UAE: ప్రవాసులు జర జాగ్రత్త.. ఈ తప్పు అస్సలు చేయకండి.. లేకుంటే రూ.2కోట్ల జరిమానా తప్పదు!
ABN, First Publish Date - 2022-12-23T11:17:46+05:30
అబుదాబి మున్సిపాలిటీ అండ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ (Department of Municipalities and Transport) తాజాగా నివాసితులు, ప్రవాసులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది.
అబుదాబి: అబుదాబి మున్సిపాలిటీ అండ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ (Department of Municipalities and Transport) తాజాగా నివాసితులు, ప్రవాసులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. నివాస ప్రాంతాలలో రద్దీని తగ్గించడానికి 'మీ ఇల్లు, మీ బాధ్యత' ప్రచార కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. ఈ కార్యక్రంలో భాగంగా 2023 మొదటి త్రైమాసికంలో తనిఖీలు నిర్వహించనున్నట్లు డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. దీనిలో భాగంగా ఉల్లంఘనదారులకు 10లక్షల దిర్హమ్స్ (రూ.2.25కోట్లు) వరకు జరిమానా ఉంటుందని పేర్కొంది. అపార్ట్‌మెంట్స్, విల్లాస్‌లో పరిమితికి మించి రద్దీని కలిగి ఉంటే జరిమానా విధించడం జరుగుతుందని తెలిపింది. 2019లోని చట్టం నం.08 ప్రకారం రెసిడెన్షియల్ యూనిట్ రద్దీ పరిమితులను నిర్ణయించినట్లు చెప్పింది. ఈ పరిమితులకు మించి ఉంటే వాటిని రద్దీగా పరిగణించడం జరుగుతుందట. అలాంటి ఉల్లంఘనదారులకు భారీ ఫైన్ ఉంటుంది.
అబుదాబి సివిల్ డిఫెన్స్ అథారిటీ సహకారంతో ప్రారంభించిన ఈ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశం.. ఎమిరేట్‌లో జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అధిక రద్దీ ప్రతికూల ప్రభావాల నుండి కమ్యూనిటీ సభ్యులను రక్షించడమేనని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పౌరులు, రియల్ ఎస్టేట్ యజమానులు, వ్యాపారాలందరూ చట్టాన్ని అనుసరించి ఒక నివాస యూనిట్‌కు వ్యక్తుల సంఖ్యను పరిమితం చేయాలని సూచించారు. అలాగే యజమాని కుటుంబ ఇళ్లకు దూరంగా నియమించబడిన నివాస ప్రాంతాలలో గృహ కార్మికులకు ప్రత్యేకంగా డార్మిటరీలు ఉండాలని కోరారు.
Updated Date - 2022-12-23T11:17:47+05:30 IST