ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad Book Fair : ఎంత ప్రళయం వచ్చినా.. పుస్తకం వాళ్లవల్లే బతికుంది..!

ABN, First Publish Date - 2022-12-24T22:49:07+05:30

వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ పేజీల్లో అదే నినాదం..

Hyderabad Book Fair
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖలో సబ్-రిజిస్ట్రార్ గా ఉద్యోగం చేస్తూ, తెలుగు పుస్తకానికి ముఖ్యంగా బాలల సాహిత్యానికి తనవంతు కృషి చేస్తున్న రచయిత, ప్రచురణ కర్త దాసరి వెంకటరమణ. దాదాపు 500 రచనలు చేసి, బాలసాహిత్యంలో ఆనందం పుస్తకానికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డుతో పాటు తెలుగు యూనివర్సిటీ అవార్డును కూడా అందుకున్నారు. వీరు కథామృతం పేరుతో పిల్లల పుస్తకాలను ప్రచురిస్తున్నారు. ఆయన పిల్లల కోసం చేసిన రచనలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగో తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ లోనూ, మహారాష్ట్ర ప్రభుత్వం 8 వతరగతి, 12 వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్స్ లోనూ చోటు చేసుకున్నాయి. ఇన్నేళ్ల సాహిత్య అభిలాషను , సాహిత్యలోకాన్ని పిల్లలకు అందించే క్రమంలో తన అనుభవాలను బుక్ ఫెయిర్ సందర్భంగా ఆంధ్రజ్యోతి వెబ్ తో దాసరి వెంకట రమణ ఆత్మీయ సంభాషణ..

1. ఎన్నేళ్లుగా పుస్తకాల పండుగలో పాల్గొంటున్నారు.

2013 నుండి పుస్తక ప్రదర్శనలో పాల్గొంటున్నాను. మా స్టాల్ పేరు కథామృతం (Kathaamrutam) గతంలో బాలసాహిత్య పరిషత్ పేరుతో పెట్టేవాళ్ళం ఇప్పుడు స్టాల్ పేరు మార్చాం.

2. మీరు చేస్తున్న వృత్తి వేరు కదా మరి పుస్తకాలను అందరికీ చేరువ చేయాలనే ఆకాంక్ష ఎలా కలిగింది.

పుస్తకం మీద ప్రేమ నాతో ఈ పని చేయిస్తుంది. పుస్తకం హస్త భూషణం అనేది నాటి సామెత. పుస్తకం మస్తాకాన్ని వెలిగించే దీపం అనేది నేటి నానుడి.

3. మీ వైపు నుంచి ఈ సంవత్సరం ఎటువంటి పుస్తకాలు బుక్ ఫెయిర్ లో ఉండబోతున్నాయి.

ఈ మధ్య కాలంలో వెలువడిన బాల సాహిత్యం అంతా వివిధ పబ్లికేషన్స్ నుండి తెప్పించి ప్రదర్శనలో పెడతాను. పిల్లలకు సంబంధించిన అన్ని పుస్తకాలు ఒకే చోట అనేది మా నినాదం. కథామృతం ( Kathaamrutam) మా స్టాల్ నంబర్ 82, 83. దాసరి వెంకటరమణ, 9000572573.

4. సాహిత్యాన్ని చిన్న వయసు నుంచే పరిచయం చేయడం గురించి మీ ఉద్యేశ్యం ఏమిటి.

మనిషిని సంస్కరించి మంచి వైపు మరల్చగల మహత్తర శక్తి సాహిత్యానికి వుంది. అయితే అది చాలా లేత వయసులో జరుగినపుడు మాత్రమే ప్రభావం అధికంగా ఉంటుంది.

Also Read- Hyderabad Book Festival: భానుమతీ రామకృష్ణ అత్తగారు ఎవర్ గ్రీన్..!

5. ఈ మధ్య కాలంలో పుస్తకాలు చదివేవారి సంఖ్య పెరిగిందా? తగ్గిందంటారా?

పుస్తకాలు చదివే వారి సంఖ్య విషయంలో 1960 నుండి 1990 వరకు స్వర్ణ యుగమని చెప్పాలి. ఆ తర్వాత ఆ సంఖ్య మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. అందుకు అనేక కారణాలు. ముందు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన చానెల్స్. అంతకు ముందు ఒక్క దూరదర్శన్ మాత్రమె ఉండేది. మనిషికి మనిషికి మధ్య కూడా మాటలను తగ్గించి, బంధాలను దూరం కావడానికి కూడా ఈ చానెల్స్ దోహదపడ్డాయని చెప్పవచ్చు. ఆ తర్వాత అంతర్జాలం, సెల్ఫోన్లు. ఎప్పుడైతే ఇంటర్నెట్ సేవలు సామాన్యునికి అందుబాటులోకి వచ్చాయో, ఫేస్ బుక్, వాట్సాప్ లాంటి మాధ్యమాలు మనిషిని పుస్తకం నుండి పూర్తిగా దూరం చేశాయి. అయినా ఎంత ప్రళయం వచ్చినా పుస్తకం మీద ప్రేమ సడలని, చేతిలో పుస్తకం వదలని మహానుభావులు కొంతమంది అన్ని కాలాల్లోనూ కొనసాగడం ప్రస్తుతం పుస్తకం బ్రతికుండానికి కారణం.

6. పిల్లల్ని పుస్తకాలు చదివించేలా చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?

ఇది ప్రాథమికమైన పని. చాలా ముఖ్యమైన పని కూడా.

పిల్లలకు పుస్తకాలతో పరిచయం

వారి భవిష్యత్తుకు మహోదయం.

పుట్టుకతో ఎవరూ అలవాట్లను నేర్చుకొని పుట్టరు. అది ఏ అలవాటైనా కానివ్వండి. పిల్లలు పరిసరాలను బట్టి నేర్చుకుంటారు. ఇంట్లో, బడిలో, సమాజంలో ఏం జరుగుతుందో అదే అలవాటు చేసుకుంటారు. పెద్దలు ఏది అలవాటు చేస్తే పిల్లలు అదే అలవాటు చేసుకుంటారు. గతంలో మనిషికి ఇంట్లో వినోద సాధనాలు ఉండేవి కాదు. బయట సినిమాలకు వెళ్ళాలి. సినిమాలు కూడా లేని కాలంలో, లేదూ అందుబాటులో లేని ప్రాంతంలో నెలకోసారి ఏ హరి కథనో, బుర్రకథనో లేక ఏ తోలుబొమ్మలాటనో చూసేవాళ్ళు. అవన్నీ ఒక ప్రత్యేక సమయం కేటాయించుకుంటేనే అందుబాటులోకి వచ్చేవి. అలాంటి పరిస్థితిలో పుస్తకాలు మాత్రమే ఏకైక వినోద సాధనం.

పిల్లలు తరగతి పుస్తకాలతో విసుగనిపిస్తే, బయటికి వెళ్లి ఆడుకునేవారు. ఇంకా విసుగనిపిస్తే చందమామ, బొమ్మరిల్లు వంటి పుస్తకాలు ముందేసుకొని చదువుకునే వారు. ఇప్పుడు కాలం మారింది. జీవన విధానంలో చాలా వేగం పెరిగింది. వినోద సాధనాలు పెరిగాయి. పిల్లలకు టీవీలు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ ముఖ్యంగా సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో పిల్లలకు పుస్తకాలు అలవాటు చేయాలంటే ఒక పధ్ధతి ప్రకారం మాత్రమే చేయగలం.

7. పిల్లలకు మీరు అందించిన పుస్తకాలు సరే వారికి అలవాటు చేసిన నినాదం గురించి చెప్పండి?

దాదాపు పదిహేనేళ్ళ క్రితం చొక్కాపు వెంకటరమణ అధ్యక్షుడిగా, నేను ప్రధాన కార్యదర్శిగా నడుస్తున్న మా బాలసాహిత్య పరిషత్తు పక్షాన బోకే వద్దు. బుక్కే ముద్దు అనే నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేశాము. మేము చేసే ప్రతి కార్యక్రమంలో ప్రతి వేదిక పైన ఈ నినాదాన్నే ప్రకటించాం. ఆ నినాదానికి విస్తృతమైన ప్రచారం లభించింది. ఒక ప్రముఖ దినపత్రిక కూడా ఈ నినాదాన్ని తన సంపాదకీయంలో ఉటంకించింది. ఆ రోజుల్లో చాలా వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్ లోనూ ఇంకా చాలా సందర్భాల్లో ఆ నినాదం కనిపించింది. ఆ నినాదంతో పాటు మేము ప్రచారం చేసిన అంశం ఏమిటంటే, పిల్లలకు పుట్టిన రోజు సందర్భాల్లో మంచి మంచి పుస్తకాలను బహుమతిగా ఇవ్వడం. ఆ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చేటప్పుడు మొదటి పేజీలో మీ పిల్లల వ్యక్తిత్వం గురించి మంచి కామెంట్ రాసి బహుమతిగా ఇస్తే, ఆ పుస్తకం మీ పిల్లలు దాచుకోవాలనుకుంటారు. ఆ విధంగా ఆ పుస్తకం మీ పిల్లలకు మరింత చేరువ అవుతుంది. మీ పిల్లల మిత్రుల పుట్టినరోజు సందర్భాల్లో కూడా, వాళ్ళను ఏదైనా పుస్తకం కొని బహుమతిగా ఇచ్చే అలవాటు చేయడం. ఇదొక మంచి సంప్రదాయం, పుస్తకం బ్రతకడానికి ముఖ్యమైన ప్రాణవాయువు.

Also Read- Kalvakuntla kavitha: చిన్న చిన్న పదాలతో అల్లిన అద్భుతం వల్లంకి తాళం రచన..!

ప్రతి మనిషికీ మనసులో ఎదో ఒక వ్యాపకం పెట్టుకోవాలని ఉంటుంది. చిన్న తనంలో ఏ అంశమైతే ఎక్కువగా ఆకర్షిస్తుందో దాన్ని తన వ్యాపకంగా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ముందు ఏ వ్యాపకానికైతే అలవాటు పడతారో దానికి అతుక్కుపోతారు. ఆ విధంగా మనం ఈ అలవాటును కొనసాగించి నట్టయితే, కొంతకాలానికి వాళ్ళ దగ్గర కొన్ని పుస్తకాలు పోగవుతాయి. "అబ్బా నీ దగ్గర ఒక లైబ్రరీ తయారయ్యిందే" అంటూ మనం వారిని ప్రోత్సహిస్తూ, లైబ్రరీ అంటె, ఏమిటి దాని వలన ఉపయోగాలు ఏమిటి మొదలైన అంశాలు వాళ్లకు చెబితే, వాళ్ళ మనసులో ఇంట్లో తనకంటూ స్వంత లైబ్రరీ ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచన నాటితే చాలు, ఒక మొక్కను నాటినట్టే. మరికొంత ప్రోత్సాహంతో ఆ మొక్క పెరిగి పెద్ద మానవుతుంది. ఆ వయసులో పిల్లలు, వారి వారి పరిసరాలను హోదాను, ఆర్ధిక పరిస్థితిని బట్టి, అగ్గిపెట్టల బొమ్మలు, సిగరెట్ పెట్టల కాగితాలు, గ్రామీణ పిల్లలైతే, చింత గింజలు మొదలైనవి, బాగా ధనవంతులైన పిల్లలైతే, స్టాంపులు, కాయిన్స్, కరెన్సీ నోట్లను సేకరించి, భద్ర పరచడం అనే అలవాటును చేసుకుంటూ ఉంటారు. వారికి ముందుగా మనం పుస్తకాన్ని పరిచయం చేస్తే, పుస్తకాలనే సేకరిస్తూ, ఇంట్లో లైబ్రరీ ఏర్పాటు చేసుకుంటారు. ఇది నా స్వానుభవం. పుస్తకాల లైబ్రరీతో పాటు చందమామలను సేకరించడమే ఒక వ్యాపకంగా పెట్టుకున్నాను. నేను చందమామ పుస్తకాలను సేకరించడం మొదలు పెట్టి 1947 జూలై సంచిక నుంచి, చివరి సంచిక 2013 అక్టోబర్ వరకూ మధ్యలో ఒక పది పదిహేను తప్ప మొత్తం చందమామ పుస్తకాలను సేకరించాను.

8. బాల సాహిత్యాన్ని పిల్లలకు అందించడానికి తీసుకోవలసిన చర్యలు ఏమిటి? ఎవరు దీనికి బాధ్యత వహించాల్సి ఉంది.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు తాతయ్య, అమ్మమ్మలు మనవళ్ళను, మనవరాళ్ళను దగ్గర కూచోబెట్టుకొని, ఊరిస్తూ, మంచి మంచి కథలూ, కబుర్లూ చెప్పేవారు. కథ పిల్లల మానసిక ఎదుగుదలకు చాలా దోహదం చేస్తుంది. ముందు కథలు వింటూ పెరిగిన పిల్లలు చదవడం అలవాటు కాగానే, చందమామ, బొమ్మరిల్లు వంటి అందమైన బొమ్మలతో కూడిన పుస్తకాలవైపు ఆకర్షింపబడతారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ విషయంలో నేటి పిల్లలు చాలా దురదృష్ట వంతులు అని చెప్పాలి. దీనికి ఎవరు బాధ్యత అని తర్కిస్తే, తిరిగి గొంగట్లో కూర్చొని, వెంట్రుకలను ఏరడం అవుతుంది. అయితే ఈ విషయంలో కొంత ఆశావహమైన అంశం ఏమిటంటే, ఈ మధ్య చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లలకు చెప్పడానికి మంచి మంచి కథల పుస్తకాలను ఇవ్వండి అనే వారి సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతోంది.

9. పుస్తకాల విషయంలో అమ్మకాలు కరోనా తరువాత ఎలా ఉన్నాయి.

మిగతా రంగాల మాట ఏమో కానీ కరోనా ప్రభావం పుస్తకాల మీద చాలా ఉంది. కరోనా కర్కశంగా ఎన్నో దిన, వార, మాస పత్రికలను మింగేసింది. దశాబ్దాల పాటు కొనసాగిన పత్రికలు కూడా ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆ భయంకర వాతావరణం నుండి పుస్తకం ఇప్పుడిప్పుడే బయటపడి ఊపిరి పీల్చుకుంటోంది. ఇప్పుడు జనం కరోనాను పూర్తిగా మర్చిపోయారు. మళ్ళీ మామూలు పరిస్థితి వస్తుందని ఆశిద్దాం.

10. కంప్వ్యూటర్, ట్యాబ్స్, సెల్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాక పిల్లలకోసం సెల్ ఫోన్, యూ ట్యూబ్ లో అనేక ఛానల్స్ యానిమేషన్ కథలను పరిచయం చేస్తున్నాయి. మరి వీటి మధ్య పుస్తకం అలవాటు నిలిచే ఉంటుందంటారా?

ఈ విషయం నూటికి నూరు శాతం నిజం. విభ్రమం కలిగించే కఠోర వాస్తవం ఏమిటంటే, నేటి పిల్లల్లో తెలుగు కథల పుస్తకం తీసుకొని గడగడ చదివే వాళ్ళ సంఖ్య చాలా స్వల్పంగా వుంటుంది. పది పాసయిన పిల్లలు సైతం చాలా మందికి తెలుగు చదవడం, రాయడం రావడం లేదు. అలాంటి పిల్లలకోసం సెల్ ఫోన్ లో అనేక యాప్ లు వచ్చాయి. యూ ట్యూబ్ లో అనేక ఛానెళ్ళు వచ్చేవి. కథామృతం అనే ఛానెల్లో నేను వరుసగా తెలుగు కథలను సరళంగా పిల్లలకు, పెద్దలకు అర్థం అయ్యేలాగు చదువుతున్నాను. యూ ట్యూబ్ లో @kathaamrutam162 అని టైప్ చేసి ఆ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చదవడం, రాయడం రాని పిల్లలకు కథలు అందుబాటులో ఉంచడానికి ఉపయోగ పడతాయి. ఇలాంటి పరిస్థితుల నుండి బయట పడాలంటే బడిలో ఉపాధ్యాయులతో పాటు తల్లి దండ్రులు కూడా తమ పిల్లలకు ఇంట్లో తెలుగు మాట్లాడటం చదవడం అలవాటు చేయాలి. తెలుగు మాట్లాడటమే చిన్నతనంగా భావించే పెద్దల గురించి నేను ఏమీ చెప్పలేను.

ఒక రచనను కంప్యూటర్ లోనో, ట్యాబ్ లోనో, సెల్ ఫోన్ లోనో చదివి చూడండి, ఆ తర్వాత ఒక పుస్తకం తెరిచి కొత్తదనపు ఆ పుస్తక పరిమళాన్ని ఆస్వాదించి, పేజీలు తిరగేస్తూ చదవండి అలౌకికమైన భావన, అనిర్వచనీయమైన ఆనందం మీ స్వంత మవుతుంది. ఆ భావన, ఆ ఆనందం కేవలం అనుభవైకవేద్యం. అలాంటి సజీవ సహజమైన పుస్తకానికి శాశ్వతత్వాన్ని ఆపాదించడానికి రండి... ఈ సారి పుస్తక ప్రదర్శనకు, బుక్ ఎగ్జిబిషన్ కు మీ పిల్లలతో రండి. ఒక కొత్త సరికొత్త అనుభూతితో తిరిగి వెళ్ళండి.

పుస్తకాలను వెలేసినవాడు

మస్తకాలను వెలిగించలేడు

పుస్తకాలను ప్రేమించలేనివాడు

మనుషులను ప్రేమించలేడు

పుస్తకాన్ని ఆస్వాదించలేని వాడు

అసలు జీవితాన్నే ఆనందమయం చేసుకోలేడు.

-శ్రీశాంతి మెహెర్.

Updated Date - 2022-12-26T10:48:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising