Rajnath Singh: మైత్రి కోసం భద్రతపై రాజీ పడం
ABN, First Publish Date - 2022-12-30T14:45:19+05:30
పొరుగుదేశాలతో భారత్ మైత్రీ సంబంధాలపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టమైన వివరణ..
తిరువనంతపురం: పొరుగుదేశాలతో భారత్ మైత్రీ సంబంధాలపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఇరుగుపొరుగు దేశాలతో భారత్ ఎప్పుడూ మైత్రిని, సత్సంబంధాలను కోరుకుంటుందని, అయితే భద్రత విషయంలో మాత్రం రాజీపడేది లేదని అన్నారు. మైత్రి కోసం దేశ భద్రతను పణంగా పెట్టే ప్రసక్తి ఉండదని చెప్పారు. శివగిరి మఠం 90వ పిలిగ్రిమేజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రంలో ఆయన మాట్లాడుతూ, మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి గతంలో చెప్పిన విషయాలను గుర్తు చేశారు. మిత్రులను మార్చుకోగలం కానీ, ఇరుగుపొరుగు వారిని మార్చుకోలేమని అప్పట్లో వాజ్‌పేయి చెప్పేవారని అన్నారు. భారతదేశం ఎప్పుడూ ఇరుగుపొరుగు వారితో సత్సంబంధాలనే కోరుకుంటుందని, అందుకోసం దేశ భద్రతను మాత్రం పణంగా పెట్టేది లేదని అన్నారు. భద్రతతో రాజీపడే సంబంధాలను భారత్ కోరుకోదని స్పష్టం చేశారు.
ఎక్కడా ఏ కార్యక్రమం ఆగకూడదని మోదీ చెప్పారు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరోబెన్ మోదీ ఈరోజు కన్నుమూశారని, అయితే ఎవరెవరికి ఎక్కడెక్కడ కార్యక్రమాలు ఉన్నా వాటిని రద్దు చేసుకోకుండా పూర్తి చేసుకుని ఢిల్లీకి రావాలని మోదీ చెప్పారని తెలిపారు. హీరోబెన్ మోదీకి నివాళిగా రాజ్‌నాథ్ సహా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఒక నిమిషం పాటు మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించారు.
Updated Date - 2022-12-30T14:45:21+05:30 IST