Hyderabad Book Fair : ప్రింట్ ఆన్ డిమాండ్ లేకుంటే మా సంస్థ మొదలయ్యేదే కాదు..!
ABN, First Publish Date - 2022-12-27T08:39:12+05:30
తెలుగులో నాన్-ఫిక్షన్కు పెద్ద లోటు ఉంది.
సాదత్ హసన్ మంటో రాసిన కథలను ‘సియా హాషియే, విభజననాటి నెత్తుటి గాయాలు’ పేరిట పూర్ణిమ తమ్మిరెడ్డి తెలుగులోకి అనువదించి ప్రచురించారు. కొత్తతరం రచయిత్రులలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని అందుకున్న పూర్ణిమ, ఈమధ్యకాలంలో ప్రచురణ రంగంలోనూ అడుగుపెట్టారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సందర్భంగా ఆంధ్రజ్యోతి వెబ్ జరిపిన ఆత్మీయ పలకరింపు..
1. తెలుగు పుస్తకాలు చదివే ఆసక్తి తక్కువైపోతుందా? లేదా చదవాలన్న ఆత్రం ఉన్నవారి దగ్గరకు మనం పుస్తకాలు తీసుకెళ్ళలేకపోతున్నామా?
ప్రస్తుత తెలుగు సాహిత్య పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని లెక్కలు నేర్చుకోవాలి. అంకెలు, గణాంకాలతో కుస్తీ పడ్డానికి సుముఖంగా ఉండాలి. అప్పుడే ఈ ప్రశ్నకు మనకి మెరుగైన సమాధానాలు దొరుకుతాయి. ఇంతకు ముందు, ఒక ఏడాదిలో ఎన్ని పుస్తకాలు వచ్చేవి? ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి? అప్పటికి ఇప్పటికి జనాభా ఎంత పెరిగింది? అక్షరాస్యత శాతం ఎంత పెరిగింది? సగటు తెలుగువాళ్ళ దగ్గర పుస్తకాలకు సంకోచించకుండా పెట్టే డబ్బు (నా చిన్నతనంలో ఒక పుస్తకం కొనుక్కునేటన్ని డబ్బులు మాకు లేవు) పెరిగిందా? పుస్తకాలను చదువుకునే తీరుబడి ఎంతగా పెరిగాయి? నిజంగానే నా దగ్గర ఈ ప్రశ్నలకు జవాబులు లేవు. అందుకే నేను కూడా నా చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తూ, నిరూపించలేని కొన్ని మాటలే చెప్పగలను: మన జనాభాకి, దేశంలోనే మూడో అతి పెద్ద భాషకి, వేయేళ్ళ చరిత్ర ఉన్న సాహిత్యానికి, మన అక్షరాస్యత శాతానికి ఇంకా చాలా పుస్తకాలు కావాలి. రావాలి. క్వాంటిటీ పరంగా, క్వాలిటీ పరంగా ఆ సంఖ్య పెరగాలి.
ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు పుస్తకాలు అచ్చువేయడంలోనూ, పంపిణి చేయడంలోనూ వెసులుబాట్లు ఎక్కువయ్యాయి. ప్రింట్ ఆన్ డిమాండ్ లేకపోయుంటే ఎలమి మొదలుపెట్టేవాళ్ళం కాము. సోషల్ మీడియా లేకపోయుంటే మాలాంటి చిన్న సంస్థ మూడు నెలల్లో మూడు, నాలుగొందల కాపీలు అమ్మగలిగేది కాదు. అన్నింటికన్నా ముఖ్యం ఇప్పుడు రాయడం/ఎడిటింగ్ ఇవ్వన్నీ టెక్నాలజీ వల్ల తేలికవుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే మన పుస్తకాల సంఖ్య పెరగడంలో వింత లేదు.
2. ఇంగ్లీష్ అనువాదాలు తెలుగు పుస్తకాలకు ఉన్న చోటును ఆక్రమిస్తున్నాయంటారా?
ఇది కొంచెం తిరకాసైన ప్రశ్నే. దీన్ని అర్థం చేసుకోడానికి ఒక పోలిక (analogy) తీసుకుందాం.
ఏ ప్రచురణ సంస్థకైనా వనరులు (డబ్బు, సమయం వగైరా) అపరిమితంగా ఉండవు. అందుకని ఎన్ని పుస్తకాలు, ఏ రకాల పుస్తకాలు తీసుకురావాలన్నదాంట్లో కొన్ని పరిమితులు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే, ఓ రకంగా మ్యూజికల్ చైర్స్ ఆడాలి. అందులో మన పుస్తకాలా? మన భాషలో వేరేవాళ్ళ పుస్తకాలా? అన్న ఆట నడిచాక, ఏదో ఒకటే గెలుస్తుంది. ఒకటే కుర్చీ ఉంటుంది కాబట్టి.
కానీ, తెలుగు ప్రచురణ సంస్థలన్నింటిని సమూహంగా చూస్తే, కుర్చీలకేం కొదవుండదు కదా? కొందరు అనువాదాలను గెలిపిస్తే, మరికొందరు తెలుగులో నేరుగా వస్తున్న రచనలకు పెద్దపీట వేస్తారు. అప్పుడు ఉన్న కాస్త స్థలాన్ని ఒకటే ఆక్రమించుకోగలదు అన్నట్టుగా ఆలోచించక్కర్లేదు. అవ్వా ఉంటుంది, బువ్వా ఉంటుంది.
తెలుగులో అనువాదాలు వీలైనన్ని రావాలనే అంటాను నేను. ఎన్ని వేర్వేరు అంశాలపై, ఎన్ని వేర్వేరు భాషల నుంచి మనకి పుస్తకాలు అనువాదంలోకి వస్తే అంతటి వైవిధ్యమైన రచనలూ మనమూ చేయగలుగుతాం. ముఖ్యంగా, తెలుగులో నాన్-ఫిక్షన్కు పెద్ద లోటు ఉంది. దాన్ని అనువాదాలే పూరించగలవు.
3. మార్కెట్ లేని పుస్తకాల ముద్రణ తలెకెత్తుకున్నామని బాధపడిన సంధర్భాలున్నాయా?
పుస్తకాలు ముద్రించడంతో పని అవ్వదు. వాటిని అమ్మగలగాలి కూడా. ఆ విషయంలో జెండర్తో సంబంధం లేని సమస్యలు, సవాళ్ళు ఏన్నో ఉన్నాయి తెలుగులో. ముఖ్యంగా, మనకు డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ లేరు. ఉన్నవాళ్ళల్లో కూడా నిజాయితీగా అమ్మకాలు చూపించి డబ్బులు ఇచ్చేవారు ఒకరో ఇద్దరో - అంతే! ఇంకోటి, మనకి తెలుగు పుస్తకాల షాపులు కూడా పెద్దగా లేవు. చిన్న టౌనుల్లో, ఊర్లలల్లో ఉండేవారికి పుస్తకాలు అందుబాటులో ఉండడం లేవు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ-కామెర్స్ సైట్లు, సోషల్ మీడియా వల్ల పుస్తకాలు అమ్మే వీలు పెరిగిందనుకున్నా అసలు ఫలానా పుస్తకం వచ్చిందని సోషల్ మీడియాలో లేని పాఠకులకు తెలిసే అవకాశాలే తక్కువ. మన పత్రికల్లో సాహిత్యానికి సంబంధించిన పేజీలు ఆగిపోతున్నాయి, లేదా కుంచించుకుపోతున్నాయి. ఎవరూ చెప్పకపోతే పుస్తకాలు వచ్చాయని పాఠకులకు ఎలా తెలుస్తుంది? ఇదంతా ఒక చెయిన్ ప్రాబ్లెమ్.
విక్రయాల విషయంలో ప్రత్యేకించి స్త్రీగా నేనింకా ఏ సమస్యలూ ఎదుర్కోలేదు ప్రస్తుతానికి. మేం ఇప్పటికి రెండు పుస్తకాలు వేశాం, వాటి రిటెయిల్ సేల్స్ సంగతి విషయంలో నేను పాఠకుల నుంచి ఆర్డర్స్ తీసుకుంటాను. ఇంకో పార్ట్నర్, రోహిత్ పాకింగ్, పోస్టింగ్ చూసుకుంటున్నారు.
4. మగవారితో పోల్చితే ఈ పుస్తకప్రచురణ రంగంలో కొనసాగడం అనేది కత్తిమీద సాములా అనిపించిన సందర్భలున్నాయా?
పుస్తకప్రచురణ రంగమనే కాదు, ఆడవారిగా ఏ రంగంలో రాణించాలన్నా కత్తి మీద సామే. దానికి తోడు నాయకత్వం వహించాలంటే ఇంకా కష్టం. తెలుగు ప్రచురణ రంగం కూడా ఆ తానులో ముక్కే కాబట్టి ఇక్కడా సవాళ్ళున్నాయి.
ఒక సంస్థను నడపడమంటే ఒక బిడ్డను (లేదా పిల్లినో, కుక్కనో) సాకినట్టే. మురిసిపోయి ముద్దు చేసే క్షణాలెన్ని ఉంటాయో, విసుగు విరక్తి వచ్చేవి కూడా అంతే ఉంటాయి. ఒకరి కింద పనిజేసేటప్పుడు వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తాం. మనదే అయినప్పుడు సవాలక్ష అనుమానాలు, డైలమాలు. ఆ రోజూవారి చర్చల్లో ఎంత సమన్వయం పాటించినా ఏదో క్షణాన చిరాకు బయటపడుతుంది. మగవారి మధ్యన ఇలా జరిగితే అసలు విషయమే కాదన్నట్టు వ్యవహరిస్తారు. కానీ ఒక ఆడమనిషి ఈక్వేషన్లో ఉన్నప్పుడు చిన్న విసుగు కూడా గయ్యాళితనంగా, చిన్న మాట కూడా అవమానంగా అనిపిస్తాయి. అలా అని ఇంక్కొంచెం సున్నితంగా, మెల్లిగా వ్యవహరిస్తే మెత్తగా ఉన్నాం కదా అని మొత్తుతారు. ఎలమి ఇప్పటి వరకూ పనిజేసినవారందరిలో (బుక్మేకింగ్, ప్రింటర్, లాయర్స్, సీ.ఏ) నేను కాకుండా ఇంకొక్కరు మాత్రమే ఆడమనిషి తారసపడ్డారు. మిగితా అందరూ మగవాళ్ళే!
వీటన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సంస్థ కార్యకలాపాలు చూసుకోవడం, నాణ్యమైన పుస్తకాలు తీసుకురావడం కొండను తలకెత్తుకోవడం లాంటిదే!
5. ఇన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ పుస్తకాలను మార్కెట్ లోకి తెస్తుంటే వాటిని చదివేవారు కొనేవారు, చదివేవారు తగ్గడం ఎలా అనిపిస్తుంది.
నిజానికి, ఎలమి మొదటి పుస్తకం వచ్చేసరికి నా మనఃస్థితి ఇలానే ఉంది. “ఎందుకు నేనీ పని నెత్తినేసుకున్నాను? నావి ఒకటో రెండో పుస్తకాలు సెల్ఫ్ పబ్లిషింగ్ చేసుకుంటే అయిపోయేది కదా? కనీసం మూడొందల కాపీలు అమ్మగలమో లేమో అన్న నమ్మకం లేనప్పుడు ఎందుకీ తతంగమంతా?” ఇలాంటి ప్రశ్నలే చుట్టుముట్టాయి.
కానీ, ఎలమి ప్రకటించిన దగ్గరనుంచి, ఇప్పటికి తీసుకొచ్చిన రెండు పుస్తకాలకు వచ్చిన ఆదరణ చూశాక నా అనుమానాలు మాయమైపోయాయి. ఎలా అయినా ఇది చేయాలన్న సంకల్పం మరింత బలపడింది. పాఠకులు లేరు అని మనం అనుకుంటాం. కానీ, మంటో పుస్తకం గురించి ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూ చదివి 94 ఏళ్ళ ఆవిడ పుస్తకం వివరాలు కనుక్కున్నారు. కొండ దిగి, ఐదారు కిలోమీటర్ల దూరంలోని పోస్టాఫీస్ నుంచి పుస్తకాలు పట్టుకెళ్ళాల్సినవాళ్ళు కూడా ఆర్డర్లు పెడుతున్నారు. పోలీస్ ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ పోస్టుకు పరీక్షలు రాసేవారి వరకూ మా పుస్తకాలు కొన్నారు. వీళ్ళందరి సంఖ్య ఎక్కువ, తక్కువ, అది లాభాల్లోకి తీసుకెళ్తుందా, నష్టాల్లోకి తోస్తుందా అన్నది ప్రస్తుతం నాకనవసరం. తెలుగు అక్షరాన్ని అక్కున చేర్చుకునే ఈ కొద్ది మందికైనా మంచి సాహిత్యాన్ని అందివ్వగలిగితే చాలు.
దానితో పాటు, నాకే బోలెడంత మంది రచయిత-దోస్తులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అధ్వానంగానే ఉంది. ఏ మాత్రం ప్రత్యేక వ్యక్తీకరణ ఉన్నా పుస్తకాలు వేయడానికి ముందుకు రారు. వచ్చినా, పారితోషికం అటుంచి కొన్నిసార్లు వాళ్ల రచనలపై కాపీరైట్లు వదులుకుంటున్నారు. లేదా, వాళ్ళే డబ్బులు పోసి పుస్తకాన్ని అచ్చేసి, అది షాపులకిచ్చి, వాళ్ళు డబ్బు ఇవ్వకపోతే ఉసూరుమంటున్నారు. వీళ్ళల్లో కొందరికి ఎలమి ద్వారా ఈ అవస్థ తప్పించినా నాకు సంతృప్తే!
6. మీ ప్రచురణ సంస్థతో ఎంతవరకూ ఈ కొరతను తీర్చారు అనుకుంటున్నారు?
మేమింకా కొరతలు తీర్చే స్టేజ్ చేరుకోలేదు. మా మొదటిపుస్తకం వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదు.
అయితే, ఇప్పటి వరకూ మాకొచ్చిన స్పందనను బట్టి చూస్తే, తెలుగులో నాణ్యమైన పుస్తకాలు తీసుకురావచ్చు, మంచి అంశాలు, మంచి రూపకల్పనతో తీసుకురావచ్చన్న ఆశలు పెద్దగా లేని సమయంలో మేం ఇది మొదలెట్టాం. అలా ఆశపడలేని కొరత ఉండుంటే అది మేం కొంత వరకూ తీర్చినట్టే. అలానే, తెలుగు పాఠకులు మంచి క్వాలిటీని గమనిస్తారు, దాని గురించి ప్రత్యేకించి చెప్తారు అన్నది కూడా మాకు అర్థమైంది. పాఠకులకు కొరత లేదనేదే మా నమ్మకం.
మేం తీర్చాలనుకుంటున్న కొరతల్లో కొన్ని: రచయితలకు పారితోషికం ఇవ్వడం, మామూలుగా తెలుగులో రాని అంశాలపై పుస్తకాలు – ఫిక్షన్, నాన్-ఫిక్షన్ – తీసుకురావడం, అనువాదాలు బానే వస్తున్నా మార్కెట్ పెద్దగా లేని/లేవనిపించే అనువాదాలను తీసుకురావడం వంటివి.
7. ప్రచురణ కర్తలుగా ముందుకు సాగుతున్నారు. ఆడవారిగా మీరు ఎదుర్కుంటున్న మరేమైనా ఇబ్బందులు ఈ సందర్భంగా చెపుతారా?
నేను పెద్ద ఐటీ కంపెనీలో సీనియర్ పదవిలో ఉద్యోగంతో పాటు, ఇలా తెలుగు ప్రచురణకర్తగా మారడమనేది అతి పెద్ద సాహసమే. అసలు పుస్తక నిర్మాణం నుంచి విక్రయం దాకా అన్నీ సమస్యలే, అన్నింటికీ కొత్త పరిష్కారాలు అవసరమే. దానికి తోడు నేను స్త్రీ అవ్వడం వల్ల వచ్చే అదనపు భారం. మనం వివక్షని, వేరుగా చూడ్డాని విపరీత పరిణామాల్లో, పర్యవసానాల్లో మాత్రమే చూస్తుంటాం. కానీ, రోజూవారి పనిలో, చిన్నచిన్నవే ఎక్కువ ఇబ్బంది కలిగిస్తాయి. ఉదా: మగవారు నాయకత్వ పాత్రల్లో లేనప్పుడు, పని పంచుకోవాల్సి వస్తే, బొత్తిగా “నువ్వే ఏది చెప్తే అది చేస్తా” అన్న మోడ్లోకి వెళ్ళిపోతారు. టేబుల్ మీద బాటిల్ తీసేయ్ అంటే, వాళ్ళు బాటిల్ మాత్రమే తీస్తారు. దాని మూత, దానికి సంబంధించిన మరకలు అన్నీ అలానే ఉంటాయి. మళ్ళీ వాటి గురించి ప్రత్యేకించి పూసగుచ్చినట్టు సూచనలు ఇవ్వాలి. అంటే, వాళ్ళని “మేనేజ్” చేయాలి. దానికి బోలెడు ఎమోషనల్ బాండ్విడ్త్ కావాలి. అదే మగవాళ్ళు మగవాళ్ళతో కలిసిపనిజేసినా, లేక వాళ్ళకింద ఆడవాళ్ళున్నా ఇంత ఎమోషనల్ స్ట్రేన్ ఉండదు.
పైగా ఆడవాళ్ళని “అగ్రసివ్”, “కష్టం పనిజేయడం ఆమెతో” అన్న మాటలతో చాలా కాజ్యువల్గా ముద్రవేసేస్తారు. “ఈ పనికి ఇంతకన్నా ఎక్కువ డబ్బులు ఇవ్వను”, “నాకు ఈ డిజైన్ ఇలానే చేయాలి” అని నేను నిర్ణయాలు తీసుకున్న సందర్భాల్లో “మీ పార్ట్నర్స్తో మాట్లాడతాం అయితే” అన్న మాటా ఒకటికి రెండు సార్లు వినిపించింది.
లీడర్షిప్ రోల్స్ లో ఎవరికైనా కష్టమే గానీ ఆడవాళ్ళకు మరీ కష్టం. అందుకే “బ్రేకింగ్ ది గ్లాస్ సీలింగ్” అన్న మాట పుట్టుకొచ్చింది, విజయవంతమైన మహిళా నాయకుల విషయంలో. ఈ సవాళ్ళన్నీ ఉన్నాయి కాబట్టి, హాయిగా ఒక all-women-team ఏర్పాటు చేసుకుని వాళ్ళతో పనిజేసుకుంటే సరిపోతుందనే ఆలోచనకూ నేను వ్యతిరేకం. కలిసి పనిజేయడంలోనూ లింగం, లైంగికత, నేపథ్యాలు, చదువులు, ఆలోచనలు ఎంత వైవిధ్యంగా ఉంటే అంత బాగా పనిజేయగలం. నేర్చుకోగలం. ఎదగగలం. కాస్త సహనంతో, సమన్వయంతో అధిగమించగల ఇలాంటి సమస్యలకు భయపడో, అహాలను గాయపర్చుకుంటేనో గొప్ప అవకాశాలు జారవిడుచుకున్న వారమవుతాం. We’re beautiful because of our differences, only if we learn to embrace them. ఈ సవాళ్ళ, ఇష్యూస్ గురించి ఎంత మాట్లాడగలిగితే అంత మంచిది.
8. పుస్తక ప్రచురణ రంగంలో కోవిడ్ అనంతరం మీరు గమనించిన మార్పులేమిటి?
కోవిడ్ వచ్చే నాటికి వేల సంఖ్యలో పుస్తకాలు వేసి, సడన్గా లాక్డౌన్ వల్ల పుస్తకాలన్నీ గోడౌన్లోనే మగ్గిపోయే పరిస్థితులు ఎదుర్కున్న కొందరి పబ్లిషర్ కష్టాలు నాకు తెలుసు. కానీ, అదే కోవిడ్ సమయంలో, “ఏదన్నా పుస్తకం చెప్పు చదువుకోడానికి” అన్న ఆరాలు, ఈబుక్స్ డౌన్లోడ్ కూడా పెరిగింది.
ప్రచురణ రంగం అంటే అచ్చు పుస్తకాలు మాత్రమే అన్న అభిప్రాయాన్ని మార్చుకోవాలి. రచనను ఎన్ని విధాల ఎన్ని మాధ్యమాల్లో పంపిణీ చేయగలిగితే అంత మంచిది. కోవిడ్ తర్వాత ఈ విషయంలో గణనీయంగానే మార్పు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగానే కాకుండా, మన పక్కింటి కన్నడ వాళ్ళు కూడా ఈబుక్స్, ఆడియో బుక్స్ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టారు. పుస్తకాలు ఒకేసారి వెయ్యేసి కాపీలు వేయకుండా, కావాల్సినన్నే వేసే “ప్రింట్ ఆన్ డిమాండ్”కు కూడా డిమాండ్ పెరిగింది.
9. కోవిడ్ తర్వాత, ఈ పుస్తకాల ఎగ్జిబిషన్ పై మీ అంచనాలు ఎలా ఉన్నాయి?
ఇంతకు ముందో ప్రశ్నకు జవాబిస్తూ మనకు పుస్తకాల షాపుల, లైబ్రరీల కొరత ఉందని చెప్పాను. ఆ లోటును కొంత మేరకు తీర్చేవే ఈ హైదరాబాద్, విజయవాడ బుక్ ఫెయిర్స్. ప్రతీ ఏడాది పుస్తకాలకి ఇంత బడ్జెట్ అని పెట్టుకుని ఒక రెండు మూడు గంటల షాపింగ్లో మొత్తం ఏడాదికి సరిపడా పుస్తకాలు కొనుక్కునే వాళ్ళు నాకు తెలుసు. అలాంటి వారందరికి ఇవి నిజంగానే పండుగలు, జాతరలు.
మనం అంతా పెద్ద విపత్తు నుంచే బయటపడ్డాం. దానికి సెలబ్రేషన్గా పుస్తకాలు చదువుకుంటూ ఉంటే, అంతకన్నా కావాల్సిందేముంది. మేం ఇప్పుడిప్పుడే ఎలమి మొదలెట్టాం కాబట్టి, ఏం అంచనాలు పెట్టుకోవడం లేదు. మేమింకా testing waters అనే ఫేజ్ లోనే ఉన్నాం.
10. మారిన పాఠకుల స్పందనకు, మారిన ప్రచురణా రంగానికి తగినట్టు రచయితల్లో ఎలాంటి మార్పు వస్తే బావుంటుందని మీరు భావిస్తున్నారు?
ముఖ్యంగా, నా తోటి రచయితలకు, నాకన్నా చిన్నవారికి, ఇప్పుడిప్పుడే రాస్తున్నవారికి, రాయాలనుకుంటున్నవారికి కొన్ని సలహాలు/సూచనలు – ఒక పబ్లిషర్గా కన్నా, మరో తోటి రచయితగా చెప్తున్నాను:
1. తెలుగు పుస్తకాలకు మార్కెట్ లేదు, అమ్ముడు పోవు అంటే నమ్మకండి. (మార్కెట్ ఉంది, అమ్ముడు పోతాయని నాలాంటి వెర్రి ఆశావాదులు చెప్పినా నమ్మకండి. :) ) ముఖ్యంగా మార్కెట్, మీ రచనా వ్యాసంగాన్ని డిక్టేట్ చేయకూడదు. మీకు ఏది, ఎలా, ఎప్పుడు రాయాలనిపిస్తే అదే రాయండి.
2. పుస్తకం రాయడం వరకే మీ పని, ఆ తర్వాత ఏం జరిగినా మీకు సంబంధం లేనట్టు వ్యవహరించకండి. ఇది మీ కష్టం. మీ శ్రమ. దీనికి మీరు విలువ ఇచ్చుకోలేకపోతే, ఇంకెవ్వరూ ఎదురొచ్చి ఇవ్వరు. పుస్తకాలు ఒక ప్రచురణకర్తకు ఇచ్చేటప్పుడు పారితోషికం ఎంతో అడగండి. “డబ్బులు ఇవ్వలేం” అంటే కనీసం కాపీల రూపంలో అయినా అడగండి. ఇవేవీ కాకున్నా, మీ రచనలను కొన్నేళ్ళు గడిచాక లేదా ఆ పుస్తకం అవుట్-ఆఫ్-ప్రింట్ అయ్యాక, మీరు ఇంకెక్కడన్నా ప్రచురించుకునే హక్కు మీ దగ్గర ఉండాలి. ఇవ్వన్నీ నోటి మాటలుగా కాకుండా కాగితంపై ఉండాలి.
3. టెక్నాలజీ మారుతుంది. తెలుగులో టైప్ చేయడం దగ్గర నుంచి పుస్తకాలను అమ్మే విషయం వరకూ అన్ని చోట్లా టెక్నాలజీ ప్రభావం చూపిస్తోంది. వాటిని కొద్దిగా అయినా గమనించండి. వీలైతే అవగాహన పెంచుకోండి. “తెలుగు రచయితగా నీ పుస్తకం వేయడమే గొప్ప. ఇంకా డబ్బు, గౌరవం కూడా కావాలా?” అన్న ధోరణిని నిర్మొహమాటంగా తిరస్కరించడం. మీ పుస్తకం కాస్త ఆలస్యంగా వచ్చినా పర్లేదు, కానీ అది మీకు బాధను మూటగట్టుకుని తేకూడదు.
4. మీ రచనలని మీరు ప్రమోట్ చేసుకోడానికి వెనుకాడకండి. మొహమాటలకు పోకండి. మీకు వీలైనప్పుడల్లా మీ రచనా వ్యాసంగం గురించి సోషల్ మీడియోలో పంచుకుంటూ ఉండండి. ఒకసారి మీకు పాఠకులు ఏర్పడితే, మీ రచనలు రావడంలో సవాళ్ళు తగ్గుతాయి.
ప్రస్తుతం తెలుగు పుస్తకాల సీన్ కొంచెం నిరాశాజనకంగా ఉండచ్చు, కానీ మన జీవితకాలాల్లోనే ఈ పరిస్థితి మారనూ వచ్చు. భారతీయ భాషా సాహిత్యంపై ఇంతకు ముందెన్నడూ లేని ఫోకస్ ఇప్పుడు ఉంది. పెరుగుతుంది. “తెలుగులో ఎవరేం రాస్తున్నారు?” అన్న ఆసక్తి అంతటా ఉంది. అందుకని రచయితలుగా, మన రచనా వ్యాసంగాన్ని కొనసాగిద్దాం. బిజినస్కు సంబంధించిన కొన్ని విషయాలు గమనించుకుందాం.
11. మీ ప్రచురణా సంస్థ భవిష్యత్తు ఆలోచనల గురించి చెప్పండి?
మేమింకా testing-waters phaseలో, ఒక experimental phaseలో ఉన్నాం. మా ముందున్న ప్రధాన ప్రశ్నలు: ఒక రచయిత తీసుకొచ్చే ప్రత్యేక ధృక్పథానికి సరైన వేదికనిస్తూ, పుస్తక నిర్మాణంలో అన్ని విధాల నాణ్యతను పాటిస్తూ, రచయితకు ఎంతో కొంత పారితోషికం ఇస్తూ, తెలుగు పాఠకులకు సరసమైన ధరలకు తెలుగు పుస్తకాలు అందించగలమా? ఈ ప్రశ్నలో కొన్ని చిక్కుముడులు విప్పడానికే ప్రస్తుతానికి నా పుస్తకాలు (పూర్ణిమ) వేస్తున్నాం. ఇప్పటికి తీసుకొచ్చిన రెండు పుస్తకాల ద్వారా: తెలుగు యూనికోడ్ ఫాంట్స్లో ఉన్న పరిమితులు, బుక్ మేకింగ్కు వాడే ఇన్డిజైన్ లాంటి టూల్స్ – వాటికి ప్రత్యామ్నాయాలు, కవర్ డిజైన్కు కాస్త డబ్బు-శ్రద్ధ పెట్టి చేయిస్తే వచ్చే స్పందనలు, పుస్తకాల పోస్టింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వగైరాల గురించి కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. ఇంకొన్ని నేర్చుకుని, మేం నష్టాల్లో కూరుకుపోకుండా, రచయితకు తగిన పారితోషికం ఇచ్చే స్టేజ్ కి వచ్చాక ఇతరుల పుస్తకాలూ వేస్తాం.
మేం అనువాదాలకు ప్రత్యేక స్థానం ఇస్తాం. వాటితో పాటు వివిధ అంశాలకు చెందిన ఫిక్షన్, నాన్-ఫిక్షన్ తెలుగులో తీసుకురావాలని, కొత్త రచయితలను కొత్త వ్యక్తీకరణలను ప్రోత్సహించాలని, “ఇదే సాహిత్యం, ఇలా ఉంటేనే సాహిత్యం” అని గిరిగీసుకోకుండా వీలైనన్ని రచనలు తీసుకురావాలని మా ఆకాంక్ష.
12. అందరిలా కాకుండా మీరు ప్రచురించే పుస్తకాలు ఏ ప్రత్యేకతలతో తీసుకువస్తున్నారు?
కంటికి కనిపించే ప్రత్యేకతలు:
పుస్తకంలో విషయాన్ని అమర్చే విధానంలోని ప్రత్యేకత. మంటో అనువాదాలను “విభజననాటి హింస” అనే థీమ్ తీసుకుని దాని చుట్టూ ఒక రిసర్చ్ పుస్తకంగా కూడా పనికొచ్చే విధంగా రూపుదిద్దాం. అలానే “ఎమోషనల్ ప్రెగ్నెన్సీ” కథలను “మానసిక సమస్యలు బంధాలపై చూపే ప్రభావం” అన్న థీమ్తో అమర్చాము. ఇవి ఆయా అనువాదకుల, కథకుల (అంటే నేనే :) ) ధృక్పథానికి మేం ఇస్తున్న విలువ. పుస్తక నిర్మాణంలో తీసుకుంటున్న జాగ్రత్తలు. మరీ ఎక్కువ డబ్బులు పెట్టకుండా (అంటే పుస్తకం ఖరీదు పెరక్కుండా) వీలైనంత నాణ్యతను తీసుకురావడం మా ప్రత్యేకత. మా కవర్ డిజైనింగ్ అట్టను కాసేపు ఆగి చూసేలా ఉంటుంది. డిటిపి చేయించడం నుంచి తేలిగ్గా, కంటికి సులువుగా ఉండే పేపర్ ఎన్నిక వరకూ మేం తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
కంటికి కనిపించని ప్రత్యేకతలు
పని బాగా చేసి ఒక మంచి ప్రాడెక్ట్ బయట పెట్టడంతో పాటు, ఆ పనిని వీలైనంత సరళతరం చేసుకుంటూ ఉండడం కూడా అవసరమే. డిటీపీ, తెలుగు ఫాంట్స్ విషయంలో ఉన్న కొరతను గమనించి వాటిని ఒక స్ట్రాటర్జీతో వాడుతున్నాం. కొత్త విధానాలు కనిపెట్టడానికి శ్రమిస్తున్నాం. ఆ విధానాల్లో ఏవన్నా విజయవంతమైతే ఇతర తెలుగు పబ్లిషర్లకు కూడా అందుబాటులో ఉండే విధంగా వాటిని ఓపెన్ సోర్స్ చేయాలన్నది ఆలోచన. మంచి ప్రాడెక్ట్ బయటపెట్టడంతో పాటు, ఆ ప్రయాణంలో పాల్గొన్న అందరూ కూడా సంతోషంగా, సంతృప్తిగా ఉండాలన్నది ఎలమి ఆశయం. అందుకే, పెట్టిన శ్రమకు తగ్గ పారితోషికం ఇవ్వడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. అలా అని ఆ భారాన్ని పాఠకుల మీద వేయడం లేదు. ప్రస్తుతం మా జేబుల్లోంచి వెళ్తున్నాయి. కానీ పాఠకులు ఆదరిస్తూ, పుస్తకాల కాపీలు ఎక్కువ అమ్మగలిగితే రచయితలు-బుక్ మేకర్స్-పబ్లిషర్స్-డిస్ట్రిబ్యూటర్స్-పాఠకులు మొత్తం ఆ వాల్యూ చెయిన్ అందరూ సంతోషంగా ఉండగలరు.
13. సాదత్ హసన్ మంటో రచనల అనువాదం తరువాత మీరు తీసుకువస్తున్న పుస్తకాలు ఏమిటి?
మంటో అనువాద పుస్తకం “సియా హాషియే” మా తొలి ప్రచురణ. రెండోది పూర్ణిమ కథల పుస్తకం “ఎమోషనల్ ప్రెగ్నెన్సీ”. ఈ రెండూ మార్కెట్లో ఉన్నాయి. మూడో పుస్తకం నిత్యజీవితంలో టెక్నాలజీ వాడకంపై అవగాహన పెంచే వ్యాసాలు. అది ఫిబ్రవరి నాటికి రావచ్చు.
14. ఈ బుక్ ఫెయిర్ లో ఏ పుస్తకాలు ఉండబోతున్నాయి.
ఎలమి ద్వారా ఈ బుక్ ఫెయిర్లో రెండు పుస్తకాలు ఉండబోతున్నాయి:
1. సియా హాషియే: విభజన నాటి నెత్తుటి గాయాలు – సాదత్ హసన్ మంటో
2. ఎమోషనల్ ప్రెగ్నెన్సీ: కథలు – పూర్ణిమ తమ్మిరెడ్డి
-శ్రీశాంతి మెహెర్.
Updated Date - 2022-12-27T08:45:25+05:30 IST