NRI: అమెరికా వీసా దరఖాస్తుదారులకు ఓ గుడ్ న్యూస్..
ABN, First Publish Date - 2022-12-24T20:14:40+05:30
నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూల నుంచి గతంలో ఇచ్చిన మినహాయింపును వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకూ పొడిగిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ.
ఎన్నారై డెస్క్: అమెరికా వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఓ గుడ్ న్యూస్! నాన్ ఇమిగ్రెంట్ వీసా(Non Immigrant Visas) దరఖాస్తుదారులకు గతంలో ఇంటర్వ్యూల(In-Person Interviews) నుంచి ఇచ్చిన మినహాయింపును వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకూ పొడిగిస్తున్నట్టు(Extension) అమెరికా విదేశాంగ శాఖ(US State Department) తాజాగా ప్రకటించింది. హెచ్-2 వీసా, ఎఫ్, ఎమ్ వీసాలు, జే వీసా దరఖాస్తుదారులతో పాటూ హెచ్-1బీ, హెచ్-3, ఎల్, ఓ, పీ, క్యూ వీసాదారుల్లో అనుమతి పొందిన కొందరికి ఈ మినహాయింపు వర్తిస్తుందని పేర్కొంది. తమ వీసా గడువు ముగిసిన 48 గంటల్లోపే రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఇంటర్వ్యూల నుంచి గతంలో ఇచ్చిన మినహాయింపు తదుపరి ప్రకటన వెలువడే వరకూ అమల్లో ఉంటుందని చెప్పింది.
2022 ఆర్థిక సంవత్సరంలో సుమారు ఏడు మిలియన్ల వలసేతర వీసాలు జారీ కాగా.. వీటిల్లో దాదాపు సగం వీసాలకు ఇంటర్వ్యూల నుంచి మినహాయింపును ఇచ్చారు. వీసా కోసం వేచి చూడాల్సిన సమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు విదేశాంగ శాఖ తెలిపింది. ఇంటర్వ్యూల రద్దు ద్వారా అందుబాటులోకి వచ్చిన స్లాట్లను ఇతర వీసా దరఖాస్తుదారులకు కేటాయిస్తూ వీసా వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. స్థానిక పరిస్థితులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇవ్వాలా వద్దా అనేది అధికారులు నిర్ణయిస్తారని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.
Updated Date - 2022-12-24T21:34:33+05:30 IST