ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోటీ లేకపోతే బోర్‌ కొడుతుంది...

ABN, First Publish Date - 2022-10-24T01:08:14+05:30

తగ్గేదిలే’ అనే తత్త్వం ప్రగతిది. హీరోయిన్‌గా కెరీర్‌ మెదలుపెట్టి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మగౌరవానికి భంగం కలిగితే ‘తగ్గేదిలే’ అనే తత్త్వం ప్రగతిది. హీరోయిన్‌గా కెరీర్‌ మెదలుపెట్టి... తలవంచలేక కొన్నాళ్ళకే సినిమాలు మానేసి... 24 ఏళ్ళకే తల్లి పాత్రలో రీ ఎంట్రీ ఇచ్చి... క్యారెక్టర్‌ యాక్టర్‌గా స్థిరపడ్డారామె. ‘‘నాకు నచ్చి, నన్ను ఆనందపెట్టే పని నేను చేస్తాను’’ అంటున్న ప్రగతి... ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో పంచుకున్న విశేషాలివి.

ఆర్కే: వెల్‌కమ్‌ టు ఓపెన్‌ హార్ట్‌! నమస్తే ప్రగతి గారూ!

ప్రగతి: నమస్తే!

ఆర్కే: సినిమాల్లో చలాకీగా కనిపిస్తారు. కానీ నిజ జీవితంలో మీరు గంభీరమైన మనిషి అంటారు. నిజమేనా?

ప్రగతి:: మనుషులను బట్టి కొంతమందికి అలా కనిపిస్తాను. కొంతమంది నన్ను చూసి భయపడతారు. ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటే, భయపడతారు. మాట్లాడిన తర్వాత కామ్‌ అయిపోతారు.

ఆర్కే: అయితే అలా నెట్టుకొస్తున్నారన్నమాట

ప్రగతి:పొట్ట తిప్పలు పడుతున్నా! ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ. చాలా పెద్ద ప్రపంచం. దీన్లో సర్వైవ్‌ అవ్వాలి కదా!

ఆర్కే: బాగా ఫైట్‌ చేసి ఈ స్టేజ్‌కు వచ్చారు. అంతేనా?

ప్రగతి:యస్‌. 200 పర్సంట్‌.

ఆర్కే: ఆ ఫైటింగ్‌ ఎవర్నుంచి నేర్చుకున్నారు?

ప్రగతి: అనుభవాలు, జీవితమే నేర్పించాయి.

ఆర్కే: ఆస్థిపాస్తులు ఉన్నాయిగా!

ప్రగతి: లేదు. మాది మిడిల్‌ క్లాస్‌ కుటుంబమే!

ఆర్కే: మీ మదర్‌ జాబ్‌ చేసేవారా?

ప్రగతి:లేదండీ. డబ్బులు వడ్డీకి ఇచ్చేవారు.

ఆర్కే: అయితే చిన్నప్పటి నుంచే కష్టసుఖాలు తెలిసొచ్చాయన్నమాట!

ప్రగతి:అన్నీ నేనే చూసుకొనేదాన్ని. డబ్బు ఇబ్బంది ఉన్న విషయం మొదట నాకే తెలుస్తుంది. బంగారం కుదవ పెట్టడానికి కూడా నేను, అమ్మా వెళ్లేవాళ్లం. హైదరాబాద్‌లో అశోక్‌నగర్‌ నుంచి సైకిల్‌ మీద చిక్కడపల్లిలో ఉన్న కుదవ షాపులో.. వడ్డీ డబ్బులిచ్చి వచ్చేదాన్ని. వేల్యూ ఆఫ్‌ మనీ, వేల్యూ ఆఫ్‌ పీపుల్‌, వేల్యూ ఆఫ్‌ ఎవిరిథింగ్‌ నాకు తెలుసు.

ఆర్కే: మీ చదువు పూర్తికాకముందే సినిమాల్లో ఆఫర్‌ వచ్చిందా?

ప్రగతి: డిగ్రీ ఫస్టియర్‌ చదివేటప్పుడు వచ్చింది. నేను బిఎ పొలిటికల్‌ సైన్స్‌ చేశాను. నిజానికి నేను చాలా బ్యాడ్‌ స్టూడెంట్‌ని. చదువుకూ, నాకూ అస్సలు సంబంధమే లేదు. ఎప్పుడూ పని్‌షమెంట్స్‌... హోమ్‌వర్క్‌ చేయను. అవమానంగా భావించే స్థాయిని దాటి, మొద్దుబారిపోయే స్టేజ్‌కు చేరుకున్నాను. స్నేహితుల సహాయంతో ఎలాగోలా 12వ తరగతి పాసైపోయాను. ‘‘చదవకుండా పాసైపోయేది ఏది?’’ అని ఫ్రెండ్స్‌ని అడిగితే, ‘‘పొలిటికల్‌ సైన్స్‌’’ అని చెప్పి నన్ను మోసం చేశారు. ఇంతంత పెద్ద పుస్తకాలు. నేను చెన్నైలో ‘జస్టిస్‌ బషీర్‌ అహ్మద్‌ సయీద్‌ ఉమెన్స్‌ కాలేజీ’లో చదివాను. నా ఇంగ్లీషు కూడా దారుణంగా ఉండేది. పాఠాలు అర్థమయ్యేవి కావు. అలా నేను డిగ్రీలో పొలిటికల్‌ సైన్స్‌ తీసుకున్నాను. నాకసలు పాలిటిక్స్‌ అంటే ఏంటో కూడా తెలియదు.

ఆర్కే: కానీ చాలామంది సినీ తారలు రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నారుగా!

ప్రగతి:నాకంత కెపాసిటీ లేదండీ. నేను రాజకీయాల్లో ఇమడలేను. నాకు సినిమానే సరైన రంగమని తెలుసు. అలా భాగ్యరాజా గారి సినిమాలో నటించాను. తెలుగులో ‘గౌరమ్మా! నీ మొగుడెవరమ్మా’గా డబ్‌ చేశారు. ‘మిస్టర్‌ బేచారా’ అనే హిందీ వెర్షన్‌లో శ్రీదేవి గారు, అనిల్‌ కపూర్‌, నాగార్జున గారు నటించారు.

ఆర్కే: హీరోయిన్‌గా ఎన్ని సినిమాలు చేశారు?

ప్రగతి: చాలా తక్కువ సినిమాలు చేశాను. నేనప్పుడు సినిమాలకు సిద్ధంగా లేను. చిన్నదాన్ని. వాళ్లు మాట్లాడే విధానం నాకు అసౌకర్యంగా అనిపించేది. ‘నేను నీకు మర్యాద ఇస్తున్నప్పుడు, నువ్వు నాకు మర్యాద ఇవ్వాలి’ అనుకునే టైప్‌ నేను. దాంతో నా ఇగో హర్ట్‌ అయ్యేది.

ఆర్కే: అలా హీరోయిన్‌ పాత్రలు వదిలేసుకున్నారన్నమాట.

ప్రగతి: ఒక సినిమాలో నటించాను. ఆ సినిమా ప్రొడ్యూసర్‌, హీరో ఒక్కరే! ఆయన అంత ప్రముఖ వ్యక్తి కూడా కాదు. ఆ సినిమా చేసేటప్పుడు, ఒక వాన పాట కాస్ట్యూమ్‌ గురించి వాదన జరిగింది. ఆయన మాట్లాడిన పద్ధతి నాకు నచ్చలేదు. అప్పుడు నాకు 19 ఏళ్లు. నేను కూడా సహనం కోల్పోయి, మాటకు మాట సమాధానం చెప్పి, షూటింగ్‌ నుంచి వెళ్లిపోయాను. తరువాత అందరూ నాకు కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి వచ్చారు. ‘‘మీ మూలంగా షూటింగ్‌ క్యాన్సిల్‌ అయింది. మీ మూలంగా ఈ రోజు ఇంత ఖర్చయింది. ఆ ఖర్చులు మీరే పే చేయాలి’’ అని ప్రొడ్యూసర్‌ చెప్పారు. అప్పుడు నేను ‘‘అలా అని అగ్రిమెంట్‌లో ఉంటే చూపించండి’’ అన్నాను. ‘‘కాస్ట్యూమ్‌ నాకు సౌకర్యవంతంగా అనిపిస్తేనే నటిస్తాను. లేదంటే నటించను. పైగా రజనీకాంత్‌, కమలహాసన్‌ లాంటి పెద్ద నటులైతే చేస్తాను. ఇతనితో మాత్రం చేయను’’ అని చెప్పేశాను. ‘‘నాకు రావాల్సిన డబ్బు ఉంది. అది క్లియర్‌ చేసేస్తే పూర్తి చేసేసి వెళ్లిపోతాను’’ అని చెప్పి, ఆ చివరి మూడు రోజులు షూట్‌లో పాల్గొన్నాను. ఆ సమయంలో వాళ్ల చూపులు నన్ను బాధించాయి. అసలు సినిమాలే వద్దని డిసైడ్‌ అయిపోయాను.

ఆర్కే: ఒక చిన్న సినిమా అవకాశం కోసం నానా అగచాట్లు పడే పరిస్థితి. అలాంటిది మీరు హీరోయిన్‌గా ఎస్టాబ్లిష్‌ అయిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్టు కాదు కదా?

ప్రగతి:అప్పట్లో నాకు వేల్యూ తెలియలేదు. అత్త మీద కోపం దుత్త మీద లాగా, అతని మీద కోపంతో ఇండస్ట్రీకే దూరమయ్యాను. నిజానికి జీవితంలో నేను అలాంటి కొన్ని ఎక్స్‌పెన్సివ్‌ మిస్టేక్స్‌ (ఖరీదైన పొరపాట్లు) చేశాను. ఇది మొదటిదైతే, వెంటనే పెళ్లి చేసుకుని రెండో పెద్ద తప్పు చేశాను. జీవితంలో స్థిరపడాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాను. అప్పుడు నా వయసు ఇరవై ఏళ్లు.

ఆర్కే: ప్రేమించి పెళ్లి చేసుకున్నారా?

ప్రగతి:ఆయన నాకు ప్రపోజ్‌ చేశారు. పెళ్లితోనే ప్రపోజ్‌ చేయడంతో పెళ్లి చేసేసుకున్నాను. బాబును కన్నాను.. దీన్లో అమ్మ ప్రమేయం లేదు. ఆ పెళ్లి ఆవిడకు ఇష్టం లేదు. బాబు పుట్టిన తర్వాత నేను ఏం మిస్సయ్యానో, ఎంత పెద్ద తప్పు చేశానో రియలైజ్‌ అయ్యాను. నేను చేసుకున్న వ్యక్తి ఆర్థికంగా దృఢంగా లేరు. అప్పుడు నాకు నిజం తెలిసొచ్చింది. అప్పుడు నాకు హీరోయిన్‌ అవకాశాలు రావు. కాబట్టి టెలివిజన్‌ సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టాను. తమిళ్‌లో ‘మాల్గుడి డేస్‌’... ఆ 13 ఎపిసోడ్లతో తిరిగి నటించడం మొదలుపెట్టాను. నేను మొదటిసారి తల్లి పాత్రలు చేసినప్పుడు, నా వయసు 24. అందరూ నా ఈడువాళ్లే, అయినా వాళ్లకు నేను తల్లిగా నటించవలసి రావడంతో మొదటి రోజు కొద్దిగా ఫీలయ్యాను. చంద్రమోహన్‌ అంకుల్‌తో కలిసి ఆయనకు భార్యగా నటించాను. ఆ రోజు జడతో సెట్లోకి రావడంతో... ముడి వేసుకోమని చెప్పారు. మేకప్‌ రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేశాను. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ నేను బాధ పడలేదు.

ఆర్కే: పదేళ్ల క్రితం నాటి హీరోయిన్లు ఇప్పుడు తల్లి పాత్రలు పోషిస్తున్నారు. వాళ్లు మీకు పోటీ కాదా?

ప్రగతి:ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌ మెయింటెయిన్‌ చేస్తున్నారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెడుతున్నారు. అలాంటి నటులకు తల్లిగా నటించేటప్పుడు మనం కూడా అంతే బాగా కనిపించాలి. కాబట్టి పాత హీరోయిన్లు ఇప్పుడు తల్లులుగా నటిస్తున్నా అదనపు కాంప్లిమెంట్‌ అందుతుంది. ఇక పోటీ లేకపోతే బోర్‌ కొడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా తల్లి పాత్రల్లో రాణించాలంటే నన్ను నేను అప్‌డేట్‌ చేసుకుంటూనే ఉండాలి.

ఆర్కే: అందుకేనా జిమ్‌ వర్కవుట్స్‌ చేస్తున్నారు?

ప్రగతి: యాక్టివ్‌గా ఉండడం కోసం వర్కవుట్స్‌ చేస్తాను. నాకు స్ట్రాంగ్‌గా ఉండడం ఇష్టం. డైట్‌తో 80ు, వర్కవుట్స్‌తో 30ు ఫిట్‌నెస్‌ సాధించవచ్చు. కానీ నేను ఇన్నర్‌ స్ట్రెంగ్త్‌ మీద ఫోకస్‌ చేస్తున్నాను.

ఆర్కే: ఫిట్‌నెస్‌ మీద ఇంట్రస్ట్‌ ఉన్న మీరు ఫుడీగా ఎందుకున్నారు?

ప్రగతి:నేనిప్పటికీ ఫుడీనే! చాలా బాగా తింటాను. అన్నీ చేయాలి. తిండి తినాలి. వ్యాయామం చేయాలి.

ఆర్కే: ఆ టూటూ ఎందుకు వేయించుకున్నారు?

ప్రగతి:చిన్నప్పుడు ఇచ్చిన వ్యాక్సినేషన్‌ సెప్టిక్‌ అయింది. దాంతో పెద్ద కాలిన మచ్చలాగా ఏర్పడింది. అందుకే టాటూ వేయించేశాను. ఇప్పుడీ టాటూనే నాకొక ఐడెంటిటీగా మారిపోయింది.

ఆర్కే: ఇండస్ట్రీలో మీరు ‘ఫైర్‌బ్రాండ్‌’ అంటారు. నిజమేనా?

ప్రగతి:ఏమో తెలియదు.

ఆర్కే: చాలా మందికి ఫుల్‌ డోస్‌, క్లాస్‌ ఇచ్చారట కదా?

ప్రగతి:నేను విషయాన్ని నానబెట్టను. రెండు మూడు రోజుల తర్వాత రియాక్షన్‌ ఉండదు. ఇన్‌స్టంట్‌గా రియాక్ట్‌ అవుతాను. లేదంటే ఆ రోజు నిద్ర పట్టదు. నా ఈగో, సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ హర్ట్‌ అవకూడదు.

ఆర్కే: మీ మదర్‌... సింగిల్‌ మదర్‌గా సాగించిన జర్నీ మీరు చూశారు. అదే పరిస్థితిని మీరే కొని తెచ్చుకున్నారా?

ప్రగతి: అమ్మను చూసి, సింగిల్‌ మదర్‌గా ఉండకూడదనే నేను ట్రై చేశాను. ఒక పాయింట్‌ తర్వాత మనం మన పిల్లలకు ఉదాహరణలుగా మారే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు రాంగ్‌ ఎగ్జాంపుల్‌ను ఇవ్వకూడదు. ఆ పాయింట్‌ దగ్గరే నేను విడాకులు తీసుకున్నాను.

ఆర్కే: పిల్లలు ఏం చదువుతున్నారు?

ప్రగతి:బాబు హోటల్‌ మేనేజిమెంట్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశాడు. ప్రస్తుతం ఇంటర్న్‌గా చేస్తున్నాడు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోసం పాప ఈ మధ్యే అమెరికా వెళ్లింది. తను అక్కడే పుట్టింది. యుఎస్‌ సిటిజన్‌. ఆరో తరగతి చదివేటప్పుడే యుఎ్‌సకి వెళ్లి చదువుకొని, అక్కడే సెటిలవుతానని చెప్పేసింది.

ఆర్కే: ఏదైనా బాధ కలిగినప్పుడు ఇండస్ట్రీలో ఎవరితో పంచుకుంటారు?

ప్రగతి:ఇండస్ట్రీలో నాకు ఎవరూ లేరండీ. నాకు లత అనే క్లోజ్‌ ఫ్రెండ్‌ ఉంది. ఆవిడే నా మేజర్‌ సపోర్ట్‌. నా ప్రతి కష్టంలో, దుఃఖంలో, అన్ని సందర్భాల్లో ఆవిడ నా చేతిని వదల్లేదు. తను ఇక్కడే హైదరాబాద్‌లో ఉంటోంది.

ఆర్కే: మీరు ప్రకాశం జిల్లాలో పుట్టకపోయినా, ఇప్పటికీ మీరు ఆ యాసలోనే మాట్లాడతారట కదా?

ప్రగతి:అమ్మమ్మ ఉన్నంత కాలం, సమ్మర్‌ వెకేషన్‌కి అక్కడకు వెళ్లేదాన్ని. దాంతో ఆ యాస నాకు వింతగా అనిపించి ఎక్కువగా వినేదాన్ని. పైగా నాకు ఇమిటేట్‌ చేయడం చాలా ఇష్టం. నాతో ఎవరైనా తెలంగాణా మాండలికంలో మాట్లాడితే, ఆటోమాటిక్‌గా నేనూ అలాగే మాట్లాడతాను. అలా ఎదుటి వాళ్లు మాట్లాడే భాష యాసతో మాట్లాడేస్తూ ఉంటాను. ‘ఎఫ్‌2’, ‘ఎఫ్‌3’ సినిమాల్లో కూడా అనిల్‌ గారు డైలాగ్‌ చెప్పిన వెంటనే నేనలా చెప్పేసేదాన్ని. క్యారెక్టర్‌ ఆర్టిస్టులకు లాంగ్వేజ్‌ చాలా పెద్ద అడ్వాంటేజ్‌.

ఆర్కే: మీరు అప్పుడప్పుడూ క్యాట్‌ వాక్‌ చేస్తూ ఉంటారు. ఎందుకు?

ప్రగతి: క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అనేది నా ప్రొఫెషన్‌. కానీ నాకంటూ ప్రగతి అనే పర్సనల్‌ క్యారెక్టర్‌ ఉంది. తనకంటూ ఒక లైఫ్‌స్టైల్‌ ఉంటుంది. నాకు నచ్చి, నన్ను ఆనందపెట్టే పని నేను చేస్తాను.

ఆర్కే: అలాంటివాటికి ఎలాంటి కామెంట్లు వస్తూ ఉంటాయి?

ప్రగతి:: 90% పాజిటివ్‌ కామెంట్లే వస్తూ ఉంటాయి. 10ు నెగటివ్స్‌ కూడా ఉంటూ ఉంటాయి. వాటిని నేను పట్టించుకోను.

ఆర్కే: పూర్తి ప్రయాణంలో ఎవరితోనూ పంచుకోని చేదు అనుభవాలున్నాయా?

ప్రగతి:నేను తెరచిన పుస్తకం లాంటిదాన్ని. బాబు పుట్టిన మొదట్లో దూరదర్శన్‌కు ఒక స్పెషల్‌ ప్రోగ్రాం చేశాను. ఆ సమయంలో బాబును వెంటబెట్టుకుని వెళ్లాను. మదురైలో జరిగే ఆ షూటింగ్‌కు ట్రైన్‌లో వెళ్లాను. ఆటో ఖర్చులు పోగా నా దగ్గర నాలుగొందలు మిగిలాయి. బాబుకు బిస్కెట్‌ లాంటివి ఏవైనా ఇవ్వమని అసిస్టెంట్‌ ద్వారా మేనేజర్‌ను అడిగించాను. ‘‘తెప్పిస్తారట’’ అని చెప్పాడు. కానీ సాయంత్రం వరకూ బిస్కెట్లు రాలేదు. దాంతో మళ్లీ అడిగించాను. అప్పుడా మేనేజర్‌ ‘‘మీ ఇంట్లో తిండి లేదా? పొద్దున వచ్చినప్పటి నుంచి బిస్కెట్ల కోసం అడుగుతున్నారు’’ అంటూ కసురుకున్నాడు. అది నేను తిరిగి అనలేని పరిస్థితి. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి నాకేది కావాలన్నా స్టాఫ్‌కి డబ్బులిచ్చి తెప్పించుకోవడం మొదలుపెట్టాను.

ఆర్కే: వారసుడిగా మీ అబ్బాయిని సినిమాల్లోకి దించుతారా?

ప్రగతి:ఆ ఆసక్తి ఇప్పటికైతే లేదండీ.

ఆర్కే: మీకింకా తీరని కోరికలేమైనా ఉన్నాయా?

ప్రగతి:ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి. అంతే! నా లక్ష్యం ఆనందమే! పది మందికి ఒక మంచి ఎగ్జాంపుల్‌గా ఉండాలి.

ఆర్కే: మీ కెరీర్‌ ఇలాగే కొనసాగుతూ ఉండాలనీ, మంచి మదర్‌గా, మంచి ఆర్టిస్టుగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ... థ్యాంక్యూ వెరీమచ్‌!

ప్రగతి: థ్యాంక్యూ సోమచ్‌

మేమున్న అపార్ట్‌మెంట్‌లోని పై ఫ్లోర్‌లో సి.ఆర్‌.సరస్వతి అని ఒక నటి ఉండేవారు. ఆ ఫ్లాట్‌ను అద్దెకు ఇచ్చి, అద్దె కలెక్ట్‌ చేసుకోవడం కోసం వస్తూ ఉండేవారు. అప్పుడే ‘రోజా’ రిలీజైంది. అక్కడున్న అమ్మాయిలందరం కలిసి కూర్చుని మాట్లాడుకునేటప్పుడు, ఆవిడ వస్తూ, పోతూ నన్ను చూసి ‘మధుబాల, మధుబాల’ అనేవారు. నేను అప్పటికే మైసూర్‌ సిల్క్‌ ప్యాలెస్‌ యాడ్‌ చేసి ఉన్నాను. ఆ పిక్చర్స్‌ను తీసుకువెళ్లారు. తర్వాత రెండు రోజులకే నాకు సినిమా అవకాశం వచ్చింది. నాకు రెమ్యూనరేషన్‌ ఎంత ఇచ్చారో కూడా తెలియదు. అమ్మే చూసుకుంది.

‘‘నేను అందుకు సరైన దాన్ని కాను’’ అని చెప్పినా, ‘‘నీలాంటి వాళ్లు కావాలి’’ అని నన్ను ‘మా’ అసోసియేషన్‌ వ్యవహారాల్లోకి దించారు. ఇప్పుడు దానివైపు కూడా వెళ్ళడం లేదు. ఇట్స్‌ నాట్‌ మై కప్‌ ఆఫ్‌ టీ. కాబట్టే దూరంగా ఉంటున్నాను.

నాన్నగారు చిన్నప్పుడే పోయారు. నేనూ, అమ్మ కలిసి ఉండేవాళ్లం. అన్నా చెల్లెళ్ళు లేరు. బంధువులతో కనెక్షన్లు లేవు. అలా అమ్మ, నేను కలిసి బతికాం. మా ఇద్దరికీ వయసు తేడా పదహారేళ్లే! మగపిల్లాడిలా పెరిగాను. ఐ వజ్‌ ది మ్యాన్‌ ఆఫ్‌ ది హౌస్‌. అమ్మది ఒంగోలు పక్కనున్న ఉలవపాడు. కానీ నేను పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే! పదో తరగతిలో చెన్నైకి షిఫ్ట్‌ అయ్యాం. మా ఊర్లో ఆస్థిపరమైన లీగల్‌ ఇష్యూస్‌ జరుగుతున్నాయి. మాకు కొందరి నుంచి ముప్పు ఉంది. చెన్నైలో చుట్టాలున్నారు. కాబట్టి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడకు షిష్ట్‌ అయిపోయాం. అలా అక్కడ డిగ్రీలో ఉన్నప్పుడు నాకు సినిమా అవకాశం వచ్చింది. సింగిల్‌ పేరెంట్‌గా అమ్మే నన్ను పెంచింది. కాబట్టి ఇబ్బందుల గురించి నాకు తెలుసు.

Updated Date - 2022-10-24T08:21:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising