NRI: ‘విదేశీయులకు విజ్ఞప్తి.. మీరెక్కడివారైనా సరే..ఇక్కడే సెటిల్ అవ్వండి..‘
ABN, First Publish Date - 2022-10-29T23:28:56+05:30
మీరెక్కడి వారైనా సరే ఇక్కడే సెటిల్ అవ్వండి అంటూ విదేశీయులకు ఇరోవిల్ టౌన్ విజ్ఞప్తి
ఎన్నారై డెస్క్: అది కెనడాలోని(Canada) ఓ చిన్న టౌన్.. పేరు ఇరోవిల్(Herouxville).. క్యూబెక్(Quebec) ప్రావిన్స్‌లో ఇదో భాగం.. పూర్తిగా గ్రామీణ వాతావరణం. ఇది ప్రపంచానికి పెద్దగా పరిచయమే లేని ప్రాంతం. అయితే..పదేళ్ల క్రితం ఇరోవిల్ పేరు మారుమోగిపోయింది. వీదేశీయులు మా ప్రాంతానికి రావద్దని ఇరోవిల్ చెప్పడమే దీనికి కారణం. మహిళలను రాళ్లతో కొట్టి చంపద్దు. తగల బెట్టొద్దు..ముసుగు ధరించి వీధుల్లో నడవద్దు..ఇలా ప్రకటనలిస్తూ విదేశీయులంటే తమకు ఎంత భయమో అక్కడి వారు చెప్పేశారు. అలాంటి ఇరోవిల్ ఇప్పుడు తన రూటు పూర్తిగా మార్చేసుకుంది. మీరెక్కడివారైనా సరే.. ఇక్కడే సెటిల్ అవ్వండి అంటూ విదేశీయులకు రెడ్ కార్పెట్ పరుస్తోంది.
కేవలం పదేళ్లలో ఇరోవిల్ సీన్ ఇంతలా మారిపోవడానికి కారణం..ఉద్యోగులు, కార్మికుల కొరత. పాశ్చాత్యా దేశాలన్నిటినీ వేధిస్తున్న ఈ సమస్య ఇరోవిల్‌ను వదిలిపెట్టలేదు. హాస్పటాలిటీ, ఐటీ.. ఇలా అనేక రంగాల్లో సిబ్బంది కొరత ఎదుర్కుంటోంది. ఇది చాలదన్నట్టు..ఈ ఏడాది రిటైర్ అయ్యేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో సమస్య మరింత తీవ్ర రూపం దాల్చబోతోంది. క్యూబెక్‌కు వచ్చే విదేశీయుల్లో చాలా మంది మాంట్రియాల్(Montreal) నగరానికి తరలిపోతుండటంతో అలమటిస్తోంది. అందుకే తమ ప్రాంతంలో సెటిల్ కావాలంటూ విదేశీయులను ఆకర్షించేలా ప్రకటనలు గుప్పిస్తోంది.
పాశ్చాత్య దేశాలన్నిటిలోకి కెనడాలోనే కార్మికుల కొరత ఎక్కువ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో..కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సమస్య పరిష్కారం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అధిక వేతనాలతో విదేశీయులను కెనడా వైపు ఆకర్షించేందుకు ట్రై చేస్తున్నారు. అయితే..దీని వల్ల స్థానిక సంస్థలకు వేతన భారం పెరగడమే కాకుండా.. ఉత్పాదకతపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్మికుల కొరత నేపథ్యంలో కెనడాతో పాటూ అనేక పాశ్చాత్య దేశాలు.. వలసల విషయంలో ఎటువంటి విధానం పాటించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నాయి.
Updated Date - 2022-10-29T23:33:02+05:30 IST