Hyderabad Book Fair : ప్రపంచ వ్యాప్తంగా ఆడియోబుక్స్ పాడ్‌కాస్ట్ లకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది..!
ABN, First Publish Date - 2022-12-29T14:56:38+05:30
ఇప్పటికే 600 వందలకు పైగా జీవితకాల సభ్యత్వం తీసుకున్నారు.
100ల కొద్దీ శీర్షికలు, 1000 గంటల ఆడియో కాంటెంట్ తో పుస్తకాన్ని చదవలేని వారికి, శ్రవణానందభరితంగా కథను వినిపించే యాప్ దాసుభాషితం, ఇది తెలుగులో అతి పెద్ద శ్రవణ పుస్తక వేదిక. ఇక్కడ పుస్తకాలు కొన్నా, కొనకపోయినా బోళ్డన్ని కథలు, కబుర్లూ పోగు చేసుకోవచ్చు, ఇంకా ఎందరినో కలుసుకుని, ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో 'దాసుభాషితం' జీవితకాల చందాను అతి తక్కువకే ఇస్తున్నారు. వారి ప్రయత్నం పుస్తకాలను, తెలుగు సాహిత్యాన్ని, పుస్తక ప్రియులకు అందించాలనే ప్రయత్నాన్ని బుక్ ఫెయిర్ సందర్భంగా దాసుభాషితం సీఈవో కిరణ్ కుమార్ ఆంధ్రజ్యోతి వెబ్ తో పంచుకున్నారు.
1. దాసుభాషితం యాప్ గురించి వివరంగా చెప్పండి.
దాసుభాషితం మొదటి, అతిపెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల వేదిక. మొబైల్ యాప్ ద్వారా నవలలు, కథలు, కావ్యాలు, కవిత్వం, ఆధ్యాత్మిక విభాగాల్లో వందల కొలదీ శ్రవణ శీర్షికలను అందిస్తోంది. శ్రీ కొండూరు తులసీదాస్ గారి ఉద్యోగ విరమణ తర్వాత హాబీగా మొదలై, 2017 లో సంస్థ అయి, అనతి కాలంలోనే వినియోగదారుల అభిమానం పొందింది. ఆ అభిమానం ఎంతంటే, యాప్ లో సాంకేతిక సమస్యలున్నా కూడా ప్లే స్టోర్, యాప్ స్టోర్ లలో అత్యధిక రేటింగ్ పొందేంత.
2. చాలామంది భౌతికంగా పుస్తకాన్ని చేతిలోకి తీసుకునే చదవాలనుకుంటారు. ఈ అనుభవాన్ని మీ యాప్ ఎంతవరకూ పూరించగలదనుకుంటున్నారు?
నిజమే. పుస్తకం చేతిలో పట్టుకుని చదవడంలో చాలా ఆనందం ఉంటుంది. అయితే శ్రవణం అసహజమూ కాదు, కొత్త అంతకన్నా కాదు. అసలు అచ్చు కన్నా ముందు నుంచి ఉన్నది శ్రవణమే. వేదాలు శృతి రూపంలోనే తర్వాతి తరాలకు అందాయి. ఇక ఆడియోబుక్స్ అనుభవం కూడా తెలుగు వారికి కొత్త కాదు. ఇదివరకు రేడియోలో "నవలా స్రవంతి" అనే కార్యక్రమానికి చాలా ప్రజాదరణ ఉండేది.
ఆధునిక జీవన సరళిలో ఒక ముఖ్యమైన లోటు ఉంది. అదే సమయాభావం. చదువుదామని ఆసక్తి ఉన్నా, తీరిక లేక చదవలేని వారు ఎందరో. ఈ రోజుల్లో ఎవరైనా తమకోసం కాస్త సమయమైనా వెచ్చించుకునే అవకాశం ప్రయాణం, వ్యాయామం, ఇంట్లో పనులు చేసుకునే సెమి-ప్రొడక్టివ్ కార్యాల్లోనే దొరుకుతుంది. ఈ సందర్భాల్లో విషయ గ్రహణకు అత్యంత అనువైన మాధ్యమం శ్రవణం. అందుకే పొద్దున్నా, సాయంత్రం పార్కులో నడుస్తూ ప్రవచనాలు వినే వారిని మనము చూస్తుంటాము. ఈ పోకడ వల్లే, ప్రపంచ వ్యాప్తంగా ఆడియోబుక్స్ పాడ్‌కాస్ట్ లకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. 2028 కల్లా, ప్రపంచ ఆడియోబుక్ మార్కెట్ 20 బిలియన్ అమెరికన్ డాలర్లు అవుతుందని ఒక అంచనా. దాసుభాషితం కూ ఆ ఆదరణ ఉండబట్టే, ఏ ప్రచారమూ లేకపోయినా కేవలం నోటి మాట ద్వారానే ఎదుగుతోంది. గమనించదగిన ఇంకొక విషయం ఏమిటంటే, పఠనాభిలాషులు, అచ్చు పుస్తకాలు, ఈబుక్స్, శ్రవణ పుస్తకాలు, ఈ మూడింటిని వారి వీలునుబట్టి వాడతారు. ఎదో ఒకటే ఎంచుకోవాలని నియమమేమి పెట్టుకోరు.
3. దాసుభాషితం గురించి పాఠకుల నుంచి స్పందన ఎలా ఉంది. రెస్పాన్స్ గురించి చెప్పండి.
మాకు తరచూ వినిపించే స్పందన తాము చదలేకపోతున్న పుస్తకాలన్నీ విని ఆనందించగలుగుతున్నాము అని. కానీ మాకొచ్చిన విశేషమైన స్పందన ఒకటి ఉంది. కరోనా మొదటి లక్డౌన్ సమయంలో యాప్ లో ఉన్న కాంటెంట్ అంతా ఉచితం చేశాము. అవి విని డిప్రెషన్ నుండి బయటకొచ్చాము అని చాలా మంది చెప్పారు. ఇది విన్న తరువాత మా దృక్పదం తీక్షణమైంది. ఎలాగంటే, దాసుభాషితం ఎపుడూ తెలుగు వారి వ్యక్తిగత, వృత్తిపర, ఆధ్యాత్మిక పురోగతికి సహకారిగానే ఉండాలని నిశ్చయించుకున్నాము. అందుకు అనుగుణంగా మా టాగ్ లైన్ ను "తెలుగు లలిత కళా వేదిక" నుండి "సమగ్ర శ్రేయస్సుకు సోపానం" గా మార్చాము. కొత్త కాంటెంట్ నిర్మాణం చేపట్టినప్పుడు, మేము వేసుకునే మౌలిక ప్రశ్న, ఇది జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అని. మా ఈ కొత్త ఒరవడిని కలుషితం చేస్తోందని, యాప్ లో ప్రకటనలను సైతం తీసివేశాము.
4. ఎటువంటి పుస్తకాలు ఈయాప్ ద్వారా వినవచ్చు.
నవలలు, కథలు, కావ్యాలు, కవిత్వం, ఆధ్యాత్మికం విభాగాల్లో దాదాపు 500 శ్రవణ శీర్షికలు యాప్ లో ఉన్నాయి. జీవనం అనే విభాగంలో చరిత్ర, వైజ్ఞానిక శాస్త్రం, సినిమా, సంగీతం, పేరెంటింగ్ సంబంధించి ఒరిజినల్ షార్ట్-ఫార్మ్ కాంటెంట్ ను అందిస్తున్నాము. రోజుకు గంట సేపు విన్నా, 10 ఏళ్ళ పాటు వినగల కాంటెంట్ యాప్ లో ఉంది.
5. ఈ కొత్త అడుగు వెనుక బలమైన కారణం ఏదైనా ఉందా..దాని గురించి చెప్పండి.
మేము స్వతహాగా పుస్తకప్రియులం. అయితే ముందుచెప్పినట్టు సమయాభావం వల్ల చదవలేకపోతున్నాము అనే భావన మాకూ ఉండేది. అదే సమయంలో ఇంగ్లీష్ కాంటెంట్ శ్రవణ రూపంలో విరివిగా లభిస్తుండడం చూసి తెలుగు సాహిత్యానికి కూడా ఈ వెసులుబాటు ఉండాలనిపించింది. అది తొలి అడుగు వేయడానికి కారణం. అయితే, ఒక పరిశీలనాత్మక జీవనానికి సాహిత్యం, బిహేవియరల్ సైన్స్, ఆధ్యాత్మికత ఎంత దోహద పడతాయో ప్రత్యక్షంగా తెలుసుకున్నాము. అందుకే, "అత్యధిక పుస్తకాలు – అతి తక్కువ ధరకు" అనే వ్యాపార సూత్రం కాకుండా, శ్రోతలు రోజులో ఒక గంట దాసుభాషితం పై వెచ్చిస్తే, ఆ గంటలో, వారి జీవితాలను శ్రేయస్కరం చేసుకునేలా మనం వారిని ఎంత ప్రభావితం చేశాము అనే కొలమానమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
6. దాసుభాషితం యాప్ తో రచయితకు ఎటువంటి సపోర్ట్ అందుతుంది.
సాహిత్యానికి మూల స్థంభం రచయిత. రచయిత బాగుంటేనే మంచి రచనలు వస్తాయి. అందుకే ముందు నుంచి మేము ఎవరూ ఇవ్వనంతగా నికర ఆదాయంలో 50% శాతం రచయితలకి ఇస్తున్నాము. రచన మాకు నచ్చితే, వారికి పైసా ఖర్చు లేకుండా మేమే ఆడియో పబ్లిష్ చేసి, యాప్ ద్వారా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము. యాప్ వినియోగదారులకు ఈమెయిల్స్, యూట్యూబ్ వీడియోలు, యాప్ నోటిఫికెషన్స్ ద్వారా రచనకు ప్రచారం కల్పిస్తాము.
ఇంత చేస్తూ కూడా, మాకే అన్ని హక్కులు ఇవ్వమని మేము పట్టుపట్టము. ఎందుకంటే, ఏ రచయితైనా కోరుకునేది తన రచనలు అత్యధిక జనులకు చేరాలని. పుస్తకాలు ఎన్ని దుకాణాలలో దొరికితే అన్ని ఎక్కువ అమ్ముడైనట్టు, ఆడియో / ఈబుక్ కూడా ఎన్ని యాప్లలో దొరికితే, రచయితకు అంత మేలు జరుగుతుంది. అందుకనే, మాతో సహా, ఒక్కరికే అన్నీ హక్కులు ఇవ్వద్దని మేము రచయితలకు చెప్తూ ఉంటాము.
7. జీవిత కాలం పాటు పుస్తకాలు వినే వీలును అతి తక్కువ ధరకే ఇస్తున్నారు ఇది నష్టం కాదా?
ఎల్లప్పుడూ ఇస్తే నష్టమే. కానీ మేము ఒక ప్రత్యేక అవసరానికి ఈ విధంగా ప్రస్తుతం యాప్ లో ఉన్న కాంటెంటే కాకుండా, రాబోయే కాంటెంట్ నూ కేవలం ₹ 6000 వేలకే (టాక్స్ అదనం) జీవిత కాలం వినే వీలును కల్పిస్తున్నాము. ఆ అవసరం యాప్ ను తిరిగి నిర్మించడం. ఇపుడున్న యాప్ ఐదేళ్ల క్రితం నిర్మితమైంది. బగ్స్ ఉన్నాయి. వినియోగ అనుభూతిని మెరుగు పరచాల్సిన అవసరం ఉంది. వీటన్నింటికి ఎంత ఖర్చవుతుందో లెక్కేసుకుని కేవలం ఒక 1000 మందికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నాము.
నైతికత, నిబద్ధత దాసుభాషితం విలువల్లో ముఖ్యమైనవి. పారదర్శకత కోసం పబ్లిక్కుగా వనరులు సేకరించాలని ఒక క్రౌడ్ ఫండింగ్ కాంపెయిన్ మొదలుపెట్టాము. అందులో దాసుభాషితం ప్రస్తుతం ఉన్న పరిస్థితిని నిజాయితీగా వీడియో లో చెప్పాము. దాసుభాషితం అభిమానులు ఇప్పటికే 600 వందలకు పైగా జీవితకాల సభ్యత్వం తీసుకున్నారు. 1000 కాగానే ఆపేస్తాము. ఆఫర్ పొందడానికి www.dasubhashitam.com కు వెళ్లి ఆఫర్ బ్యానర్ పై టాప్ చేయండి.
8. మార్కెట్ లోకి చాలా యాప్స్ పుట్టుకొస్తున్నాయి. వీటితో పోటీ ఎలా ఉంది.
పోటీ మంచిదే. పోటీ నాణ్యతను పెంచుతుంది. అందరూ కలిసి ఈ డిజిటల్ ఫార్మట్స్ పై అవగాహనను పెంచుతారు. దానివల్ల సమాజంలో పఠనాభిలాష పెరుగి మార్కెట్ విస్తరిస్తుంది. అపుడు సంస్థాగత పెట్టుబడులు వస్తాయి. తెలుగు ఆధారిత ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. అందరి ప్రయత్నాలు ఫలిస్తే, పది కోట్ల మంది తెలుగువారికి, తెలుగు భాషకు మేలు జరుగుతుంది.
9. మీరు వాయిస్ కళాకారులను ఎలా ఎంచుకుంటారు?
శ్రోతల్లో చాలా మంది చదవడానికి ఆసక్తి చూపుతారు. ఆసక్తి ఉన్నవారిని మొదట ఒక హాస్య కథ ఏదైనా చదివి పంపమంటాము. స్పష్టంగా, దోషాలు లేకుండా, భావ యుక్తంగా చదవగలిగితే వారికి, కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చిన వారికి హోమ్ స్టూడియో ఎలా ఏర్పాటు చేసుకోవాలో చెప్తాము. ఆ తర్వాత మైక్రోఫోన్ సెటప్, రికార్డింగ్, ఎడిటింగ్ లలో శిక్షణ ఇస్తాము. ఇపుడు యాప్ లో 10 పైగా వాయిస్ లను వినవచ్చు. ఆసక్తి ఉన్నవారు artist@dasubhashitam.com కు తమ వాయిస్ నమూనాలను పంపవచ్చు.
Updated Date - 2022-12-29T14:56:42+05:30 IST