Hyderabad Book Fair : రచయిత తన జేబునుంచి పెట్టుకోవాల్సిందే..!
ABN, First Publish Date - 2022-12-29T10:46:56+05:30
500 కాపీలు అమ్మితే 8,500 వస్తుంది.
కవి, రచయిత, తెలుగు అంతర్జాల మాసపత్రిక 'వాకిలి'కి రవి వీరెల్లి ప్రధాన సంపాదకులుగా ఉండి నడిపించారు. పుస్తక ప్రచురణలో రచయితలు, పబ్లికేషన్స్ సంస్థలు పడుతున్న అవస్థలు, మార్కెటింగ్ విధానం, లాభనష్టాల్లో పబ్లిషర్స్ కి ఇటు రచయితకి మధ్య పుస్తకం ఎటువంటి స్థితిలో ఉందనే విషయాన్ని బుక్ ఫెయిర్ సందర్భంగా ఆంధ్రజ్యోతి వెబ్ తో రవి వీరెల్లి జరిపిన ఆత్మీయ సంభాషణ.
1. ప్రింట్ ఆన్ డిమాండ్ పేరిట ప్రచురణ కర్తలకు 100/200 కాపీలు ప్రచురించే వెసులుబాటు వచ్చింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమేనా. మీరెలా తీసుకుంటున్నారు దీనిని?
వాకిలి మొట్టమొదటి పుస్తకం ‘Wakes on the Horizon’ అమెరికాలో అమెజాన్ ప్రింట్ ఆన్ డిమాండ్ ద్వారానే ప్రచురించాం. అమజాన్ లాంటి పెద్ద సంస్థ ఇండియాలో ప్రింట్ ఆన్ డిమాండ్ (KDP) ద్వారా తెలుగు పుస్తకాలను ప్రచురించకపోవడం తెలుగు సెల్ఫ్-పబ్లిషింగ్ వ్యవస్థకి పెద్ద లోటు. అయితే KDP కి ప్రత్యామ్నాయంగా తెలుగులో కూడా డిజిటల్ ప్రింటింగ్ చేసుకోవొచ్చు అని, పూణేలో ఉన్న ఒక డిజిటల్ ప్రింటర్ ని నాకు మొదట పరిచయం చేసింది ఛాయా మోహన్ గారే. వాకిలి, ఛాయా సంయుక్తంగా ప్రచురించిన హెమింగ్వే old man and the sea నవలకి తెలుగు అనువాదం డిజిటల్ ప్రింటింగ్ ద్వారానే బయటికొచ్చింది. ఆ తర్వాత ఆటా బహుమతి నవలలు కూడా.
డిజిటల్ ప్రింటింగ్ లో ఉన్న ఒక గొప్ప వెసులుబాటు ఏంటంటే, ఎన్ని కాపీలు అమ్ముకోగలమనిపిస్తే అన్నే కాపీలను ప్రింట్ చేసుకోవొచ్చు. 50 కాపీలు ప్రింట్ చేయించినా 500 కాపీలు ప్రింట్ చేయించినా ధర ఒకేరకంగా ఉంటుంది. వంద పేజీల పుస్తకం డిజిటల్ ప్రింట్ చేయడానికి సుమారు 35 రూపాయల నుండి 40 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. బుక్ క్వాలిటి కూడా బావుంటుంది.
2. సెల్ఫ్-పబ్లిషర్, కమర్షియల్ పబ్లిషర్ ఏది లాభాన్నితెస్తుంది? ఎన్ని కాపీల వరకూ వేయచ్చు?
ఆఫ్ సెట్ ప్రింటింగ్ అయితే కాపీలు పెరుగుతున్న కొద్ది ప్రింటింగ్ కి అయ్యే ఖర్చు తగ్గుతుంది. కానీ తక్కువ కాపీలు ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఆఫ్ సెట్ ప్రింటింగ్ గిట్టుబాటు కాదు. ఒకేసారి నాలుగైదు వందలకంటే ఎక్కువ కాపీలు వేయాలనుకుంటేనే ఆఫ్ సెట్ ప్రింటింగ్ చవక అవుతుంది. కానీ ప్రింట్ చేసిన పుస్తకాలన్నీ దాచిపెట్టుకోడానికి ఎక్కువ చోటు కావాల్సివుంటుంది. పాఠకులు ఒక పుస్తకాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీనపుడు, పుస్తకం ఎన్ని కాపీలు అమ్ముడుపోతాయో ఊహించలేము. ఇలాంటప్పుడు వంద/రెండొందల కాపీలు POD ద్వారా ప్రింట్ వేయించుకుంటే నష్టం సంభవించే అవకాశం తక్కువ. తక్కువ కాపీలే కాబట్టి కాపీలు స్టోర్ చేసుకోడానికి పెద్ద స్పేస్ కూడా అవసరంవుండదు. పెట్టే ఖర్చు కూడా తక్కువే కాబట్టి పుస్తకాలు అమ్ముడుపోకపోయినా పెద్ద నష్టం ఉండదు.
అయితే లాభాల విషయానికొస్తే సెల్ఫ్-పబ్లిషర్ కైనా, కమర్షియల్ పబ్లిషర్ కైనా ఒక break-even point ఉంటుంది. ఒక పుస్తకాన్ని రచయిత తన స్వంతఖర్చులతో సెల్ఫ్-పబ్లిషింగ్ చేసుకున్నప్పుడు, రచయిత రాయడానికి పడ్డ కష్టం ఊరికే పోయినా, కనీసం డబ్బు నష్టం రాకూడదనుకుంటే, ఆ పుస్తకం కనీసం 600 కాపీలయినా అమ్ముడుపోవాలి.
POD పద్దతిలో ప్రింట్ చేయించిన పుస్తకాలకు లాభాలు, cost break-even ఎలా ఉంటుందో ఈ పట్టిక చూస్తే తెలుస్తుంది:
ఉదా: 200 పేజీల పుస్తకం వేయడానికి డిజిటల్ ప్రింటింగ్ కి అయ్యే ఖర్చు ఒక కాపీకి సుమారు 70 నుండి 80 దాకా అవుతుంది. టైప్ సెట్టింగ్ కి, కవర్ పేజీ ఆర్ట్ కి కలిపి ఒక 10,000 అవుతుందనుకుందాం. పుస్తకం వెల 190 అనుకుందాం. పుస్తకం అమ్మాకా Distributor/Retail Bookstore వాళ్ళు రచయితకు 50% రాయల్టీ ఇస్తున్నారనుకుందాం. అంటే 190 రూపాయలకి ఒక కాపీ అమ్మితే రచయితకు (190 ÷ 2)-78 = 17 మాత్రమే అందుతుంది. 500 కాపీలు అమ్మితే 8,500 వస్తుంది. అంటే ఇంకా రచయిత తన జేబునుంచి 1,500 వరకు పెట్టుకోవాల్సివస్తుంది.
సెల్ఫ్-పబ్లిషర్ కి ఖర్చులున్నట్టే రిటైల్ స్టోర్ కు కూడా ఆ పుస్తకం అమ్మిపెట్టడానికి ఖర్చులవుతాయి. వాళ్లకూ ఒక cost break-even ఉంటుంది. POD పద్దతిలో పుస్తకాలు వేసుకుంటే అటు రచయితలు గానీ ఇటు రిటైల్ బుక్ షాప్ వాళ్ళు గానీ నష్టపోయే అవకాశం తక్కువ.
3. పుస్తకాల విషయంలో అమ్మకాలు కరోనా తరువాత ఎలా ఉన్నాయి?
కరోనా సమయంలో పూర్తిగా ఆన్లైన్ సేల్స్ మీదే ఆధారపడాల్సి వచ్చింది. ఆ సమయంలో సాహిత్య సమావేశాలు, బుక్ ఫెయిర్ లు కూడా జరగలేదు కాబట్టి, పుస్తకాల అమ్మకాలు తక్కువే జరిగాయి అని చెప్పాలి. కరోనా తరవాత మళ్ళీ ఇప్పుడిప్పుడే అమ్మకాలు పెరుగుతున్నాయి అనుకుంటున్నాను.
4. కంప్వ్యూటర్స్, ట్యాబ్స్, మొబైల్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాకా పుస్తకాలు, ముఖ్యంగా తెలుగు చదివేవారి సంఖ్య ఎలా ఉంది?
తెలుగు చదివే వారు తగ్గుతున్నారని statistics కూడా చెప్తున్నాయి. కంప్వ్యూటర్స్, ట్యాబ్స్, మొబైల్ ఫోన్స్ వచ్చాక సినిమాలు, వీడియో గేమ్స్, ఇంకా సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన ఎన్నో ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు డిజిటల్ బుక్ ప్లాట్ ఫామ్స్ ద్వారా తెలుగు పుస్తకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ బుక్ రీడర్స్ కూడా పెరిగారు. కానీ ప్రింట్ పుస్తకంలో ఉన్న కంఫర్ట్ వల్ల ఇంకా చాలా మంది ప్రింట్ పుస్తకాలు చదవడానికే ఇష్టపడుతున్నారు అనుకుంటున్నాను.
-శ్రీశాంతి మెహెర్.
Updated Date - 2022-12-29T20:39:51+05:30 IST