Super Star Krishna: కథను మార్చకపోతే ఫ్లాప్ అవుతుందని ముందే చెప్పిన కృష్ణ.. 32 ఏళ్ల తర్వాత మహేశ్ కూడా..!
ABN, First Publish Date - 2022-11-15T13:28:54+05:30
సినిమా అట్టర్ ఫ్లాపు అయినా, దాని ఆనవాళ్లు చెరిగిపోయినా, కనీసం యూట్యూబు వంటి మాధ్యమాల్లో కూడా దాని కాపీ దొరక్కపోయినా, కేవలం ఒక్క పాట వల్ల దాని ఉనికి కొనసాగడం చాలా అరుదు.
సినిమా అట్టర్ ఫ్లాపు అయినా, దాని ఆనవాళ్లు చెరిగిపోయినా, కనీసం యూట్యూబు వంటి మాధ్యమాల్లో కూడా దాని కాపీ దొరక్కపోయినా, కేవలం ఒక్క పాట వల్ల దాని ఉనికి కొనసాగడం చాలా అరుదు. సూపర్ స్టార్ కృష్ణ వల్ల అటువంటి అరుదైన గుర్తింపు పొందిన సినిమా- 'గౌరి'. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం (1974) విడుదలయ్యి కనుమరుగైన ఆ సినిమాని తలుచుకోవడం అంటూ జరుగుతుందంటే 'గల గల పారుతున్న గోదారిలా...' అనే పాట మాత్రమే కారణం.
గల గల పారుతున్న గోదారిలా
రెప రెప లాడుతున్న తెరచాపలా...
ఈ చల్లని గాలిలా... ఆ పచ్చనీ పైరులా...
నీ జీవితం సాగనీ... హాయిగా...
... అంటూ దాశరథి రాసిన ఆ పాటకి సత్యం సంగీతం సమకూర్చితే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. హీరో కృష్ణ మీద చిత్రీకరించిన ఆ పాట ఆ రోజుల్లో చాలా పాపులర్ అయ్యింది.
"దేశానికాయువు పోసే ఈ పల్లెలు...
చల్లంగ ఉండిననాడే సౌభాగ్యమూ
సత్యం ధర్మం నిలుపుటే...
న్యాయం కోసం పోరుటే...
పేదల సేవలు చేయుటే... జీవితం..." అని హీరో ఉదాత్తమైన మనస్థత్వాన్ని ప్రతిఫలిస్తుంది ఈ పాట.
కానీ, ఈ సినిమా ఫ్లాపు అవుతుందని నిర్మాత ఎన్.వి. సుబ్బరాజుకి ముందే చెప్పారట కృష్ణ. ఎందుకంటే, ఈ సినిమా 14వ రీలులో హీరోని విలన్స్ చంపేస్తారు. ఆ తర్వాత 16వ రీలులో ఆ దుర్గ్మార్గుల మీద హీరోయిన్ గౌరి (జమున) పగతీర్చుకుంటుంది. ఈ సినిమాకి కథకుడు స్వయానా నిర్మాత సుబ్బరాజే. హీరోయిన్ ఓరియంటెడ్ గా రాసుకున్న ఆ కథ బాగానే ఉందిగానీ, హీరోగా తాను నటించి, తన పాత్ర మధ్యలో చనిపోతే అభిమానులు సహించరని, ప్రేక్షకులు చూడరనీ కృష్ణ ఆయనకి చెప్పి చూశారటా. హీరో చనిపోయాక, గౌరికి పుట్టిన వాడు పెరిగి పెద్దవాడై ప్రతీకారం తీర్చుకున్నట్టు పెడితే బాగుంటుందని కూడా కృష్ణ సూచించారని కథక- నిర్మాత సుబ్బరాజు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు.
అందులోనూ, 'అల్లూరి సీతారామరాజు' విడుదల అయిన మూడునెలలకి గౌరి విడుదల కావడం కూడా ఈ సినిమా పరాజయం పాలవడానికి మరో ముఖ్యకారణం. గలగల పారుతున్న గోదారిలా అనే పాట తప్ప మరింకేమీ గుర్తుపెట్టుకోవడానికి లేకుండా పోయింది 'గౌరి '.
ఆ పాపులర్ పాటలో మొదటి వాక్యాన్ని తీసుకొని...
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరలా
నా కోసమై నువ్వలా కన్నీరుగా మారగా
నాకెందుకో ఉన్నది హాయిగా...
... అంటూ గౌరీ సినిమా విడుదలయిన 32 ఏళ్ల తర్వాత మహేష్ బాబు ‘పోకిరి’ సినిమాలో రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రీమిక్స్ గీతానికి మణిశర్మ సంగీతం, కందికొంద సాహిత్యం అందిస్తే, నీహాల్ పాడాడు.
Updated Date - 2022-11-15T13:53:38+05:30 IST