NRI: రెండో వివాహం తరువాత.. పాస్‌పోర్టులో మొదటి భార్య పేరును మార్చకపోవడంతో..
ABN, First Publish Date - 2022-10-25T21:15:33+05:30
గల్ఫ్‌లో మరణించిన నిర్మల్ జిల్లా వాసి. పాస్‌పోర్టులో అడ్రస్ సరిగా లేనికారణంగా మృతదేహం తరలింపులో అవాంతరాలు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పుట్టిన ఊరి నుండి పట్టణానికి మారినా కొందరు ఆధార్(Aadhar), పాస్‌పోర్టు(Passport) వంటి కీలక డాక్యుమెంట్లలో చిరునామాను(Address) మార్చుకోరు. పెళ్ళి, విడాకుల నేపథ్యంలో కొందరు తమ పేరు మార్పు విషయంలో అలసత్వం వహిస్తారు. ఈ పొరపాట్లు ఒక్కోసారి ఊహించని సమస్యలు తెచ్చిపెడుతాయి. అడ్రస్ సరిగ్గా లేని కారణంగా కొన్నిసార్లు.. గల్ఫ్‌లో మరణించిన వారిని అనాథలుగా పరిగణిస్తూ ఎడారిలో పాతిపెట్టేస్తారు.
నిర్మల్ జిల్లా(Nirmal) ఖానాపూర్ మండలం పెంబి గ్రామానికి చెందిన 39 ఏళ్ళ దాసర్ల సంతోష్ ఇదే పొరపాటు చేశారు. అతడు సౌదీలో మరణించగా.. మృతదేహాన్ని భారత్‌కు తరలించడంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. విశాఖపట్టణానికి చెందిన మరో ప్రవాసీ మృతదేహం దుబాయిలో(Dubai) కుళ్ళిపోయింది. సంతోష్‌కు కళావతితో వివాహం జరిగింది. అప్పుడు సంతోష్ పాస్‌పోర్టు పొందగా.. అందులో అతని భార్య పేరు కళావతిగా నమోదైంది. అమె కొద్ది కాలానికి మరణించడంతో సంతోష్‌కు దండ్ల వందనతో రెండవ వివాహం జరిగింది. కానీ తన పాస్ పోర్టులో సంతోష్.. తన భార్య పేరును మార్చుకోలేదు. ఈలోగా సౌదీ అరేబియాలోని నారియా అనే ప్రాంతంలో గుండెపోటుతో మరణించిన సంతోష్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి భార్య అఫిడవిట్ అవసరం కావడంతో వందన దాన్ని పంపించగా భారతీయ ఎంబసీ దాన్ని తిరస్కరించింది. పాస్‌పోర్టు రికార్డుల ప్రకారం సంతోష్ భార్య కళావతి అని ఉండగా వందన ఎవరంటూ ఎంబసీ ప్రశ్నిస్తూ మృతదేహం తరలింపునకు అనుమతి నిరాకరించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసింది.
దీనిపై విచారణ జరపాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్మల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించగా అధికారులు విచారణ జరిపి వందనను సంతోష్ భార్యగా నిర్ధారించడంతో భారతీయ ఎంబసీ యన్.ఓ.సి జారీ చేసింది. దీంతో సంతోష్ మృతదేహం మంగళవారం స్వస్థలానికి చేరుకుంది. ఈ క్రమంలో బాధిత కుటుంబానికి ప్రవాసీ మిత్ర అధ్యక్షుడు పిరికిపండ్ల స్వదేశ్, గల్ఫ్ జేఏసీ నాయకులు గంగుల మురళీధర్ రెడ్డి సహాయపడ్డారు. మరోవైపు కొద్ది కాలం క్రితం విశాఖపట్టణం నగరానికి చెందిన ఒక ప్రముఖుడు దుబాయిలో చాలా కాలంగా పని చేస్తూ ఆర్థికంగా ఎదిగి బెంగళూరులో స్థిరపడ్డారు. కానీ పాస్‌పోర్టులో తన చిరునామాను సవరించుకోలేదు. గుండెపోటుతో మరణించిన అతని మృతదేహం పూర్తిగా కుళ్ళిపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. బంధుమిత్రులు ఎవరూ ముందుకు రాకపోవడంతో భారతీయ కాన్సులేటుకు తెలియజేశారు. భారతీయ కాన్సులేటు ఆంధ్రప్రదేశ్ అధికారులను సంప్రదించగా.. ఆ పేరున్న వ్యక్తి చాలా కాలం క్రితమే బెంగళూరులో స్థిరపడినట్లుగా పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలలోని పాస్‌పోర్టు కార్యాలయాల్లో గానీ విదేశాల్లోని ఎంబసీలల్లో గానీ ప్రవాసీయులు మార్పులు, చేర్పులు చేసుకుంటే ఈ రకమైన సమస్యలు ఎదురుకావు.
Updated Date - 2022-10-26T08:36:58+05:30 IST