Hyderabad Book Fair : పుస్తకాన్ని పట్టుకుని చదివే అనుభూతి వేరు..!
ABN, First Publish Date - 2022-12-28T15:48:29+05:30
తెలుగు ప్రచురణ రంగంలో డిజిటల్ ప్రింటింగ్ ను తీసుకువచ్చిందే ఛాయా.
ఛాయా తెలుగు ప్రచురణా రంగంలో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అతి కొద్ది సమయంలోనే 80 పుస్తకాలకు పైనే ప్రచురించి రచయితలకు, పాఠకులకు దగ్గరైంది. తెలుగు సాహిత్యం మీద ఛాయా మోహన్ బాబుకు ఉన్న అభిప్రాయాల గురించి, ఛాయా ప్రచురణల గురించి బుక్ ఫెయిర్ సందర్భంగా ఆంధ్రజ్యోతి వెబ్ తో జరిపిన ఆత్మీయ సంభాషణ..
1. ఛాయా ఎలా మొదలైంది?
ఛాయా పబ్లికేషన్స్ మొదలుపెట్టి సుమారు ఐదేళ్ళు కావస్తుంది. పూడూరి రాజిరెడ్డి ‘చింతకింది మల్లయ్య’ పుస్తకంతో మా మొదటి అడుగు మొదలైంది. చిన్నతనం నుంచి పుస్తకాలంటే ఉన్న ఆసక్తి, ప్రేమ వల్ల ఈ రంగం వైపు రావడం జరిగింది. అయితే బిజినెస్ పరంగా నేను కొన్నేళ్ళ పాటు పుస్తకాలకు దూరంగా ఉండక తప్పలేదు. బిజీ లైఫ్ లో ఇరుక్కుపోయి దాదాపు ఇరవై ఏళ్ళు గడిపాను. తరువాత 2005 నాటికి కాస్త వెసులుబాటు చేసుకుని మళ్ళీ సాహిత్యం, పుస్తకాల వైపు రావడం జరిగింది. ఆ సందర్భంలోనే ఖదీర్ బాబు పరిచయం అయ్యాడు. తన ‘బియాండ్ కాఫీ’ రెండవ ముద్రణ వేయడానికి తనని ఒప్పించాను. ఆ తరువాత మూడేళ్ళకు ఛాయా పూర్తిగా పబ్లికేషన్ రంగంగా ఏర్పడింది.
ఛాయా మొదలైంది కేవలం పుస్తకాల ప్రచురణ కోసమే కాదు. ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద అథారిటీగా మాట్లాడే విధంగా సభలు జరగకపోవడం అనేది లోటుగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఛాయా తరపున మీటింగ్స్ జరపాలి అనుకున్నాం. ఎవరైనా ఒక టాపిక్ అనుకోవడం, దానిమీద రచయితల ఉపన్యాసాలు నిర్వహించడం, చర్చలు జరపడం చేసాం. ఇవి చాలా సక్సెస్ అయ్యాయి. అప్పుడే బుక్ పబ్లికేషన్ కూడా మనం మొదలు పెడితే బావుంటుంది అనుకున్నాం. అలా అనుకోగానే నాకు దగ్గర మిత్రుడైన రాజిరెడ్డి పుస్తకాన్ని ఛాయా పబ్లికేషన్ లో మొదటిగా ప్రచురించాం. తరువాత ఒకటి ఒకటిగా పుస్తకాలను వేస్తూ వచ్చాం.
2. పుస్తకం వేయడానికి ప్రత్యేకంగా ఎంతవరకూ ఖర్చవుతుంది. మార్కెటింగ్ ఎలా ఉంటుంది?
మానస ఎండ్లూరి వాళ్ళ అమ్మగారి పుస్తకం వేస్తే బావుంటుంది అనుకుని వేసాం. ఖదీర్ బాబు నిర్వహిస్తున్న రైటర్స్ మీట్ లో పరిచయమైన చాలామంది రచయితలతో మాటల్లో వాళ్ళ పుస్తకాల పబ్లిషింగ్ ప్రస్తావన వచ్చింది. ఇదో సీరియస్ పనిగా కొనసాగింది. మొదలు పెట్టినప్పుడు ఐదు వందలు పుస్తకాలు అనుకోవడం దానిని వెయ్యి పుస్తకాలకు పెంచడం మళ్లీ వాటికి ప్రమోషన్ మీటింగ్స్ ఇలా అన్నింటికీ కలిపి 45 వేల వరకూ ఖర్చు ఉండేది. పుస్తకం వచ్చే సాకా దానిని మార్కెట్ చేయడానికి విశాలాంధ్రా, నవోదయా వీళ్ళ ద్వారానే డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వచ్చాం.
3. కోవిడ్ ముందు కోవిడ్ తరవాత అని చెప్పుకోవాల్సి వస్తే పుస్తకాల మార్కెటింగ్ ఎలా ఉంది?
2020 ఫిబ్రవరి ఆఖరులో ’తేరే బినా జిందగీ’ అనే హిందీ పాటల పుస్తకం వేసాం. ఆ సభ అనుకున్నదానికన్నా ఘోరంగా జరిగింది. ఆ తరువాత లాక్ డౌన్ మొదలైంది. ఇక ఆ 1000 పుస్తకాల పబ్లిషింగ్ కి 45వేల వరకూ పెట్టుబడి పెడితే ఏ పబ్లిషర్ కూడా 50 పుస్తకాలకన్నా ఎక్కువ తీసుకోవడానికి ఒప్పుకోలేదు. మాకూ గొడౌన్ లో పెట్టుకోవడం కష్టమే.. స్పేస్ సమస్య అన్నారు. ఇక నవోదయా, విశాలాంధ్రా వాళ్లకు మిగతావారికీ 400 పుస్తకాలు ఇస్తే మిగతా 600 పుస్తకాలు ఎప్పుడు అమ్ముడు పోతాయా, ఎవరు ఆర్డర్ పెడతారా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూడటం అయిపోయింది. ఎందుకంటే రాష్ట్ర విభజన పేరు చెప్పి గ్రంథాలయాలు పుస్తకాలను తీసుకోవడం ఎప్పుడో మానేసాయి. ఈమధ్య రెండేళ్ల నుంచి కొంచెం మొదలైంది. అదీ కొద్దిగానే.. మొహమాటంగా తీసుకుంటున్నారు. ఓ ఐదు, పది పుస్తకాలు అంతే. విస్తృతంగా గ్రంథాలయాలు పుస్తకాలను తీసుకోవడం అనేది పోయింది. ఈ పరిణామాల మధ్య మళ్ళీ కొత్త పుస్తకం వేయడం అంటే అది పెద్ద టాస్కే.. దీనికి తోడు కరోనా వచ్చాకా ఇక పుస్తకాలు వేయగలమా అనే డైలమా మొదలైంది. పుస్తకాల పబ్లిషింగ్ సంస్థ మొదలుపెట్టి ఒక ఆఫీస్, బాయ్ ఇలా చాలా ఏర్పాట్లతో ఒక్కరే వాళ్లకు వాళ్లుగా స్వతంత్రంగా మొదలు పెట్టడం అనేది సాధ్యపడని పని. ఎవరూ మనీ పెట్టకుండా, ఏ సపోర్ట్ లేకుండా నడిపించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని.
4. పుస్తకాల ప్రింటింగ్, మార్కెటింగ్ విషయంలో మీరు ఫాలో అయిన కొత్త మార్గాలేమిటి?
కరోనా సమయంలో మా ఆలోచన మారింది. అసలు ఎడాదికి ఎన్ని పుస్తకాలు వేయగలము అని ఆలోచిస్తే మహా అయితే ఒకటి రెండు పుస్తకాలు వేయగలం అంతే.. అప్పుడే ఆలోచన వచ్చింది. అసలు డిమాండ్ ఉండి వెంటనే అమ్ముడు పోయే పుస్తకాలను రెండు మూడు వందల కాపీలు వేసుకుంటే సరిపోతుంది కదా అని. అక్కడి నుంచి పెద్ద రిస్క్ తీసుకోకుండా మార్కెట్ ఉన్న పుస్తకాలను డిజిటల్ ప్రింటింగ్ ద్వారా తక్కువ మొత్తంలో వేస్తూ వస్తున్నాం. ఈ డిజిటల్ ప్రింటింగ్ వచ్చాకా బుక్స్ అమ్ముడుపోతున్నాయి అనగానే మళ్లీ వందా లేదా రెండు వందలు వేయించుకునే వీలు ఉంది. ఈ పరిస్థితుల్లో పోస్ట్ కోవిడ్ తరవాత అంతకమునుపు పది పుస్తకాలు వేస్తే, పోస్ట్ కోవిడ్ సమయంలో కాస్త తేరుకున్నాకా 70 పుస్తకాలకు పైనే ముద్రించాం. కేవలం రెండేళ్లలోనే 70 పుస్తకాలను వేయగలిగాం అంటే అది కేవలం డిజిటల్ ప్రింటింగ్ వల్లనే సాధ్యమైంది. ఇప్పటి వరకూ 87 పుస్తకాలను వేసాం. ఈ ఎడాది చివరికి 90కి చేరుకుంటాం.
5. పేపర్, క్వాలిటీ విషయంలో తీసుకున్న ప్రత్యేకమైన శ్రద్ధ ఏమైనా ఉందా?
మొదటిసారి తెలుగు సాహిత్యంలో చాలా తేలికైన పేపర్ ని వాడాం. అంతే కాకుండా తక్కువ రేటుకి, తక్కువ ప్రింట్ ఆర్డర్ వెరసి, మంచి క్వాలిటీ బుక్ ఇవ్వాలనుకున్నాం. ఈ విషయంలో మేం సక్సస్ అయ్యాం. ఛాయా పబ్లికేషన్ సంస్థ విషయంలో ఇదో మలుపు.
ఒకప్పుడు కవిత్వ పుస్తకాలు ఎవరు కొంటారు అనే మాట ఉండేది. మా ఛాయా ఆ విషయంలో సక్సస్ అయింది. మంచి కవిత్వ పుస్తకాలను వేస్తూ వస్తున్నాం. కథలు, కవిత్వంతో పాటు నవలలు రావడం లేదనే మాటను చెరిపేస్తూ అనువాద నవలలను వేయడం మొదలు పెట్టాము. కన్నడ నుంచి మంచి అనువాదాలను తీసుకువస్తున్నాం. వ్యాసాలు కూడా తీసుకు రావాలనే ప్రయత్నం చేస్తున్నాం. సామాజికంగా జరిగే ఇతరత్రా విషయాలన్నింటినీ కూడా పుస్తకాలుగా తేవాలనే ప్రయత్నంలో తెచ్చినవే ‘ఏదిసత్యం’, ‘అంబేద్కర్ ఏమన్నాడంటే’, ‘చుక్కలు చూద్దాం రండి’, ‘దార్శిక దిగ్గజాలు’… ఈ పుస్తకాలన్నీ ఈ ప్రయత్నం నుంచి వచ్చినవే. అట్టడుగు వర్గాల వాయిస్ ని వినిపించాలన్నది ఛాయా ముఖ్యమైన మోటివ్. క్యాలిటీ విషయంలో కాస్త రాజీపడినా కంటెంట్ బావుంటే వారిని తీసుకురావాలని అనుకున్నాం. ఎంత గొప్ప కంటెంట్ అయినా పాత పుస్తకాలు రీప్రింట్ వేయకూడదని పెట్టుకున్నాం. దీనివల్ల మార్జినలైజ్డ్ వర్గాన్ని, కొత్తగా రాసేవారిని ఎంకరేజ్ చేసే వీలుంటుంది. కొత్తపుస్తకాలు, కొత్త ఒరవడి అనేది మనం పాఠకులలోకి తీసుకువెళ్లలేకపోతున్నాం, ఎంతసేపూ పాత తరాన్నే పట్టుకువేళ్లాడుతున్నాం అనిపించింది. అది సాధ్యపడాలంటే ఖచ్చితంగా రీప్రింట్స్ వేయకూడదు. యువతరాన్ని ప్రోత్సహించాలి, వాళ్లే ఫ్యూచర్ అనేది మేం గట్టిగా నమ్మాం.
6. పోస్ట్ కోవిడ్ తర్వాత ఎదుర్కున్న మార్కెటింగ్ సమస్యల గురించి చెప్పండి?
ఒకప్పటి సాంఘిక నేపథ్యం వల్ల ఇప్పటికీ మేజర్ పుస్తక సంస్థలు రెండూ కూడా కమ్యూనిస్ట్ పార్టీకి చెందినవే, వాళ్ళ నుంచి డబ్బులు రావడంలేదు కాబట్టి పుస్తకాలు ఇవ్వడం మానుకున్నాం. డబ్బులు వచ్చే సంస్థలకే కొద్ది మొత్తంగా ఇస్తూ వస్తున్నాం. కోవిడ్ తర్వాత సొంత డబ్బు పెట్టుబడిగా పెట్టింది లేదు. ఛాయా నుంచి వచ్చిన డబ్బుల్నే మళ్లీ తిరిగి పెట్టుబడి పెడుతూ వస్తున్నాం. పుస్తకాలను తగ్గించి వేయడం వల్ల చోటు సమస్య ఉండదు. 200 పుస్తకాలు వేస్తే 100 డిస్ట్రిబ్యూషన్ (Distribution) కి వెళిపోతాయి. మిగతావి ఆన్లైన్ లో అమ్మడం, అంతే రచయితకు పుస్తకం వేయడంలో లాభం ఎలా ఉంటుందంటే పుస్తకం వేయడానికి 200 వందల కాపీలకు ముందు పెట్టుబడి పెట్టుకుంటే మళ్లీ మళ్లీ వేసినపుడు దాదాపు 800 కాపీల వరకూ మీరు డబ్బులు పెట్టుకోనవసరం లేదని చెపుతున్నాం. డీటిపి వర్క్ చేయించి ఇస్తే పబ్లిషింగ్ విషయం మేం చూసుకుంటాం. కవర్, లేఅవుట్ చూసుకుంటే తర్వాత బాధ్యతంతా మాదే. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆ 200 పుస్తకాలు అమ్ముడుపోని సందర్భాలను కూడా చూసాం. అప్పుడు అక్కడితోనే వాటిని వేయడం ఆపేస్తాం. చదివేవాళ్ళ కోసం, చదవాల్సిన వాళ్ల కోసం మా పుస్తకాలను వాళ్ల వరకూ తీసుకుపోవడానికి సోషల్ మాధ్యమాల ద్వారా ఇంకా చర్యలు తీసుకోవలసి ఉంది. ఓ సైట్ ను పెట్టడం, ప్రచారం చేయడం వంటివి ఇంకా చేయాల్సి ఉంది. ఇప్పటి వరకూ ఛాయా విజయానికి ప్రధాన కారణం ఒకరి నుంచి ఒకరికి మాట ద్వారా ప్రచారమే.
7. ఈ బుక్స్ వల్ల ప్రింట్ పుస్తకాల డిమాండ్ తగ్గుతుందా?
ఎంత ఆన్లైన్ షాపింగ్స్ వచ్చినా చేతితో రాసి పుస్తకాన్ని పట్టుకుని చదివే అనుభూతి వేరు. దానిని చాలావరకూ అంతా ఇష్టపడతారు. కొత్త పోకడలలో కాస్త పుస్తకం వెనుకబడినట్టు కనిపించినా పుస్తకానికి ఉన్న స్థానం ఎప్పటికీ అలానే ఉంటుంది. తెలుగు ప్రచురణ రంగంలో డిజిటల్ ప్రింటింగ్ ను తీసుకువచ్చిందే ఛాయా. అంతక మునుపు ఇది లేదు. మేం డిజిటల్ ప్రింటింగ్ తెచ్చిన తరువాత కొందరు ఆ ప్రింట్ కొద్దిరోజులకు పోతుందని, పేపర్ చిరిగిపోతుందని అనేవారు. అవన్నీ ఒట్టి వదంతులు మాత్రమే. ఇప్పటికి ఆ వ్యతిరేకత కూడా పోయిందనే అనుకుంటాను. డిజిటల్ ప్రింటింగ్ నే చాలావరకూ అంతా ఫాలో అవుతున్నారు.
-శ్రీశాంతి మెహెర్.
Updated Date - 2022-12-28T16:29:29+05:30 IST