Cordyceps: చైనా సైనికుల చొరబాట్లు వీటి కోసమేనట!.. 10 గ్రాములే రూ.50 వేలట..
ABN, First Publish Date - 2022-12-26T22:02:18+05:30
భారత భూభాగమైన అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా పదేపదే చొరబాట్లకు ఓ ఫంగసే అసలు కారణమా?.. బంగారం కంటే ఎక్కువ విలువైన దాని కోసమే డ్రాగన్ దురాక్రమణ ప్రయత్నాలు చేస్తోందా?.. ఇటీవల తవాంగ్ సెక్టార్‌లో కయ్యానికి దిగింది ఇందుకోసమేనా?.. అనే ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది.
భారత భూభాగమైన అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా పదేపదే చొరబాట్లకు ఓ ఫంగసే అసలు కారణమా?.. బంగారం కంటే ఎక్కువ విలువైన దాని కోసమే డ్రాగన్ దురాక్రమణ ప్రయత్నాలు చేస్తోందా?.. ఇటీవల తవాంగ్ సెక్టార్‌లో కయ్యానికి దిగింది ఇందుకోసమేనా?.. అనే ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. అమూల్యమైన ఔషధ గుణాలున్న కార్డిసెప్స్ (Cordyceps) అనే ఓ ఫంగస్ (fungus) కోసమే అరుణాచల్‌లో చైనా దురాక్రమణలకు దిగుతోందంటూ ఇండో-పసిఫిక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్(IPCSC) సంస్థ నివేదిక పేర్కొంది. చైనా సైనికులు అనేకసార్లు ఈ ఫంగస్ అన్వేషణ కోసమే భారత భూభాగంలోకి చొరబడినట్లు పేర్కొంది. కార్డిసెప్స్ ఫంగస్‌లో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయని, చైనాలో ఈ ఫంగస్‌కు డిమాండ్ ఎక్కువని, బంగారం కంటే ఎక్కువ విలువైన ఈ ఫంగస్ అన్వేషణలో భాగంగానే చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడుతున్నారని రిపోర్ట్‌లో ఆసక్తికరమైన అంశాన్ని తెలిపింది. ఇటీవల తవాంగ్ సెక్టార్‌లో చైనా అక్రమ చొరబాటు నేపథ్యంలో ఈ రిపోర్టును విడుదల చేసింది. మరి ఈ కార్డిసెప్స్ ఫంగస్ ఏమిటి?, దీని ప్రత్యేకత ఏంటి? ప్రాధాన్యత ఏమిటి? అనే అంశాలపై ఓ లుక్కేద్దాం..
కార్డిసెప్స్ అనేది చూడటానికి పసుపు కొమ్ములా కనిపించే ఓ ఫంగస్. పసుపు, కాషాయ రంగుల్లో సన్నటి పోగులా ఉండే వీటిని గొంగళి ఫంగస్ (caterpillar fungus), హిమాలయన్ గోల్డ్‌గా (Himalayan Gold) పిలుస్తుంటారు. ఇది ప్రధానంగా భారతీయ హిమాలయాలు, నైరుతి చైనాలోని క్వింఘయ్-టిబెటన్ పీఠభూమిలో అధిక ఎత్తైన ప్రాంతాల్లో ఇవి కనిపిస్తుంటాయి. దీనిని చైనాలో ఔషధ తయారీలో విరివిగా ఉపయోగిస్తుంటారు. అందుకే 10 గ్రాముల విలువ సుమారు రూ.56 వేల వరకు ఉంటుందట. ఇక మేలు రకం కార్డిసెప్స్ ధర లక్షల్లోనే ఉంటుందనేది అంచనాగా ఉంది. ఈ కారణంగానే కార్డిసెప్స్‌ను ‘హిమాలయ బంగారం’గా (Himalayan Gold) పిలుస్తుంటారు. ఐపీసీఎస్‌సీ నివేదిక ప్రకారం.. 2022లో అంతర్జాతీయంగా కార్డిసెప్స్ మార్కెట్ విలువ సుమారు 1072.50 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో దాదాపు రూ.8700 కోట్లుగా ఉంది. కార్డిసెప్‌కు అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిదారుగా చైనాయే కావడం విశేషం. అయితే గత రెండేళ్లుగా చైనాలో కార్డిసెప్స్‌కు అతిపెద్ద సాగు ప్రాంతంగా ఉన్న కింఘైలో ఫంగస్ దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా కొరత ఏర్పడింది. పర్యావసనంగా డిమాండ్ భారీగా పెరిగింది. సైంటిఫిక్ ఆధారాలు ఏమీ లేకపోయినప్పటికీ చైనాలోని మధ్యతరగతి వర్గాలు కిడ్నీ సమస్యల నుంచి నపుంసకత్వం వరకు పలు వ్యాధుల చికిత్సకు దీనిని ఉపయోగిస్తుంటారు. అందుకే అక్కడ దీనికి గిరాకీ ఎక్కువగా ఉంది. అధిక డిమాండ్, పరిమిత వనరుల కారణంగా దీని విలువ చాలా ఎక్కువ ఉండడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. చైనాలో కార్డిసెప్స్ దిగుమతి 2017లో 43,500 కేజీలుగా ఉండగా 5.2 కేజీల తగ్గుదలతో 2018లో 41,200 కేజీలకు పడిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయని ఐపీసీఎస్‌సీ రిపోర్ట్ ప్రస్తావించింది. అయితే 2010, 2011 ఉత్పత్తి అయిన 150,000 కేజీలతో పోల్చితే చాలా తక్కువని పేర్కొంది.
స్థానికులకు డబ్బు ఇస్తున్న కంపెనీలు..
కింఘయ్‌లోని చైనీస్ కార్డిసెప్స్ కంపెనీలు గత కొన్నేళ్లుగా కార్డిసెప్స్ అన్వేషణ, సాగు కోసం పెద్ద ఎత్తున డబ్బు చెల్లిస్తున్నాయి. పర్వత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సాగు కోసం స్థానికులను ప్రోత్సహిస్తున్నాయి. ఇక హిమాలయన్ టౌన్లలో చాలామంది కార్డిసెప్స్ ఫంగస్ సేకరణ, విక్రయంపై చాలామంది ఆధారపడుతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. టిబెట్ పీఠభూమి, హిమాలయాల్లో 80 శాతం కుటుంబాలు ఈ ఫంగస్ సేకరణ, అమ్మకంపైనే ఆధారపడ్డాయని పలు సర్వేలు పేర్కొన్నాయి. మరి ఐపీసీఎస్‌సీ రిపోర్ట్ చెబుతున్నట్టు భారత భూభాగంలోకి చైనా సైనికుల చొరబాట్లకు కార్డిసెప్స్ ఫంగసే కారణమో.. కాదో తెలియదు గానీ వీటి ప్రత్యేకత, విలువ చర్చనీయాంశమైంది.
Updated Date - 2022-12-26T22:16:15+05:30 IST