UAE Visas: స్పాన్సర్ అవసరం లేని ఈ 7 వీసాల గురించి తెలుసా?
ABN, First Publish Date - 2022-10-29T13:31:26+05:30
యునైటెడ్ అరబ్ ఏమిరెట్స్ (Unite Arab Emirates) తమ దేశానికి ఉపాధి, ఉద్యోగం, ఇతర కారణాలతో వచ్చే వలసదారులకు వేర్వేరు రకాల వీసాలను జారీ చేస్తుంది.
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఏమిరెట్స్ (Unite Arab Emirates) తమ దేశానికి ఉపాధి, ఉద్యోగం, ఇతర కారణాలతో వచ్చే వలసదారులకు వేర్వేరు రకాల వీసాలను జారీ చేస్తుంది. ఇక ఇటీవల యూఏఈ తన వీసా విధానంలో పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే విదేశీయులకు ఇప్పుడు యూఏఈ వీసాలు పొందడం చాలా సులభతరం చేసింది. దీనిలో భాగంగా యూఏఈ జారీ చేసే ఏడు రకాల వీసాలను ఎలాంటి స్పాన్సర్షిప్ లేకుండా పొందే వెసులుబాటు కూడా ఉంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. గోల్డెన్ వీసా (Golden visa)
గోల్డెన్ వీసా ఎవరికిస్తారంటే.. 2018 కేబినెట్ తీర్మానం నెం. 56 ప్రకారం పెట్టుబడిదారులు(కనీసం రూ. 20.50కోట్లు), పారిశ్రామికవేత్తలు, సైన్స్, నాలెడ్జ్, స్పోర్ట్స్ రంగంలోని నిపుణులు, ప్రత్యేక ప్రతిభావంతులకు గోల్డెన్ వీసా ఇస్తారు. ఇది 10, 5 ఏళ్ల కాలపరిమితితో వస్తుంది.
10 ఏళ్ల వీసాకు అర్హులు వీరే..
పదేళ్ల వీసా కోసం పెట్టుబడిదారులు(కనీసం రూ. 20.50కోట్ల పెట్టుబడి), ప్రత్యేక ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పెట్టుబడిదారులు: పబ్లిక్ పెట్టుబడులలో కనీసం 10 మిలియన్ దిర్హమ్స్ పెట్టుబడులు పెట్టాలి. ఈ పెట్టుబడి అనేక రూపాల్లో ఉండవచ్చు.
* దేశంలోని ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లో కనీసం 10 మిలియన్ దిర్హమ్స్(రూ.20.50కోట్లు) డిపాజిట్ చేయడం
* యూఏఈలో రూ.20.50కోట్లకు తక్కువ కాకుండా మూలధనంతో కంపెనీని స్థాపించడం
* రూ. 20.50కోట్లకు తగ్గకుండా షేర్ విలువ కలిగిన ప్రస్తుత, కొత్త కంపెనీలో భాగస్వామిగా చేరడం
షరతులు:
* పెట్టుబడి పెట్టిన ధనం లోన్ రూపంలో తీసుకోని ఉండకూడదు.
* పెట్టుబడులను కనీసం మూడేళ్లపాటు ఉంచాలి.
* రూ.20.50కోట్ల వరకు ఫైనాన్షియల్ సాల్వెన్సీ ఉండాలి.
5 ఏళ్ల గోల్డెన్ వీసాకు అర్హులు వీరే..
ఐదేళ్ల వీసా కోసం పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ప్రతిభావంతులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పెట్టుబడిదారులు:
* పెట్టుబడిదారుడు 5 మిలియన్ల దిర్హమ్స్‌కు(రూ.10.25కోట్లు) తగ్గకుండా స్థూల విలువ కలిగిన ఆస్తిలో పెట్టుబడి పెట్టాలి.
* రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టిన మొత్తం రుణం తీసుకున్నదై ఉండకూడదు.
* ఆస్తిని కనీసం మూడేళ్లపాటు నిలుపుకోవాలి.
పారిశ్రామికవేత్తలు:
* 5లక్షల మిలియన్ దిర్హమ్స్ కనీస మూలధనంతో ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్ ఉన్నవారు లేదా దేశంలో గుర్తింపు పొందిన బిజినెస్ ఇంక్యుబేటర్ ఆమోదం పొందిన పారిశ్రామికవేత్తలు
* వ్యవస్థాపకుడికి ఆరు నెలల పాటు మల్టీ-ఎంట్రీ వీసా అనుమతించబడుతుంది. మరో ఆరు నెలలకు పునరుద్ధరించబడుతుంది. దీర్ఘకాలిక వీసాలో జీవిత భాగస్వామి, పిల్లలు, భాగస్వామి, ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లు ఉంటారు.
ప్రతిభావంతులైన విద్యార్థులు:
* ప్రభుత్వ, ప్రైవేట్ మాధ్యమిక పాఠశాలల్లో కనీసం 95 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అత్యుత్తమ విద్యార్థులు.
* విశ్వవిద్యాలయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌లో కనీసం 3.75 డిస్టింక్షన్ జీపీఏ కలిగి ఉన్నవారు.
* దీర్ఘకాలిక వీసాలో అత్యుత్తమ విద్యార్థుల కుటుంబాలు ఉంటాయి.
2. రెసిడెన్స్ వీసా (Residence visa)
యూఏఈ మంత్రిమండలి నిర్ణయం ప్రకారం రెసిడెన్స్ వీసాకు కూడా స్పాన్సర్ అవసరం లేదు. అయితే, ఇందులో రెండు కేటగిరీలు ఉన్నాయి. i) రిమోట్ వర్క్ రెసిడెన్స్.. ఇది ఒక ఏడాది కాలపరిమితితో వస్తుంది.
ii) రిటైర్మెంట్ రెసిడెన్స్.. ఇది ఐదేళ్ల పాటు పని చేస్తుంది. ఇందులోనూ రియల్ ఎస్టేట్ యజమానులకు మాత్రం కేవలం రెండేళ్ల పరిమితితో దీన్ని ఇవ్వడం జరుగుతుంది.
3. గ్రీన్ వీసా (Green Visa)
ఎలాంటి స్పాన్సర్ అవసరం లేని గ్రీన్ వీసాను యూఈఏ ప్రభుత్వం ఐదేళ్ల వ్యాలిడిటీతో జారీ చేస్తోంది. ఫ్రీలాన్సర్స్ (Freelancers), నైపుణ్యం గల ఉద్యోగులు (Skilled employees), పెట్టుబడిదారులు, జీవితభాగస్వాములకు ఈ వీసాను ఇస్తారు.
4. ఐదేళ్ల మల్టీపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా (Five-year multiple entry tourist visa)
ఇటీవల యూఏఈ సర్కార్ తీసుకొచ్చిన కొత్త వీసాల్లో ఇది ఒకటి. దీనికి ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేదు. ఈ వీసాను పొందాలంటే ప్రవాసులు తప్పనిసరిగా చెల్లుబాటయ్యే ఆరోగ్య బీమా, బ్యాంక్ స్టేట్‌మెంట్ కాపీ చూపిస్తే సరిపోతుంది. అయితే, బ్యాంక్ బ్యాలెన్స్ కనీసం రూ. 3.29లక్షలు ఉండాలి.
5. బంధువులు లేదా స్నేహితులను కలిసేందుకు విజిట్ వీసా (Visit visa to visit relatives or friends)
యూఏఈ కేబినెట్ ప్రకటించిన యూఏఈ కొత్త వీసాల్లో ప్రవాసులు తమ బంధువులు లేదా స్నేహితులను కలిసేందుకు వీలు కల్పించే విజిట్ వీసా కూడా ఉంది. దీనికి కూడా ఎలాంటి లోకల్ స్పాన్సర్ అవసరం లేదు.
6. ఉద్యోగార్ధుల వీసా (Jobseeker visa)
ఉద్యోగ అవకాశాలను అన్వేషించడానికి యూఏఈ ఇచ్చే ఈ సందర్శన వీసాకు స్థానిక స్పాన్సర్ అవసరం లేదు. మీరు ఈ కేటగిరీ కింద రెండు నెలలు, మూడు నెలల, నాలుగు నెలల కాల పరిమితితో వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
7. వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి వీసా (Visit visa to explore business opportunities)
యూఏఈ (UAE) ఆధారిత కంపెనీ లేదా వ్యక్తి స్పాన్సర్‌గా అవసరం లేని సందర్శన వీసాకు చెందిన మరొక కేటగిరీ వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి ఇచ్చే విజిట్ వీసా.
Updated Date - 2022-10-29T13:41:20+05:30 IST