T20 World Cup 2022: బెన్ స్టోక్స్ ఒక్కసారి కమిట్ అయితే.. ఇంగ్లండ్ ప్రపంచకప్ విజయాల రహస్యం ఏమిటంటే..
ABN, First Publish Date - 2022-11-14T15:25:55+05:30
ఎన్నో ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ చరిత్ర కలిగిన ఇంగ్లండ్ 2019లో తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. మళ్లీ తాజాగా టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ సాధించింది. ఇంగ్లండ్ సాధించిన ఈ రెండు టైటిళ్ల వెనుక ఉన్న ఒకే ఒక వ్యక్తి.. బెన్ స్టోక్స్
క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లండ్. ఆ దేశం నుంచి జాక్ హాబ్స్, వాలీ హేమండ్, ఇయాన్ బోథమ్ వంటి ఎంతో మంది గొప్ప గొప్ప ఆటగాళ్లు క్రికెట్ ప్రపంచంలో మెరుపులు మెరిపించారు. అయితే వారెవరూ తమ జట్టును విశ్వ విజేతగా నిలపలేకపోయారు. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ చరిత్ర కలిగిన ఇంగ్లండ్ 2019లో తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. మళ్లీ తాజాగా టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ సాధించింది. ఇంగ్లండ్ సాధించిన ఈ రెండు టైటిళ్ల వెనుక ఉన్న ఒకే ఒక వ్యక్తి.. బెన్ స్టోక్స్ (Ben stokes).
భారత ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) బెన్ స్టోక్స్‌ను ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెన్ స్టోక్స్‌కు ఓడిపోవడం అంటే ఏంటో తెలియదని, అతని సీరం నుంచి వ్యాక్సిన్ తయారు చేస్తే బాగుంటుందని ట్వీట్ చేశారు. నిజమే.. సహచరులందరూ విఫలమైన వేళ పట్టుదలతో ఆడి రెండు సార్లు ఇంగ్లండ్‌కు ప్రపంచకప్ అందించిన ఘనత బెన్ స్టోక్స్‌ది.
2019లోనూ ఒంటరి పోరాటం..
2019లో ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ (2019 World cup)లో బెన్ స్టోక్స్ అసాధారణ పోరాట పటిమ కనబరిచాడు. సహచరులందరూ విఫలమైన వేళ జాస్ బట్లర్ (59 పరుగులు)తో కలిసి స్టోక్స్ పోరాటం చేశాడు. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో చివరి వరకు క్రీజులో నిలిచి అజేయంగా 84 పరుగులు చేసి స్కోరును సమం చేశాడు. ఆ మ్యాచ్ టై అయినప్పటికీ ఎక్కువ ఫోర్లు కొట్టిన జట్టు అయిన ఇంగ్లండ్ విజేతగా నిలిచింది.
2022లోనూ సేమ్ సీన్..
తాజాగా పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో (T20 World Cup 2022) 5 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్.. రెండో టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్‌కు ఛేదన అంత సులభం కాలేదు. కష్ట సాధ్యమైన పిచ్‌పై పరుగులు రావడం కష్టమైంది. మళ్లీ జాస్ బట్లర్ (26 పరుగులు)తోనే కలిసి బెన్ స్టోక్స్ (52 నాటౌట్) జట్టును విజయ తీరాలకు చేర్చి తన జట్టుకు రెండో ప్రపంచకప్ టైటిల్ అందించాడు.
Updated Date - 2022-11-14T15:25:57+05:30 IST