ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kashmir Files : ‘కశ్మీర్ ఫైల్స్’పై మరోసారి రచ్చ రచ్చ

ABN, First Publish Date - 2022-11-29T21:38:02+05:30

సొంత దేశంపైనే విమర్శలు గుప్పించే ఇజ్రాయెలీ సినీ ప్రముఖుడు నడవ్ లపిడ్ (Nadav Lapid) చేసిన వ్యాఖ్యలు

The Kashmir Files
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : సొంత దేశంపైనే విమర్శలు గుప్పించే ఇజ్రాయెలీ సినీ ప్రముఖుడు నడవ్ లపిడ్ (Nadav Lapid) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మన దేశంలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. కశ్మీరీ పండిట్లు అనుభవించిన కష్టాలను వివరిస్తూ నిర్మించిన ‘ది కశ్మీరీ ఫైల్స్’ చిత్రం వల్గర్ ప్రోపగాండా అని, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించడానికి తగినది కాదని ఆయన వ్యాఖ్యానించడంతో మన దేశంలోని సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. అయితే కొందరు ఆయనకు మద్దతుగా, మరికొందరు ఆయనను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. కానీ ఇజ్రాయెల్ రాయబారి మాత్రం అతిథిని దైవంగా భావించే దేశానికి వచ్చి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

1990వ దశకంలో కశ్మీరు లోయలో అనేక మంది కశ్మీరీ పండిట్లు ప్రాణాలు కోల్పోవడం, అక్కడి నుంచి పారిపోవడం గురించి వివరిస్తూ కశ్మీర్ ఫైల్స్ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. 2022లో భారీ వసూళ్ళతో రికార్డు సృష్టించిన ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాను గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ఇజ్రాయెల్‌కు చెందిన స్క్రీన్ రైటర్, డైరెక్టర్ నడవ్ లపిడ్ ఈ ఉత్సవాల జ్యూరీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఆయన సోమవారం ఈ ఉత్సవాల ముగింపు సందర్భంగా మాట్లాడుతూ, కశ్మీర్ ఫైల్స్ సినిమాపై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోటీలో పాల్గొన్న 15 సినిమాల్లో 14 సినిమాలపై జ్యూరీ సభ్యులు సవివరంగా చర్చించారని, 15వ సినిమా (కశ్మీర్ ఫైల్స్) తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. అది తమకు వల్గర్ ప్రోపగాండాగా కనిపించిందన్నారు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక ఉత్సవాల్లో కళాత్మక పోటీ విభాగంలో ప్రదర్శించడానికి ఇది తగినది కాదన్నారు.

సినిమాలు మానేస్తా : వివేక్ అగ్నిహోత్రి

‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మంగళవారం విడుదల చేసిన వీడియో సందేశంలో నడవ్ లపిడ్‌తో సహా మేధావులకు సవాల్ విసిరారు. ఈ చిత్రంలో చూపిన ఏదైనా సన్నివేశం, సంఘటన, డైలాగ్, షాట్ తప్పు అని, పరిపూర్ణ వాస్తవం కాదని రుజువు చేస్తే తాను సినీ నిర్మాణం నుంచి వైదొలగుతానని చెప్పారు. తాను పోరాటం కొనసాగిస్తానన్నారు. ఎన్ని కావాలనుకుంటే అన్ని ఫత్వాలు జారీ చేసుకోండని సవాల్ చేశారు. తాను వెనుకంజ వేసే వ్యక్తిని కాదన్నారు. సత్యం చాలా ప్రమాదకరమైనదని, అది అబద్ధమాడేలా చేస్తుందని అన్నారు. భారత దేశాన్ని విభజించాలని కోరుకునే గ్యాంగ్‌లు తనపై దాడి చేయడం కొత్త విషయం కాదన్నారు. ఉగ్రవాద సంస్థలు, అర్బన్ నక్సల్స్, టుకడే టుకడే గ్యాంగ్ ఇలాంటి పనులు చేస్తాయని చెప్పారు. భారత ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాన్ని భారత దేశం నుంచి కశ్మీరును వేరు చేయాలని కోరుకునే ఉగ్రవాద భావాలకు మద్దతిచ్చేందుకు ఉపయోగించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని తెలిపారు.

ఎంత పెద్ద అబద్ధమైనా సత్యం ముందు చాలా చిన్నది : అనుపమ్ ఖేర్

‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం ఫేమ్ అనుపమ్ ఖేర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ, లపిడ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అబద్ధం ఎంత పెద్దదైనా సత్యం ముందు ఎప్పుడూ చాలా చిన్నదేనని చెప్పారు. ఈ చిత్రంతోపాటు స్టీవెన్ స్పీల్‌బర్గ్ చిత్రం ‘షిండ్లర్స్ లిస్ట్’లోని సన్నివేశాల ఫొటోలను పోస్ట్ చేశారు.

సినీ నిర్మాత అశోక్ పండిట్ స్పందిస్తూ, కశ్మీర్ ఫైల్స్ చిత్రం విషయంలో లపిడ్ ఉపయోగించిన భాష పట్ల తాను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. మూడు లక్షల మంది కశ్మీరీ హిందువులను దారుణంగా చంపడాన్ని చూపించడం వల్గర్ (Vulgar) కాదన్నారు. ఉగ్రవాద బాధితుల పట్ల ఈ సిగ్గుమాలిన దూషణ చర్యను తాను ఓ సినీ నిర్మాతగా, ఓ కశ్మీరీ పండిట్‌గా ఖండిస్తున్నానని తెలిపారు.

లపిడ్ వ్యక్తిగతం : జ్యూరీ మెంబర్

నడవ్ లపిడ్ వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ బోర్డు ప్రకటించింది. జ్యూరీ మెంబర్ సుదీప్తో సేన్ ఇచ్చిన ట్వీట్‌లో, నడవ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, అవి జ్యూరీ సమష్టి అభిప్రాయాలు కాదని స్పష్టం చేశారు.

సిగ్గుండాలి : ఇజ్రాయెల్ రాయబారి

నడవ్ లపిడ్ వ్యాఖ్యలపై భారత దేశానికి ఇజ్రాయెల్ రాయబారి నఓర్ గిలన్ మంగళవారం ఘాటుగా స్పందించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాను విమర్శించిన నడవ్ లపిడ్‌కు బహిరంగ లేఖ రాస్తున్నానని గిలన్ ట్విటర్ వేదికగా తెలిపారు. భారత దేశంలోని సోదర, సోదరీమణులు తన భావాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆంగ్లంలో ఈ ట్వీట్ చేస్తున్నానని, అందుకే దీనిని హిబ్రూ భాషలో రాయడం లేదని పేర్కొన్నారు. తన లేఖ సుదీర్ఘంగా ఉంటుంది కాబట్టి తాను చివర్లో చెప్పవలసినదానిని ముందుగా చెబుతానని తెలిపారు. ‘‘నువ్వు సిగ్గుపడాలి. ఎందుకంటే...’’ అని మొదట పేర్కొన్నారు. ‘‘భారతీయ సంస్క‌తిలో అతిథిని దైవంగా భావిస్తారు. గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల జడ్జీల ప్యానెల్‌కు అధ్యక్షత వహించాలని భారత దేశం మిమ్మల్ని ఆహ్వానించింది. ఆ ఆహ్వానాన్ని మీరు దుర్వినియోగం చేశారు. అంతేకాకుండా మీకు భారతీయులు ఇచ్చిన ఆతిథ్యం, మీమీద వారు పెట్టుకున్న నమ్మకం, మీకు ఇచ్చిన గౌరవాలను మీరు దుర్వినియోగం చేశారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మానవుడిగా తాను సిగ్గు పడుతున్నానని, స్నేహం, దాతృత్వం ప్రదర్శించిన అతిథుల పట్ల మనం ఎంతో చెడుగా ప్రవర్తించామని, అందుకు క్షమాపణ చెప్తున్నానని తెలిపారు.

ఖుష్బూ స్పందన

గిలన్ స్పందించిన తీరును ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ ప్రశంసించారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘మీరు ఇస్తున్న మద్దతుకు ధన్యవాదాలు. ప్రతి భారతీయుడి కోసం మీరు మాట్లాడారు. ఆ సినిమాలో చూపిన బాధ, ఆవేదన వక్రీకరించిన చరిత్ర కాదు, కశ్మీరీ పండిట్లు వాస్తవంగా అనుభవించిన యథార్థం. మీ మాటలు ఓదార్పునిచ్చే మందులా పని చేస్తాయి’’ అని పేర్కొన్నారు.

విద్వేషం విమర్శలపాలవుతుంది : కాంగ్రెస్

నడవ్ లపిడ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా డిపార్ట్‌మెంట్ హెడ్ సుప్రియ శ్రినటే స్పందిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం, బీజేపీ, రైట్ వింగ్ ఎకోసిస్టమ్ ఉద్వేగంతో ‘ది కశ్మీర్ ఫైల్స్’ను ప్రమోట్ చేశారన్నారు. ఆ సినిమాను అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు తిరస్కరించినట్లు తెలిపారు. జ్యూరీ హెడ్ నడవ్ లపిడ్ ఈ చిత్రం ఈ ఉత్సవాల్లో ప్రదర్శించడానికి తగినది కాదన్నారని, అదొక ప్రచారమని, వల్గర్ మూవీ అని అన్నారని తెలిపారు. విద్వేషం అంతిమంగా విమర్శలపాలవుతుందన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ స్పందిస్తూ, యథార్థం, కల్పితం కలగలిసి ముఠా, కక్ష (Fact+Fiction= Faction)గా మారిందన్నారు.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమ మహమ్మద్ ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశ ప్రజలను తమవైపు తిప్పుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వం ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసిందన్నారు. ఫలితంగా అంతర్జాతీయంగా భారత దేశానికి అతి పెద్ద ఇబ్బంది ఎదురైందన్నారు.

సినిమాపైనే విమర్శలు

‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమానే లపిడ్ విమర్శించారని, కశ్మీరీ పండిట్లపై జరిగిన దురాగతాలను ఆయన తిరస్కరించలేదని టీఎంసీ పేర్కొంది. విషాదాన్ని డబ్బు సంపాదన కోసం వాడుకున్నారని విమర్శించారని పేర్కొంది. నష్టాన్ని తగ్గించుకోవడం కోసం ఇజ్రాయెలీ దౌత్యవేత్తలను ప్రభుత్వం వాడుకుంటోందని తెలిపింది.

శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం మాట్లాడుతూ నడవ్ లపిడ్‌కు మద్దతుగా నిలిచారు. ‘కశ్మీర్ ఫైల్స్’ విషయంలో లపిడ్ వ్యాఖ్యలు సరైనవేనని తెలిపారు. ఒక పార్టీ మరొక పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిందన్నారు. ప్రచారం చేయడంలో ఓ పార్టీ, ప్రభుత్వం తీరిక లేకుండా గడిపాయన్నారు. ఈ సినిమా వచ్చిన తర్వాత కశ్మీరులో అత్యధిక హత్యలు జరిగాయన్నారు. కశ్మీరీ పండిట్లు, భద్రతా సిబ్బంది హత్యకు గురవుతున్నారన్నారు.

ఇదిలావుండగా, లపిడ్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఘాటుగా స్పందించారు. జ్యూరీ సభ్యులు దేవుళ్ళు కాదని శర్మ వ్యాఖ్యానించారు. కశ్మీరులో ఏం జరిగిందో తాము చూశామన్నారు. ఈ సినిమాను విమర్శించే అధికారం జ్యూరీ సభ్యులకు ఎవరిచ్చారన్నారు.

అసలు ఈ నడవ్ లపిడ్ ఎవరు?

నడవ్ లపిడ్ ఇజ్రాయెల్‌లోని టెల్-అవివ్‌లో 1975లో జన్మించారు. స్వదేశంపైనే ఆయన కొన్నిసార్లు ప్రేమాభిమానాలను ప్రదర్శిస్తారు, మరికొన్నిసార్లు ద్వేషాన్ని ప్రకటిస్తారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇజ్రాయెల్ సమష్టి ఆత్మ రోగిష్టిదని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెలీ ఉనికి సారం తప్పుడుదన్నారు, అది కుళ్లిపోయిందన్నారు. దీనికి కారణం నవ్వుతూ, ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తని ఇజ్రాయెలీ యువత అని చెప్పారు. ఇజ్రాయెలీలమనే గర్వం వారికి అధికంగా ఉంటుందన్నారు. ‘‘మేము, మిగిలినవారు’’ అనే ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తారన్నారు.

Updated Date - 2022-11-29T21:38:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising