Singapore: సింగపూర్ ఆలోచన అదే.. విదేశీయులకు రెడ్ కార్పె్ట్ పరిచినా..అన్నీ కుదిరితేనే..
ABN, First Publish Date - 2022-11-08T23:44:17+05:30
విదేశీయులకు రెడ్ కార్పెట్ పరుస్తున్న సింగపూర్..వారికి శాశ్వత నివాసార్హత, పౌరసత్వం విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది.
ఎన్నారై డెస్క్: మానవ వనరుల కొరతతో ఇబ్బంది పడుతున్న సింగపూర్(Singpore) ప్రభుత్వం.. విదేశీయులపై(Foreigners) ఆశలు పెట్టుకుంది. విదేశస్తులు సింగపూర్‌ను తమ రెండో ఇంటిగా మార్చుకుంటారని ఆశిస్తోంది. అయితే.. శాశ్వత నివాసార్హత అనుమతి జారీని వేగవంతం చేయాలన్న విజ్ఞప్తుల విషయంలో మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. ఈ విషయంలో స్పష్టమైన హామీలు నివ్వలేమని చెబుతోంది. ‘‘విదేశీ ప్రతిభావంతులకు శాశ్వత నివాసార్హత లేదా పౌరసత్వం(Citizenship) ఇస్తే ..వారు సింగపూర్‌ను తమ రెండో ఇంటిగా మార్చుకుంటారు. తద్వారా.. దీర్ఘకాలంలో వారు సింగపూర్ వాసులకు కొత్త అవకాశాలు కల్పిస్తారు. మేం ప్రస్తుతం అటువంటి ప్రతిభావంతుల కోసం వేచి చూస్తున్న మాట వాస్తవమే. అయితే.. శాశ్వత నివాసార్హత జారీని మరింత వేగవంతం చేయడంపై మేము ఎటువంటి హామీలు ఇవ్వడం లేదు’’ అని మానవవనరుల శాఖ మంత్రి సోమవారం ఆ దేశ పార్లమెంటులో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
శాశ్వత నివాసార్హతకు(Permanent Residency) సంబంధించిన మార్పుల ద్వారా విదేశీ నిపుణులను(Global talent) దేశంలోకి ఆకర్షించవచ్చంటూ సింగపూర్ లాయర్లు చెబుతున్నారు. అయితే.. ఆర్థికాభివృద్ధికి కావాల్సిన మానవ వనరులన్నీ దేశీయంగా తీరవన్న విషయం తమకు తెలుసునని మంత్రి పేర్కొన్నారు. అయితే.. గ్లోబల్ టాలెంట్‌ను ఆకర్షించడమంటే దేశంలోకి వలసలను ప్రోత్సహించడమన్న అభిప్రాయం కొందరిలో ఉన్నట్టు వ్యాఖ్యానించారు. విదేశీ టాలెంట్‌ను దేశంలోకి ఆహ్వానించాక మొదట పరీక్ష దశ మొదలవుతుంది. ఇక్కడి పరిస్థితులు వారికి నచ్చుతాయా.. వారి తీరు మాకు అనుకూలంగా ఉందా అన్న విషయాన్ని పరిశీలిస్తాం. అన్నీ అనుకూలంగా ఉంటే..వారికి శాశ్వత నివాసార్హత లేదా పౌరసత్వం ఇస్తాం’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
Updated Date - 2022-11-08T23:45:47+05:30 IST