. ఈ ‘మాస్టర్ స్ట్రోక్’ తగిలిన ఆరేళ్ల తర్వాత ప్రజలకు అందుబాటులో ఉన్న నగదు 2016 కంటే 72 శాతం ఎక్కువని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి దారితీసిన ఈ ఘోర వైఫల్యాన్ని ప్రధాని ఇంకా గుర్తించలేదని అన్నారు. కాగా, అమెరికాలోని యూనవర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ అమ్‌హెరస్ట్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ జయంతి గోష్ మాట్లాడుతూ.. నోట్ల రద్దు లక్ష్యాలు నెరవేరలేదని అన్నారు.
రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత అంతకంటే పెద్దదైన రూ. 2000 నోటును తీసుకొచ్చింది. ఆ తర్వాత రూ. 500, రూ. 200 నోట్లను కూడా ప్రవేశపెట్టింది. 31 మార్చి 2021 నాటికి దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న మొత్తంలో రూ. 500, రూ. 2000 నోట్ల వాటా 85.7 శాతంగా ఉంది. అంతకుముందు ఈ ఏడాది ఇది 83.4 శాతంగా ఉండడం గమనార్హం.
Updated Date - 2022-11-08T16:31:59+05:30 IST