ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Satyadev : ఆ బ్లాస్ట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నా.. (OHRK)

ABN, First Publish Date - 2022-12-11T23:34:39+05:30

వెండితెర కావచ్చు... ఓటీటీ కావచ్చు... ఏదైనా తనదైన ముద్ర వేసే విలక్షణ నటుడు సత్యదేవ్‌. గాడ్‌ఫాదర్లు లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి, తన అభిమాన హీరోనే ‘గాడ్‌ఫాదర్‌’గా చేసుకున్నారు. ‘రామసేతు’తో ఉత్తరాది ప్రేక్షకుల ఆదరణను సైతం సంపాదించుకున్నారు. మొన్ననే ‘గుర్తుందా శీతాకాలం’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన సత్యదేవ్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెండితెర కావచ్చు... ఓటీటీ కావచ్చు...

ఏదైనా తనదైన ముద్ర వేసే విలక్షణ నటుడు సత్యదేవ్‌.

గాడ్‌ఫాదర్లు లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి, తన అభిమాన హీరోనే ‘గాడ్‌ఫాదర్‌’గా చేసుకున్నారు. ‘రామసేతు’తో ఉత్తరాది ప్రేక్షకుల ఆదరణను సైతం సంపాదించుకున్నారు. మొన్ననే ‘గుర్తుందా శీతాకాలం’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన సత్యదేవ్‌...

‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌ హార్ట్‌విత్‌ ఆర్కే’లో పంచుకున్న విశేషాలివి.

ఆర్కే: హలో! సత్యదేవ్‌... ఎలా ఉన్నారు?

సత్యదేవ్‌: చాలా బాగున్నా... థ్యాంక్యూ.

ఆర్కే: మంచి నటుడిని అవుతానానే నమ్మకం ఎప్పుడు కలిగింది?

సత్యదేవ్‌: నేను ఆడిషన్స్‌ చేసేవాణ్ణి. వీడియోలు పంపించేవాణ్ణి. ‘‘ఏదో ఒక రీజన్‌ వల్ల నిన్ను సెలక్ట్‌ చెయ్యలేకపోతున్నాం, కానీ నీ పెర్ఫార్మెన్స్‌ అదిరిపోయింది. వేరే అవకాశం ఉంటే నీకు తప్పకుండా చెబుతాం’’ అనేవారు. అలాగే నేను మొదట్లో చేసిన ఫ్రెండ్‌ రోల్స్‌ కావచ్చు, విలన్‌ రోల్స్‌ కావచ్చు, అందరూ ‘భలే చేస్తున్నావ్‌’ అనేవారు. నేను పదో వరసలో ఉన్నా కూడా హీరోలా ఫీలయ్యేవాణ్ణి. ఒక సినిమా ఆడిషన్స్‌కు వెళ్ళినప్పుడు అందరూ ‘‘అంతా బాగుంది.. ఈ నుదుటి మీద మార్క్‌ చాలా ఎక్కువగా కనబడుతోంది. అది బాగులేదు’’ అని వేరే వాళ్ళని ఎంచుకున్నారు. ‘‘నేను భవిష్యత్తులో నటించినప్పుడు... ఆ మచ్చని గమనించనంతగా నటించాలి’’ అని అప్పుడే చాలా బలంగా అనుకున్నాను.

ఆర్కే: నుదుటి మీద ఏమైంది అసలు?

సత్యదేవ్‌: చిరంజీవి గారంటే నాకు పిచ్చి. చిన్నప్పుడు ‘కొదమసింహం’ సినిమా చూసి.. అందులోని ఫైట్‌ని నేను మా ఇంట్లో వైర్‌ పట్టుకొని ప్రాక్టీస్‌ చేశాను. అది తెగి, ఒక ఎడ్జ్‌ మీద తల తగిలింది. డాక్టర్‌ తుప్పు పట్టిన నీడిల్‌తో కుట్లు వేశారు. అది సెప్టిక్‌ అయి... ఓపెన్‌ అయిపోయింది. ఎప్పుడైనా నాకు బాధేసినప్పుడు.. ‘‘చంద్రుడికి ఒక మచ్చ ఉంది.. నీకు మచ్చ ఉందంటూ మా అమ్మ ఓదార్చేది. చిరంజీవిగారికి సంబంధించి ఇది నాకొక స్వీట్‌ మెమొరీ. అందుకే ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోమని చాలామంది చెప్పినా చేయించుకోలేదు.

ఆర్కే: సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలు చేశారు. సినిమా ఇండస్ట్రీ వైపు రావాలనే ఆలోచన ఎందుకొచ్చింది?

సత్యదేవ్‌: నాకు ఊహ తెలిసినప్పట్నుంచీ యాక్టర్‌ కావాలనే కోరిక చాలా బలంగా ఉండేది. ‘ఖుషి’ సినిమా చూసి కత్తి ఫైట్‌ నేర్చుకుంటాననేవాడిని. మరో సినిమా చూసి మరొకటి. మా కజిన్స్‌ ఏడిపించేవారు. అయితే వైజాగ్‌లో సినిమా అవకాశాలు లేవు. ఈలోగా బిటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చేశాను. దీని ఆధారంగా జాబ్‌ తెచ్చుకుంటే ముందు బేస్‌ వస్తుంది. ఇంట్లో వాళ్ళకు టెన్షన్‌ ఉండదనుకొని, ఉద్యోగంలో చేరాను.

ఆర్కే: ఎన్నేళ్ళు జాబ్‌ చేశారు?

సత్యదేవ్‌: ఆరేళ్ళు. ‘బ్లఫ్‌ మాస్టర్‌’ సినిమా వరకూ జాబ్‌ చేస్తూనే ఉన్నాను. రెండూ మేనేజ్‌ చేశాను.

ఆర్కే: పరిశ్రమలో స్థిరపడగలననే నమ్మకం అప్పటికి వచ్చేసిందా? సేఫ్‌జోన్‌ నుంచి, మంచి జీతాన్ని వదిలేసి బైటికి రావడం పెద్ద సమస్య కదా? అలాంటి సమయంలో మిమ్మల్ని ఎవరు గైడ్‌ చేశారు?

సత్యదేవ్‌: నా వైఫ్‌ దీపిక. నేను ఎడారిలోనైనా బతికేస్తానని ఆమె బలంగా నమ్ముతుంది. ‘నీ ప్రయత్నాలు ఎక్కడో డివైడ్‌ అయిపోతున్నాయ’ని చెప్పింది. అప్పటికి నా చేతిలో సినిమాలు కూడా లేవు. ఏదైతే అదవుతుందన్నాను. ఆమె బలవంతం చేసి ఉద్యోగం మాన్పించేసింది.

ఆర్కే: సినిమాలో ప్రవేశించకముందే పెళ్ళయిపోయిందా?

సత్యదేవ్‌: లవ్‌లో ఉన్నాం. ఆమె నాకు కాలేజీ రోజుల నుంచి పరిచయం. ‘జ్యోతిలక్ష్మి’ సినిమా టైమ్‌లో, నేను హీరోగా చెయ్యడానికి ఏడాది ముందు మా పెళ్ళయింది. నా జర్నీ అంతా ఆమెకు తెలుసు. ఆమె కూడా ఉద్యోగం చేసేది. ఆమెని ఒత్తిడిలో ఉంచడం నాకు నచ్చక... నాకంటే ముందే ఉద్యోగం మాన్పించేశాను. తనకి ఇష్టమైన ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో చేరింది. నా గత నాలుగైదు సినిమాలకి ఆమే కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ చేసింది.

ఆర్కే: మీరు పూరీ జగన్నాథ్‌ని ఎలా పట్టుకున్నారు? ఆ అవకాశం ఎలా వచ్చింది?

సత్యదేవ్‌: నేను పట్టుకోలేదు. పూరీగారు మొదటిసారిగా ‘జ్యోతిలక్ష్మి’ సినిమాకి ఆడిషన్స్‌ పెట్టారు. దాదాపు అయిదొందల మంది వచ్చారు. ‘‘పూరీగారు హీరో కోసం చూడక్కర్లేదు. విలన్‌ కోసం చూస్తూ ఉండి ఉంటార’’ని ఆలోచించి... నెగెటివ్‌ రోల్‌కి ఆడిషన్‌ ఇచ్చాను. అది ఆయన చూశారు. మళ్ళీ పిలిచి, విలన్‌ కాదు, నార్మల్‌గా చెయ్యమన్నారు. అప్పుడు కూడా సెటిల్‌గా ఉండే విలన్‌ పాత్రే అనుకున్నాను. పదిరోజుల తరువాత పిలిచి, బరువు తగ్గాలన్నారు. రెండు నెలల్లో పదహారు కిలోలు తగ్గాను. మళ్ళీ పూరీగారిని కలిస్తే గుర్తుపట్టలేకపోయారు. అప్పుడు చెప్పారు... ‘‘మన సినిమాలో నువ్వే హీరో’’ అని. మరో మూడు కేజీలు పెరగమన్నారు. ఆ తరువాత షూటింగ్‌ మొదలైంది.

ఆర్కే: కలలో జరిగినట్టు జరిగిపోయింది...

సత్యదేవ్‌: నేను దీపికకు ఫోన్‌ చేసి చెప్పాను. తను ఎగ్జైట్‌ అవుతోంది, నేను మాత్రం షాక్‌లో ఉన్నాను. ఆ సినిమాతో నా కెరీర్‌ పూర్తిగా మారిపోయింది. ఆయన ఇచ్చిన అవకాశాన్ని ఎప్పటికీ మరచిపోలేను.

ఆర్కే: చిరంజీవి చాలామందితో సినిమాలు చేశారు కానీ, మిమ్మల్ని ప్రమోట్‌ చేసినట్టు మరెవర్నీ ప్రమోట్‌ చెయ్యలేదు. ఆయనని ఎలా ఇంప్రెస్‌ చేశారు?

సత్యదేవ్‌: ‘గాడ్‌ ఫాదర్‌’ సమయంలో... ఈ క్యారెక్టర్‌ నేనే చెయ్యాలని అన్నయ్య బలంగా అనుకున్నారు. కానీ దాదాపు ప్రతి ఒక్కరూ వద్దన్నారు. మీ స్టేచర్‌కి సత్యదేవ్‌ సరిపోడన్నారు. కానీ మొదటి నుంచీ ఆయన చాలా చాలా పర్టిక్యులర్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ‘‘నేనొక నటుణ్ణి, నాకు తెలుసు. గ్యారెంటీగా వాడు చేస్తాడు. నన్ను నమ్మండి’’ అని చెప్పారు. కానీ ఆయన తప్ప మిగిలినవాళ్ళెవరూ ఇష్టపడలేదు. దాంతో ‘నేను నమ్మింది కరెక్టా, కాదా?’ అనే స్థితికి అన్నయ్య వెళిపోయారు. దాంతో నన్ను నేను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పాత్ర బాగా పండడంతో... తను నమ్మింది నిజమైందని ఆయన హ్యాపీగా ఫీలయ్యారని నేననుకుంటున్నా. నాక్కూడా... అన్నయ్యతో చేస్తున్నాననే టెన్షన్‌ కన్నా... ఆయన పేరు నిలబెట్టాలనే పట్టుదల చాలా ఎక్కువగా ఉండేది. ఫస్ట్‌కాపీ చూసిన తరువాత ఆయన చాలా సంతోషించారు. ప్రమోట్‌ చెయ్యడానికి కారణాల్లో అదొకటి కావచ్చు.

ఆర్కే: ఈ పదేళ్ళలో ఎన్ని సినిమాలు చేసుంటారు?

సత్యదేవ్‌: ఓటీటీతో సహా... అన్నీ కలిపి ముప్ఫై వరకూ చేశాను.

ఆర్కే: ఇప్పుడు దాదాపుగా సెటిల్‌ అయినట్టేనా?

సత్యదేవ్‌: అయినట్టే అనిపిస్తోంది. అయితే... బహుశా థియేట్రికల్‌ హిట్‌ రావాలి. దాని కోసం...

ఆర్కే: ఒక మంచి ఆర్టిస్ట్‌ అనేది ఎస్టాబ్లిష్‌ అయింది. అదే సమయంలో... విజయ్‌ దేవరకొండకి ‘అర్జున్‌రెడ్డి’ వచ్చినట్టు... ఒక పెద్ద బ్రేక్‌ ఇంకా రాలేదు. దానికోసం వెయిటింగా...

సత్యదేవ్‌: అవును. ఆ బ్లాస్ట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నా. ఇస్తానన్న కాన్ఫిడెన్స్‌ వెయ్యి శాతం ఉంది. ఎప్పుడనేది తెలీదు. అదొక్కటీ ఇంకా అందకుండా ఉంది. అది వచ్చేస్తే... ఒక తృప్తి. కాన్వాస్‌ పెద్దదవుతుంది. కొంచెం బడ్జెట్‌ పెరిగితే ఇంకా మంచి సినిమాలు చెయ్యొచ్చనీ, పెద్ద కథలు చెయ్యొచ్చనీ ఒక ఆశ.

ఆర్కే: మీరు హీరో వేషాలు వేసిన తరువాత కూడా బిగుసుకు కూర్చోకుండా... మంచి పాత్ర వస్తే వేసేస్తున్నారు. మీ నిర్ణయం చెడ్డదా, మంచిదా అనేది ఎప్పుడైనా ఆలోచించుకున్నారా?

సత్యదేవ్‌: ‘వీడు ఏదైనా చెయ్యగలడు’ అనే పేరు తెచ్చుకోవాలని నాకు మొదటి నుంచీ ఉండేది. ఆడియన్స్‌ కూడా ఏ సినిమాని ఆ సినిమాగానే చూస్తారు. ఇమేజ్‌ గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తున్నామేమో తప్ప... ‘గాడ్‌ఫాదర్‌’లో జయదేవ్‌గా నన్ను ఎంత ఇష్టపడ్డారో... ‘గుర్తుందా శీతాకాలం’లో దేవ్‌ పాత్ర కూడా వాళ్ళని అంతే ఇంప్రెస్‌ చేస్తుందనే నమ్మకం ఉంది. ఇమేజ్‌ వల్ల... తొందరగా బోరైపోతాను. అలా అవకూడదు, ఆ ఫైర్‌ రన్‌ అవుతూ ఉండాలంటే... నేను డిఫరెంట్‌గా ట్రై చేస్తూనే ఉండాలి.

ఆర్కే: మీకు హిందీలో అవకాశాలు ఎలా వచ్చాయ్‌?

సత్యదేవ్‌: ‘రామసేతు’లో చేశాను. ఇక్కడ ‘గాడ్‌ఫాదర్‌’లో ఎంత పేరొచ్చిందో, ‘రామసేతు’లో చేసిన ఏపీ (ఆంజనేయ పుష్పకుమార) అనే పాత్రకి నార్త్‌లో అంత పేరొచ్చింది. అందులో అక్షయ్‌కుమార్‌ గారితో చేశాను. అలాంటి పాత్ర మనం ప్రయత్నించినా రాదు. దానంతట అదే వచ్చి మన ఒళ్ళో పడాలి. అది అదృష్టం.

ఆర్కే: అఫ్ఘనిస్తాన్‌లో ఏదో చేదు అనుభవం ఎదురైనట్లుంది?

సత్యదేవ్‌: అది చాలా పెద్ద స్టోరీ. అప్ఘనిస్తాన్‌లో జెనిఫర్‌ అని ఒక మహిళా డైరెక్టర్‌ ఉన్నారు. ఆవిడ ఓ హిందీ ఫిలిం స్టార్ట్‌ చేశారు. అప్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో షూటింగ్‌. నిర్మాతలు కూడా కాబూల్‌ వాళ్ళే. నిజంగానే అప్ఘనిస్తాన్‌ ఎపిసోడ్‌ మీద ఒక సినిమా తియ్యొచ్చు. సినిమాటిక్‌గా చెప్పాలంటే... ఇమ్మిగ్రేషన్‌ అవుతున్నప్పుడు... పాస్‌ పోర్టు ఇచ్చాను. అక్కడ ఒకావిడ చెక్‌ చేస్తూ... ‘‘వాట్‌ ఈజ్‌ ద పర్పస్‌ ఆఫ్‌ ది విజిట్‌’ అని అడిగింది. నేనేమో ‘‘షూటింగ్‌’’ అన్నాను. అలా నా ముఖం వంక చూసింది. ‘‘ఓ... సారీ, ఆ షూటింగ్‌ కాదు.. ఫిలిం షూటింగ్‌’’ అన్నాను. ‘‘ప్రపంచంలో ఇన్ని దేశాలు పెట్టుకుని.. అఫ్ఘనిస్తాన్‌ వచ్చావా.. ఆల్‌ ద బెస్ట్‌’’ అంది.

ఆర్కే: మీ సినిమాలలో ఎక్కడా డ్యూయట్స్‌ కనిపించవు. కాన్షస్‌ గానా? డిజైన్‌ చేసే క్యారెక్టర్ల వల్లా? ఇంతకీ మీకు డ్యాన్స్‌ వచ్చా?

సత్యదేవ్‌: వచ్చు. కాలేజీలో నేను మిస్టర్‌ కాలేజీ... మిస్టర్‌ సిఎ్‌ససి. కానీ డ్యాన్స్‌ బాగా చేసేవాళ్ళు ఉన్నప్పుడు... మనం వాళ్ళకన్నా బాగా చెయ్యాలి. లేదంటే చెయ్యకూడదని అనుకున్నాను. అలాగే నేను వేస్తున్న పాత్రలకి అది కరెక్ట్‌ కాదు. సరైన సందర్భం వస్తేనే డ్యాన్స్‌ చెయ్యాలని చాలాకాలం అనుకున్నాను. అయితే రాబోయే ‘ఫుల్‌ బాటిల్‌’ సినిమాలో చేశాను. అది క్రైమ్‌ కామెడీ. నాది ‘మెర్క్యురీ సూరి’ అనే పాదరసంలాంటి ఆటోడ్రైవర్‌ పాత్ర. వాడి ఆటో వెనక ‘బడికెళితే 123... నా ఆటో ఎక్కితే 143’ అని క్యాప్షన్‌ ఉంటుంది.

ఆర్కే: మీరు పాటలు కూడా పాడతారట కదా?

సత్యదేవ్‌:‘ఫుల్‌బాటిల్‌’లో పాడాను. ఇక నేను ఇష్టంగా పాడుకొనే పాట ‘యమునాతటిలో’ (దళపతి)...

ఆర్కే: మీకొచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌ ఏమిటి? ఇప్పటివరకూ ఎవరి దగ్గర నుంచి వచ్చాయి?

సత్యదేవ్‌: ప్రకాష్‌ రాజ్‌ సార్‌ ‘జ్యోతిలక్ష్మి’ సినిమా చూసిన తరువాత, బాగా నచ్చి నాకు ‘మన ఊరి రామాయణం’ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. అలాగే అన్నయ్య (చిరంజీవి) బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌ ఇచ్చారు. ఈ మధ్యే ‘గాడ్‌ఫాదర్‌’ చూసి నాజర్‌ గారు ఫోన్‌ చేశారు. అలాగే అక్షయ్‌ కుమార్‌ గారు కూడా. దాదాపు అందరి నుంచీ అభినందనలు వచ్చాయి. ఇళయరాజా నుంచి కూడా కాంప్లిమెంట్స్‌ వచ్చాయి. ‘మన ఊరి రామాయణం’’ సినిమా రీరికార్డింగ్‌ చేస్తున్నప్పుడు... ‘‘వీడెవడు చాలా బాగా చేస్తున్నాడ’’ని ఇళయరాజా పదకొండుసార్లు అడిగారట. ప్రకాష్‌ రాజ్‌ అది లెక్కెట్టి మరీ నాకు చెప్పారు. అది నాకు మరచిపోలేని రోజు.

ఆర్కే: సాఫ్ట్‌వేర్‌ అంటే బ్రహ్మాండమైన ఉద్యోగం అని ఇంట్లో వాళ్ళు అంటారు కదా. అవన్నీ వదిలేసుకొని ఎందుకు అని ఇంట్లో డిస్కషన్‌ రాలేదా?

సత్యదేవ్‌: సొంత నిర్ణయాలు తీసుకొనే ఫ్రీడమ్‌ ఉంది ఇంట్లో నాకు. నేను సరైన దారిలోనే ఉంటాననే నమ్మకం వాళ్ళకు ఉంది. అమెరికాలో పని చేసే అవకాశం వచ్చినా నేను వెళ్ళలేదు. వెళ్ళాల్సిందేననే ఒత్తిడి రావడంతో... రెండు పడవల ప్రయాణం సాధ్యం కాదని... ఉద్యోగం వదిలేశా. ఒక పడవ మీదికి వచ్చేశా.

ఆర్కే: అఫ్ఘనిస్తాన్‌లో ఏదో చేదు అనుభవం ఎదురైనట్లుంది?

సత్యదేవ్‌: అప్ఘనిస్తాన్‌లో జెనిఫర్‌ అని ఒక మహిళా డైరెక్టర్‌ ఉన్నారు. ఆవిడ ఓ హిందీ ఫిలిం స్టార్ట్‌ చేశారు. అప్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో షూటింగ్‌. ఇమ్మిగ్రేషన్‌ అవుతున్నప్పుడు... పాస్‌ పోర్టు ఇచ్చాను. అక్కడ ఒకావిడ చెక్‌ చేస్తూ... ‘‘వాట్‌ ఈజ్‌ ద పర్పస్‌ ఆఫ్‌ ది విజిట్‌’ అని అడిగింది. నేనేమో ‘‘షూటింగ్‌’’ అన్నాను. అలా నా ముఖం వంక చూసింది. ‘‘ఓ... సారీ, ఆ షూటింగ్‌ కాదు.. ఫిలిం షూటింగ్‌’’ అన్నాను. ‘‘ప్రపంచంలో ఇన్ని దేశాలు పెట్టుకుని.. అఫ్ఘనిస్తాన్‌ వచ్చావా.. ఆల్‌ ద బెస్ట్‌’’ అంది.

ఆర్కే: రాబోయే రోజుల్లో నటుడిగా మీ విశ్వరూపం మాకు చూపించాలని కోరుకుంటూ... థాంక్యూ వెరీమచ్‌.

సత్యదేవ్‌: థాంక్యూ సార్‌.

Updated Date - 2022-12-12T20:11:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising