NRI: అమెరికాలో సిక్కు మతస్తులకు దక్కిన న్యాయం..
ABN, First Publish Date - 2022-12-24T17:23:49+05:30
అమెరికా నావికాదళంలోని ప్రత్యేక విభాగం ‘మెరీన్స్’కు ఎంపికైన సిక్కు మతస్తులు తమ మతసంప్రదాయాలను పాటించేందుకు అనుమతించాలంటూ వాషింగ్టన్‌లోని కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ మెరీన్స్ విభాగం ఉన్నతాధికారులను ఆదేశించింది.
అమెరికా నావికాదళంలోని ప్రత్యేక విభాగం ‘మెరీన్స్’కు(Marines) ఎంపికైన సిక్కు మతస్తులు తమ మతసంప్రదాయాలను పాటించేందుకు అనుమతించాలంటూ వాషింగ్టన్‌లోని కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ మెరీన్స్ విభాగం ఉన్నతాధికారులను ఆదేశించింది. వారి మతాచారలకు అనుగుణంగా తలపాగా(Turban) ధరించేందుకు, గడ్డం(Beard) పెంచుకునేందుకు అనుమతించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెరీన్స్‌కు ఎంపికైన ముగ్గురు సిక్కు మతస్తులు వేసిన పిటిషన్‌పై ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ‘మెరీన్స్’ దళాల్లోని వారు తమ తమ మతసంప్రదాయాలు పాటించేందుకు స్వేచ్ఛనిస్తే బృందంలో ఐక్యత దెబ్బతింటుందన్న వాదనను న్యాయస్థానం ఈ సందర్భంగా తోసిపుచ్చింది. అమెరికా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఇప్పటికే సిక్కు మతస్తులను తలపాగా ధరించేందుకు అనుమతిస్తున్నాయి.
అయితే..మెరీన్స్ దళానికి ఎంపికైన ముగ్గురు సిక్కు అభ్యర్థులు తలపాగా ధరించేందుకు ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాథమిక శిక్షణ, యుద్ధ సమయాల్లో తలపాగా ధరించొద్దని, గడ్డం పెంచుకోవద్దని ఆదేశించారు. జట్టులో ఐక్యత కోసం శిక్షణ సమయంలో ట్రెయినీలు మానసికంగా పూర్తి పరివర్తన సాధించి జట్టులో ఒకరిగా మారిపోవాలని చెప్పారు. ఈ దిశగా ట్రెయినీలు తమ సొంత అస్తిత్వాలకు దూరవడం అవసరమని చెప్పారు. మిగతా సమయాల్లో మాత్రం యథాతథంగా తమ సంప్రదాయాలను పాటించొచ్చని చెప్పారు. దీంతో.. సిక్కు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా..న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. గడ్డం, తలపాగాలు శిక్షణకు అడ్డంకిగా మారుతుందన్నట్టు ‘మెరీన్స్’ నిరూపించలేకపోయిందని వ్యాఖ్యానించింది. ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనం పరిశీలించే వరకూ పిటిషనర్లు మెరీన్స్‌లో ఉన్నప్పుడు తమ మతాచారాలు పాటించేందుకు అనుమతించాలని ఆదేశించింది. గతంలో మెరీన్స్ అభ్యర్థుల్లో చర్మసంబంధిత సమస్యలు ఉన్నవారిని గడ్డంతో కొనసాగేందుకు అనుమతిచ్చిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. సొంత అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే టాటూలనూ అనుమతిచ్చిన విషయాన్నీ లేవనెత్తింది. ఇటువంటి వాటిని అనుమతిచ్చినప్పుడు..మైనారిటీల మతసంప్రదాయాలపై అభ్యంతరాలు సబబు కాదని అభిప్రాయపడింది.
Updated Date - 2022-12-24T17:58:43+05:30 IST