NRI: సౌదీలోని జెద్ధా, యాన్బులలో తెలుగు ప్రవాసీయుల క్రిస్మస్ వేడుకలు
ABN, First Publish Date - 2022-12-26T21:00:40+05:30
సౌదీలోని జెద్ధా, యాన్బులలో తెలుగు ప్రవాసీయుల ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఏ పండుగ అయినా సరే, అందులో పిల్లలు, ఆడపడుచులు ఎంత ఎక్కువగా భాగస్వాములయితే అంత ఆనందంగా ఉంటుంది. పరాయి దేశాలకు పొట్టకూటి కొరకు వచ్చే వారిలో కుటుంబాల సమేతంగా ప్రవాసానికి వచ్చే వారి సంఖ్య తక్కువ కాబట్టి ఎడారి దేశాలలో పండుగల్లో పిల్లలు, మహిళలను ఎక్కువ సంఖ్యలో హాజరుకావాలనుకోవడం తప్పు అయినా నిన్న జరిగిన క్రిస్మస్ వేడుకలలో కొన్ని చోట్ల మహిళలు, పిల్లలు లక్ష్యంగా కార్యక్రమాలు జరిగాయి.
సౌదీ అరేబియాలోని జెద్ధా నగరంలో తెలుగు ప్రవాసీ క్రైస్తవుల సంఘమైన గ్లోరియస్ తెలుగు చర్చి (జి.టి.సి) ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకలు(Christsmas Celebrations) ఒక ఇంట్లో అందరు కుటుంబ సభ్యులు జరుపుకొన్న తరహాలో జరిగాయి. పాస్టర్ హానూక్ అభినయ్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రైస్తవులు ప్రత్యేకించి మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. అమెరికా, భారత్‌లలో క్రిస్మస్ పండుగను జరుపుకొన్నా తాను ఈ సారి సౌదీ అరేబియా నేలపై యేసు జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం అమితానందంగా ఉందని హైదరాబాద్ నగరానికి చెందిన నిస్సీ అన్నారు. సౌదీ అరేబియాకు నూతనంగా వచ్చిన అమెకు ఇదే మోదటి క్రిస్మస్.
పర్వత నగరమైన తాయిఫ్‌లో నివాసముండే జాన్, సుధా దంపతులు ఆతిథ్యానికి పెట్టింది పేరు. తమ ఇంటికి ఎప్పుడు అతిథులు వచ్చినా వారికి క్రిస్మస్‌ను మరిపించే విధంగా పండుగ జరుపుతారు, ఈ దంపతులు ఇద్దరు ప్రత్యేకంగా తాయిఫ్ నుండి క్రిస్మస్ కొరకు వచ్చారు. అరుణా, రోజా, దీనాల కీర్తనాలను సభికులు శ్రద్ధగా వినగా వసంతి, సాం, నిఖీల్, అఖిల్, ప్రేసీ, ఇనోష్ మరియు ప్రవీణ్‌ల సాంస్కృతిక కార్యక్రమాలను ఆనందంగా తిలకించారు.
యాన్బూలో ...
పారిశ్రామిక పట్టణం యాన్బూలో కూడా తెలుగు క్రైస్తవులు పండుగను ఘనంగా జరుపుకొన్నారు. గ్రేస్ తెలుగు ఫెలోషిప్ చర్చి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు గుంటూరు జిల్లా కావూరుకు చెందిన పాస్టర్ సతీష్, ఆనంద జ్యోతి నేతృత్వం వహించారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పాస్టర్లు సునీల్ కుమార్, హానుక్‌లు దైవ సందేశాన్ని వినిపించగా సౌదీ అరేబియా జాతీయుడయిన మొహ్మద్ యాసర్ లాంఛనంగా కేక్‌ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.
Updated Date - 2022-12-26T21:05:42+05:30 IST