Hyderabad Book Fair : మా పని 10 శాతమే., మిగిలిన 90 శాతం పని తల్లిదండ్రులు, టీచర్లు, ఇతర సంస్థలు చెయ్యాలి..!
ABN, First Publish Date - 2022-12-31T07:45:02+05:30
1000 ముద్రిస్తే, అవి 2-3 సంవత్సరాలలో అమ్ముడుపోతే చాలా త్వరగా అమ్మినట్టు. Hyderabad Book Fair
తెలుగు పుస్తకాలు, అందులోనూ బాలసాహిత్యాన్ని ఇప్పటి పిల్లలవరకూ తెచ్చి, వారి చిట్టి చేతుల్లో పెట్టే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు పి. భాగ్యలక్ష్మి. మంచి పుస్తకం ప్రచురణలు పేరుతో పిల్లల పుస్తకాలను ప్రచురిస్తున్నారు. పబ్లిషర్ గా పిల్లలకు మంచి మంచి కథలను అలవాటు చేయాలంటే తల్లిదండ్రులు, విద్యాసంస్థల పాత్ర ఎలా ఉండాలనే విషయంగా, భాగ్యలక్ష్మి బుక్ ఫెయిర్ సందర్భంగా ఆంధ్రజ్యోతి వెబ్ తో జరిపిన ఆత్మీయ సంభాషణ..
1. ఇంగ్లీషు అనువాదాలు తెలుగు పుస్తకాలకు ఉన్న చోటుని ఆక్రమిస్తున్నాయంటారా?
సంస్కృతులు, భాషల మధ్య వారధిగా అనువాదాలు ఎప్పుడూ ఉన్నాయి. చాలా దశాబ్దాల ముందు నుంచే ఇతర దేశ భాషల నుంచి, ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువాదాలు చాలా ఎక్కువగా జరిగాయి. ఇప్పుడు కూడా అనువాదాలు ఎక్కువగానే ఉంటున్నాయి. మూల తెలుగు రచనలు మిగిల్చిన ఖాళీని అవి పూరిస్తున్నాయని అనుకోవాలి.
2. ప్రస్తుతం తెలుగులో బాల సాహిత్యం ఎలా ఉందని అనుకుంటున్నారు?
మారుతూ వస్తున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లలకు ఆసక్తి కలిగించే కథలు, నవలలు తెలుగులో రావటం లేదన్నది నా బలమైన అభిప్రాయం. ఇందుకు చందమామ నిర్వహించిన పాత్రని పోషించటానికి సమకాలీన పిల్లల పత్రిక లేకపోవటం ఒక కారణం. ఇతర పత్రికలలో నిర్వహిస్తున్న బాలల పేజీ కథలు మా చిన్నప్పటి కథల లాగానే ఉంటున్నాయి. పిల్లలకు ఏదో నేర్పించేయాలనే మూసపోత రచనల నుంచి బాల సాహిత్య రచయితలు బయట పడలేకపోతున్నారని అనిపిస్తుంది.
3. తెలుగులో కథలు పిల్లలు చదవాలంటే పెద్దవాళ్లు చేయవలసినది ఏమిటి?
ఇంగ్లీషు మీడియం చదువులకు ఆదరణ పెరగటం వల్ల తెలుగులో కథలు పిల్లలు చదవాలంటే తల్లిదండ్రులు చేయవలసింది ఎంతో ఉంది. పుస్తకం కొనివ్వగానే తమ బాధ్యత అయిపోయిందని పెద్దవాళ్లు అనుకుంటారు. వాస్తవానికి వాళ్ల పని అప్పుడే మొదలవుతుంది. పుస్తకాలను చూపిస్తూ కథలు చెప్పటం, చదివి వినిపించటం, కలిసి చదవటం వంటి పనులు చెయ్యాలి. ప్రతి రోజూ, లేదా వారంలో కనీసం 3-4 రోజులు ఇందుకు సమయం కేటాయించాలి.
ఈ ప్రయత్నాన్ని సముదాయ (కమ్యునిటి) స్థాయిలో చేస్తే ఇంకా బాగుంటుంది. అపార్ట్‌మెంట్లలో పిల్లలకు ఉమ్మడి గ్రంథాలయం, పుస్తకాల చుట్టూ అనేక కార్యక్రమాలు నిర్వహించగలిగితే బాగుంటుంది.
4. ఇప్పటివరకు ఎన్నో ఎగ్జిబిషన్లలో పాల్గొన్నారు కదా, అక్కడ ఎటువంటి అనుభవాలు ఎదురవుతుంటాయి?
పుస్తకాలను ఎంచుకునే స్వేచ్ఛని పిల్లలకి ఇచ్చేవాళ్లు, వాళ్లు ఎంచుకున్నది కాదని తమకి నచ్చింది కొనేవాళ్లు, మమ్మల్ని సలహాలు అడిగేవాళ్లు – ఇలా రకరకాల తల్లిదండ్రులు కనపడుతుంటారు. తెలుగు నేర్చుకోటానికి, పుస్తకాల పట్ల ప్రేమ కలగటానికి మేం ప్రాధాన్యతను ఇస్తాం. అయితే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు వ్యక్తిత్వ వికాసం, జ్ఞానం అంటూ తపన పడిపోతుంటారు. ఎగ్జిబిషన్లలో మాకు సంతోషాన్ని, శక్తిని ఇచ్చేది పిల్లలు. తల్లిదండ్రులు భయపడుతున్నప్పటికీ ఇప్పటివరకు పుస్తకాన్ని పాడు చేసిన పిల్లలు మాకు ఎదురు కాలేదు. వాళ్లని స్వేచ్ఛగా వదిలేస్తే పిల్లలు చాలాసార్లు తమ వయస్సుకి తగిన పుస్తకాన్ని ఎంచుకుంటారు. ఒక పుస్తకం నచ్చగానే పిల్లల ముఖాలలో వెలుగును చూడటం ఎంతో సంతోషంగా ఉంటుంది.
తమ బడిలో, ఇంటిలో అంతకు ముందు చదివిన పుస్తకాలను ఎగ్జిబిషన్లో చూసి పిల్లలు ఆనంద పడుతుంటారు. మరీ చిన్న పిల్లలయితే మా పుస్తకాలు ఇక్కడ ఉన్నాయేంటి అని ఆశ్చర్యపోతుంటారు. తమ దగ్గర ఉన్న, చదివిన పుస్తకాలను గుర్తు పడుతుంటారు. పుస్తకం పేరు కనపడకుండా మూసేసి, బొమ్మ చూపిస్తూ అది ఏ పుస్తకం అని పెద్దవాళ్లని పిల్లలు అడుగుతుంటారు. ఇలాంటి ఆటలు ముచ్చట గొలుపుతాయి. పుస్తకాల అమ్మకాలు ఎలాగూ జరుగుతాయి, కానీ మాకు స్ఫూర్తిని, సంతృప్తిని, శక్తినీ మిగిల్చేది ఇలాంటి అనుభవాలే.
5. మారిన పాఠకుల స్పందనకు తగినట్టుగా రచయితల్లో ఎలాంటి మార్పు వస్తే బావుంటుందని మీరు భావిస్తున్నారు?
“రామాపురం అనే గ్రామంలో వీరయ్య అనే అతను ఉండేవాడు,” వంటి కథలు కాకుండా ప్రస్తుత పరిస్థితులను చూపెట్టే కథలు తెలుగు రచయితలు రాయాలి.
మన దేశం లోనే ఇతర భాషలలో, ఇంగ్లీషులో బాల సాహిత్యంలో ఎన్నో చక్కని కథలు, నవలలు వస్తున్నాయి. ఉదాహరణకి ఎన్నో సంవత్సరాల క్రితమే బెంగాలీలో సత్యజిత్ రే ఎంతో చక్కని బాలసాహిత్యాన్ని అందించారు. మరాఠీలో మాధురీ పురంధరే చక్కని కథలు, నవలలు రాస్తున్నారు. హిందీలో ఏకలవ్య, ఇక్‌తారా అనే సంస్థలు బొమ్మల కథల పుస్తకాలను ఆకర్షణీయంగా తెస్తున్నారు. ఒక కథ చదివితే పిల్లలు దాని నుండి ఏదో ఒకటి నేర్చుకోవాలనే ధోరణిని పెద్దవాళ్లు, రచయితలు మార్చుకోవాలి. కథ పిల్లలకు భారం కాకూడదు. వాళ్లు హాయిగా నవ్వుకోవాలి, సంతోషించాలి. ఆ సంతోషం మరిన్ని కథలు చదివేటట్టు చేయాలి.
6. తెలుగులో పిల్లల పుస్తకాలను ప్రచురిస్తున్న మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలాంటివి?
పరిమితమైన మార్కెట్ కారణంగా బొమ్మలు వేయటం, లే-అవుట్, డిజైన్ మీద ఇంగ్లీషు, హిందీ ప్రచురణకర్తల లాగా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. తెలుగులో రంగుల బొమ్మలు పుస్తకాలు 2000, నలుపు-తెలుపు పుస్తకాలు 1000 ముద్రిస్తే, అవి 2-3 సంవత్సరాలలో అమ్ముడుపోతే చాలా త్వరగా అమ్మినట్టు. నేషనల్ బుక్ ట్రస్ట్, చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్, ప్రథమ్ బుక్స్, తులికా వంటి సంస్థలు ఇంగ్లీషు, హిందీ తోపాటు పలు భారతీయ భాషలలో పుస్తకాలు ప్రచురిస్తున్నారు. మొదటిది ప్రభుత్వ అనుబంధ సంస్థ. దానిని మినహాయించి మిగిలిన మూడు సంస్థలకూ తెలుగు పుస్తకాలు అమ్మడం కష్టంగానే ఉందని అంటున్నారు.
7. పెద్దవాళ్లు, టీచర్ల నుండి మీరు ఏం ఆశిస్తున్నారు?
పిల్లల కోసం పుస్తకాలను ప్రచురిస్తున్న మంచి పుస్తకం ఒక చిన్న సంస్థ. పిల్లలకు పుస్తకాలను పరిచయం చేయటంలో, వాళ్లకి పుస్తకాల పట్ల ప్రేమ కలిగించటంలో పుస్తకాలను ప్రచురిస్తున్న మా పని 10 శాతమే. మిగిలిన 90 శాతం పని తల్లిదండ్రులు, టీచర్లు, ఇతర సంస్థలు చెయ్యాలి. పిల్లల తోపాటు పుస్తకాలు చదవటానికి తల్లిదండ్రులు కొంత సమయం కేటాయించాలని ఇంతకు ముందు చెప్పుకున్నాం. స్కూల్లో అసెంబ్లీలోనో, లైబ్రరీ పిరియడ్ లోనో ఒక పుస్తకాన్ని టీచరు కొంత పరిచయం చేసి, మిగతా కథని చదవమని చెపితే పిల్లల్లో ఆసక్తి రేకెత్తుతుంది. పిల్లకు పుస్తకాలను చేరువ చెయ్యటానికి ఎంతో కృషి చేస్తున్న పెద్ద వాళ్లకు, టీచర్లకు అభినందనలు.
-శ్రీశాంతి మెహెర్
Updated Date - 2022-12-31T08:28:56+05:30 IST